Sunday, May 10, 2015

ఆర్టీసీ సమ్మె ఎంత కాలం? ఎవరికోసం?

ఆర్టీసీ సమ్మెతో ఎవరికి లాభం? ఎవరికి నష్టం?.. లాభం: ప్రయివేటు వాహనాలకు. నష్టం: ముందు ప్రజలకు, ఆ తర్వాత ఆర్టీసీ సంస్థకు, కార్మికులకు, ప్రభుత్వానికి.. ఇక్కడ ఎలాంటి నష్టం లేనిది కార్మిక సంఘాలకు మాత్రమే. ప్రయివేటు ఆపరేట్ల ద్వారా ప్రత్యక్షంగానో, పరోక్షంగానో లాభపడేది రాజకీయ నాయకులే..
ఆర్టీసీ కార్మికుల డిమాండ్లు సహేతుకమే.. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు అధికారం చెలాయిస్తున్న పార్టీలు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయమనే అడుగుతున్నారు కార్మికులు.. ఇతర ప్రభుత్వ ఉద్యోగులతో పోలిస్తే వారి జీతాలు చాలా తక్కువే కాదనలేం.. కానీ మనం కూర్చున్న కొమ్మనే నరుక్కుంటుంన్నాం అనే విషయాన్ని మరచిపోవద్దు..
ఆర్టీసీ బస్సులు తిరగక పోవడం వల్ల సాధారణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆర్థిక స్థోమత ఉన్నవారంతా సొంత వాహనాలు లేదా ప్రయివేటు వాహనాలు ఉపయోగించుకుంటున్నారు.. పేద ప్రయాణీకులు మాత్రం ప్రయివేటు ఆపరేట్ల దోపిడీకి గురవుతున్నారు.. అయితే ప్రయివేటు ట్రాన్స్ పోర్టు వాహనాలు పెరిగిన కొద్దీ పోటీ కారణంగా ఛార్జీలు తగ్గుతాయి.. అప్పుడు ప్రయాణీకులు ఆర్టీసీ బస్సులు ఎక్కమన్నా ఎక్కరు..  అప్పుడు ప్రభుత్వం వీలు చూసుకొని ప్రయివేటీకరణకు దారులు తెరుస్తుంది.. ఇది ఆర్టీసీ కార్మికులకు శరాఘాతమే..
నిజానికి ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితుల్లో ఆర్టీసీ సంస్థ కానీ, ప్రభుత్వం కానీ కార్మిక సంఘాలు కోరుతున్న డిమాండ్లు తీర్చడం కష్టమే.. ఈ విషయం అందరికీ తెలిసిందే.. వారికి వాగ్దానాలు చేసి ఓట్లు పొంది అధికారానికి వచ్చిన పార్టీలు ఇప్పుడు దీన్ని తమకు సంబంధం లేని వ్యవహారంగానే చూస్తున్నాయి. ఎందుకంటే నేను పైన చెప్పిన కారణమే నిజం కానుంది కనక..

మరి కొద్ది రోజుల్లో, ఇంకా స్పష్టగా చెప్పాలంటే కొద్ది గంటల్లోనే ఆర్టీసీ రెండు ముక్కలవుతోంది.. ఏపీఎస్ఆర్టసీ, టీఎస్ఆర్టీసీ ఏర్పడుతున్నాయి.. ఈ రెండు సంస్థల కార్మికుల ప్రయోజనాలకు కాపాడాల్సిందే.. అదే సమయంలో సాధారణ ప్రయాణీకుల సమస్యపై కూడా దృష్టి పెట్టాలి.. ఇది జరగాలంటే కార్మిక సంఘాలు, ప్రభుత్వ పెద్దలు మొండి వైఖరిని పక్కన పెట్టిన మెట్టుదిగిరావాలి.. ఉభయులకు ఆమోద యోగ్యమైన పరిష్కారం ఆచరణ సాధ్యమే.. ఉండాల్సింది చిత్తశుద్ది మాత్రమే..

No comments:

Post a Comment