Tuesday, May 22, 2012

నిజంగా తెల్ల పేపరే..


కొండను తొవ్వి ఎలుకను పట్టడం కూడా కళే.. ఈ కళలో మన దాదా నిష్ణాతుడు.. నల్ల ధనంపై ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ విడుదల చేసిన శ్వేతపత్రం చూసి ఆర్థిక వ్యవహాలపై అవగాహన లేనివారు, చిన్న పిల్లలు సైతం నవ్వుకుంటారంటే ఏమాత్రం అతిశయోక్తి లేదు.. స్విస్ తదితర విదేశీ బ్యాంకుల్లో భారతీయులు అక్రమంగా దాచుకున్న సొమ్ము ఎంత? దాన్ని ఏ విధంగా తీసుకొచ్చి దేశాభివృద్ధి కోసం ఉపయోగిస్తారనే విషయంలో ఈ శ్వేతపత్రం సరైన వివరణ ఇవ్వలేకపోయింది.. స్విస్ బ్యాంకుల్లో లక్ష కోట్లకుపైగా భారతీయులు అక్రమంగా దాచుకున్న నల్లధనం ఉందని అద్వానీ తదితర ప్రతిపక్ష నేతలు, పత్రికలు గత కొన్నేళ్లుగా ఘోషిస్తూనే ఉన్నా.. ప్రణబ్ దాదా తేల్చింది మాత్రం కేవలం రూ.9,300 కోట్లు మాత్రమే.. ఇది ఎవరి చేవుల్లో పూలు పెట్టడానికి చెబుతున్న మాటో దాదానే తేల్చాలి.. స్వయంగా స్విస్ నేషనల్ బ్యాంకు ప్రకటించిన గణాంకాల ప్రకారం 2006 సంవత్సరంలో భారతీయులు దాచుకున్న డబ్బు రూ.23,373 కోట్ల రూపాయలు.. 2010 నాటికి ఇది రూ.9,295కి పడిపోయింది.. ఇన్నేళ్లుగా ప్రతిపక్షాలు,దేశ ప్రజలు పెడుతున్న గగ్గోలు చూసి నల్ల ధన దొరలు తెలివిగా అక్కడి నుండి తప్పించేశారనేది సుస్పష్టం.. ఈ దొరలు ఎవరో వెల్లడించే ధైర్యం కూడా యూపీఏ సర్కారుకు లేదని స్పష్టమైపోయింది.. ఈ నల్ల దొరలపై మమకారంతోనే ఇంత కాలం ప్రభుత్వం చేష్టలుడిగినట్లు నటించిందేమో.. నల్లధనాన్ని అడ్డుకునే దిశగా ప్రణబ్ దాదా తన శ్వేతపత్రంలో ప్రకటించిన పప్పు బెల్లం లాంటి స్వాంతన చర్యలు ఏమేరకు ఫలితాలు ఇస్తాయో చూడాలి మరి..

No comments:

Post a Comment