Wednesday, April 5, 2017

రామరాజ్యం కావాలి

స్వాతంత్ర్యానికి పూర్వం మన దేశ నాయకులు అందరూ అనేవారు ‘రామ రాజ్యం’ కావాలని.. మన దేశం పరాయి పాలన నుండి విముక్తి పొందితే రామ రాజ్యంగా వెలుగొందుతుందని నమ్మేవారు.. మహాత్మాగాంధీ ‘రఘుపతి రాఘవ రాజారామ్..’ అనే గీతాన్ని పాడించేవారు.. అసలు ఏమిటి రామరాజ్యం అంటే..
ఆదర్శ నాయకుడు, పితృవాక్య పాలకుడు, గురు భక్తుడు, ఏక పత్నీ వ్రతుడు, మర్యాదా పురుషోత్తముడు, ధర్మ సంరక్షకుడు, సద్గుణవంతుడు, మహా వీరుడు, ప్రేమాస్పదుడు, ఆదర్శ మిత్రుడు.. సకల గుణాభిరాముడు.. శ్రీరామున్ని గురుంచి ఎంత చెప్పినా తక్కువే.. రాముడు కేవలం విష్ణుమూర్తి అవతారం కావడం వల్లే భగవంతుడు కాలేదు.. ఆయన ధర్మాచరణే ఆరాధ్యున్ని చేసింది..
శ్రీరాముడు గొప్ప నాయకుడు.. వ్యక్తిగత ప్రయోజనాలు విడిచిపెట్టి ప్రజల ఆకాంక్షలకే విలువ ఇచ్చాడు.. రామ రాజ్యంలో ప్రజలంతా ఆకలి దప్పుడు లేకుండా సుఖ సంతోషాలతో, సరి సంపదలతో జీవించారు. భయం, దొంగతనాలు లేదు.. ప్రతి పౌరుడు ధర్మాన్ని ఆచరించారు.. మహాత్మా గాంధీ రామ రాజ్యం కావాలని కోరుకున్నది ఇందుకే.. రామ రాజ్యం అంటే ఆదర్శ రాజ్యం..
రామాయణంలో ఎన్నో ఆదర్శపాత్రలు కనిపిస్తాయి.. ఆదర్శ పత్నులుగా సీత, ఊర్మిళ.. ఆదర్శ సోదరులుగా లక్ష్మణ, భరత శత్రుజ్ఞులు.. ఆదర్శ భక్తునిగా ఆంజనేయుడు.. ఇలా అన్ని పాత్రలను విశ్లేషించవచ్చు..
రాముడు అందరివాడు.. ఆసేతు హిమాచలం రామతత్వం వ్యాపించింది.. ముఖ్యంగా తెలుగు నేలకు రామభక్తికి విడదీయరాని సంబంధం ఏర్పడింది. ఉత్తరాదిన అయోధ్యలో పుట్టిన రాముడు వనవాసంలో భాగంగా దక్షిణాదికి వచ్చాడు.. సీతాపహరణంతో లంకకు వెళ్లి రావణున్ని సంహరించాడు.. రాముని కథ భారత దేశానికే పరిమితం కాలేదు.. తూర్పు ఆసియా దేశాలు కూడా రామాయణాన్ని సొంతం చేసుకున్నాయి..
శ్రీరామ నామం ఎంతో మధురం.. రామాయణం కేవలం ఒక పౌరాణిక కథ కాదు.. రామున్ని భగవంతునిగా ఎందుకు పూజిస్తున్నామో అర్థం చేసుకోనిదే రామ కథ పరిపూర్ణం కాదు..
శ్రీరామ నవమి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు.

No comments:

Post a Comment