Tuesday, May 26, 2015

ఏడాది పాలనలో ప్రజామోదీ..

365 రోజులు పూర్తయింది.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ప్రజలు ఇచ్చిన సమయం ఐదేళ్లు.. అప్పుడే ఏడాది పూర్తయింది.. ఈ సంవత్సర కాలంలో మోదీ ఏం చేశారు అన్నది సమీక్షించి, రాబోయే నాలుగేళ్లు ఏం చేయబోతారన్నది బేరీజు వేయడం న్యాయమే.. అదే సమయంలో అన్యాయమైన విమర్శలు చేసేవారి పట్ల కాస్త అప్రమత్తంగా ఉండటం అవసరం.. నిజం నిద్రలేచే లోపు అబద్ధం లోకాన్ని చుట్టి వస్తుందనే నానుడిని ఇక్కడ గుర్తు చేసుకోవాలి..
నరేంద్ర మోదీ ఏడాది పాలనలో అవినీతి, కుంభకోణాలు కనిపించాయా?.. గతంలో మాదిరిగా భారీగా నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయా?.. విదేశాల్లో భారత దేశ ప్రతిష్ట పెరిగిన మాట వాస్తవం కాదా?.. మన దేశ ఆర్థిక వృద్ధి గణనీయంగా పెరగడం, ద్రవ్యోల్భనం సగానికి తగ్గడం, దేశంలో విద్యుత్ ఉత్పాదన ఘననీయంగా పెరగడం, పారిశ్రామిక ప్రగతి పుంచుకోవడం ఎవరి పుణ్యం?.. మేకిన్ ఇండియా, స్వచ్ఛ భారత్, నీతి ఆయోగ్ ఏర్పాటు, స్మార్ట్ సిటీస్, బేటీ బచావో-బేటీ పడావో, జన్ ధన్ యోజన, ముద్రా బ్యాంకు, పేదలకు కారు చౌకగా బీమా, పెన్షన్ పథకాలు ఎవరికి లబ్దిని కలిగిస్తాయి?.. మన్మోహన్ పదేళ్ల పాలన, మోదీ ఏడాది పాలనను బేరీజు వేసుకొని చూడండి..
మోదీని ఎన్నారై ప్రధాని అని విమర్శిస్తున్న వారు ఓ విషయాన్ని గమనించాలి.. యూపీఏ పాలకుల హయాంలో మన విదేశాంగ విధానం గాడి తప్పింది.. మన ఇరుగు పొరుగున ఉన్న చిన్న దేశాలు సైతం మనను బెదిరించే స్థాయికి ఎదిగాయి.. పాకిస్తాన్, చైనా సాగించే అగడాలు అన్నీ ఇన్నీ కావు.. అంతర్జాతీయంగా మనకు మద్దతు ఇచ్చేవారు పెరిగితే ఇలాంటి వాటికి చెక్ పెట్టడం సాధ్యం అవుతుంది.. ఇందుకు దూరదృష్టి అవసరం, దేశానికి ఘననీయంగా పెట్టుబడులు వచ్చినప్పుడే పారిశ్రామిక అభివృద్ధి ఉపాధి కల్పన సాధ్యం అవుతుంది.. ఇవన్నీ రాత్రికి రాత్రో, ఏడాదిలోగానో పూర్తయ్యే పనులు కావు.. అయినా ఫలితాలు కనిపిస్తున్నాయి.. మన ప్రధాని వెళ్లిన ప్రతి దేశంలోనూ అక్కడి ప్రవాస భారతీయులను కలుస్తున్నారు.. వారిలో ఉత్సాహాన్ని నింపుతూ మాతృదేశాభివృద్ధిలో భాగస్వాములను చేస్తున్నారు..
ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగా నరేంద్ర మోదీ విదేశాల నుండి నల్ల ధనాన్ని రప్పించలేదు.. ధనికులు-పెట్టుబడి దారుల కొమ్ము కాస్తోంది.. భూసేకరణ చట్టంతో రైతులకు అన్యాయం చేస్తోంది అనే విమర్శలు చేస్తున్నవారు ఒక విషయాన్ని ఆలోచించాలి.. ప్రధాని పదవిలో ఉన్నవారు ఏదైనా ప్రయత్నం చేయకుండా నోరు మూసుకొని మూలన కూచోవాలని కోరుకుంటున్నారా? అలాంటప్పుడు మౌనీ బాబా మన్మోహన్ కు మోదీకి తేడా ఏముంటుంది.. ఏదైనా సాధించాలంటే ప్రయత్నించాలి.. ఆ ప్రయత్నం మొదలైందా లేదా అన్నది గమనించాలి.. మన చట్టాలకు పదును పెట్టడం, విదేశాలపై నల్లధనం రప్పించడ కోసం వత్తిడి తేవడం మీరు గమనించలేదా?.. అక్కడి చట్టాలు, పరిమితుల కారణంగా ఆలస్యం జరగడం వాస్తవం.. ఈ ప్రయత్నాన్ని గత ప్రభుత్వాలు చేశాయా? పెట్టుబడి దారులను భూతాల్లా చిత్రీకరించడం కొందరికి ఫ్యాషన్ అయింది.. వారిని పారిశ్రామికాభివృద్ధిలో భాగస్వాములను చేయడం వల్ల ఉపాధి అవకాశాలు పెరుగుతాయి.. వారికి ప్రభుత్వ పరంగా ఎలాంటి సహకారం అందించకుండా, విదేశాలకు వెళ్లిపోయే పరిస్థితి కల్పించడం వల్ల ఎవరికి ఉపయోగం? ఈ క్రమంలో అవినీతి, కుంభకోణాలు చోటు చేసుకుంటే నిలదీయాలి. కానీ గుడ్డి వ్యతిరేకత వల్ల ఫలితం ఉంటుందా?.. భూసేకరణ చట్ట సవరణ విషయంలో వాస్తవాలకన్నా అవాస్తవాలే ఎక్కువ ప్రచారం అవుతున్నాయి.. పేదలకు, రైతులకు ఏదో అన్యాయం జరిగిపోతోందని ప్రతిపక్షాలు చేస్తున్న రాద్దాంతంలోని మర్మాన్ని కూడా గ్రహించాలి.. రైతులకు నష్టం జరగకుండా చూడాల్సిన బాధ్యతను ప్రభుత్వం ఏ విధంగా విస్మరిస్తుంది?.. మోదీ ప్రభుత్వ తీసుకుంటున్న చర్యలు నష్టాన్ని కలిగిస్తే ప్రజలే బుద్ది చెబుతారు..  నిర్మాణాత్మక విమర్శలు చేయకుండా ఆరోపణలకే పరిమితం అవుతున్న వీరు ఏమి కోరుకుంటున్నారు..

ఏ పని చేసినా బురద జల్లడమే లక్ష్యంగా పెట్టుకున్న వారిని ఒప్పించడం కష్టమే.. మోదీ సూటు బూటు వేసుకుంటున్నారు, సెల్పీలు దిగుతున్నారు అని ఏడ్చేవారు ఆ పని వారూ చేయొచ్చు ఎవరొద్దన్నారు.. ఎందుకిలా ఏడవడం?.. ఇసుక నుండి సైతం తైలం తీయవచ్చు కానీ మూర్కులను రంజిపలేము అని భర్తృహరి తన సుభాషితంలో చెప్పారు.. ఏడాది మోదీ పాలనకు జీరో మార్కులేశారు కొందరు మహానుభావులు.. అచ్చే దిన్ ఏవీ అని తెచ్చి పెట్టుకున్న అమాయకపు ప్రశ్న వేస్తున్నారు.. అచ్చేదిన్ దేశానికి, ప్రజలకే కానీ వారికి కాదు అని గ్రహించడం మంచిది.. ప్రజలే అంతిమ న్యాయ నిర్ణేతలు..

No comments:

Post a Comment