Monday, April 17, 2017

ఈ రిజర్వేషన్లు న్యాయమేనా?

మన సమాజానికి అన్నింటికన్నా మొదటి శత్రువు పేదరికం.. ఆ తర్వాతే ఏదైనా.. సమాజంలో సామరస్య వాతావరణం నెలకొని అందరూ సుఖ సంతోషాలతో జీవించేలా కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాలది.. దురదృష్టవశాత్తు మన నాయకులు ఓటు బ్యాంకు రాజకీయాలతో సమాజంలో చిచ్చు పెడుతున్నారు..

కుల రహిత సమాజ నిర్మాణం కోసం కలలు కన్న బాబాసాహెబ్ సామాజిక న్యాయం కోసం పరిమిత కాలం పాటు రిజర్వేషన్లు ఉండాలన్నారు.. కానీ ప్రభుత్వాలు, పార్టీలు తమ ప్రయోజనాల కోసం పదే పదే పొగిస్తూ పోతున్నాయి.. కొత్తగా మరికొన్ని వర్గాలను చేరుస్తూ ఇప్పటికే జాబితాలో ఉన్న వారితో ఘర్షణ పూరిత వాతావరణం కల్పించారు. వీరి కుఠిల విధానాలు, ఓటు బ్యాంక్ రాజకీయాల కారణంగా రిజర్వేషన్ల ప్రక్రియ మొత్తం ప్రమాదంలో పడింది..  వాస్తవానికి నేటికీ రిజర్వేషన్ ఫలాలు అందని అర్హుత గల కులాలు, వ్యక్తులు పెద్ద సంఖ్యలోనే ఉన్నారు.. వారి ఓట్లకు పెద్దగా విలువ లేదేమో?. ఎవరికీ వారి గోడు పట్టదు..
మరోవైపు ఇప్పటికే రిజర్వేషన్ల ద్వారా లబ్ది పొందిన వారు కొత్తగా మరికొందరు జాబితాలో చేరడాన్ని ఇష్టపడటం లేదు.
వాస్తవానికి రిజర్వేషన్ల కారణంగా సామాజిక స్థితి మారుతుంది అనే వాదన అవాస్తవం అని ఇప్పటి వరకూ ఉన్న అనుభవాలు చెబుతున్నాయి.. సమాజంలో కులతత్వం తగ్గక పోగా మరింత బలపడుతోంది.. కులాన్ని వదులుకుంటే రిజర్వేషన్ పోతుంది అనే భయమే ఇందుకు కారణం.. పరిస్థితి ఇలాగే కొనసాగితే బాబాసాహెబ్ ఆశించిన కుల రహిత సమాజ నిర్మాణం ఎప్పటికి సాధ్యం అవుతుంది?
తాజాగా తెలంగాణలో మత ప్రాతిపదికన రిజర్వేషన్ల చిచ్చు మొదలైంది.. ఆ మతం వారికి సామాజిక, ఆర్థిక న్యాయం కోసమే అని ప్రభుత్వ వాదన.. ప్రభుత్వం చూపిస్తున్న కారణాలు కేవలం ఒక మతంలో మాత్రమే లేవు అన్నది కఠిన వాస్తవం.. మరి ఎందు కోసం ఈ రిజర్వేషన్లు?..
ఇప్పటికే మన సమాజం కుల మతాల కుంపటితో రగిలిపోతోంది. మత ప్రాతిపదికన రిజర్వేషన్ కారణంగా మత మార్పిడులు మొదలైతే ఎంత ప్రమాదమో ఆలోచించారా?.. ఇప్పుడు ఈ వ్యాసం మొదటికి వద్దాం..
అన్ని మతాలు, కులాలకు మొదటి శత్రువు పేదరికమే.. పేదరికానికి కుల మతాలు లేవు.. అన్ని కులాలు, మతాల్లోని పేదలను గుర్తించి వారికి రిజర్వేషన్లు ఇవ్వాలి.. వారి కుటుంది ఆర్థిక స్థితి మారగానే రిజర్వ్ కేటగిరీ ఎత్తివేసి ఇతర పేదలకు ఇవ్వాలి.. ఆధార్ అనుసంధానం అమలవుతున్న ఈ రోజుల్లో అర్హులైన పేదలకు గుర్తించడం కష్టమేమీ కాదు.. ఇప్పుడు అమలవుతున్న రిజర్వేషన్లను పూర్తిగా ఎత్తేయలని నేను కోరుకోవడం లేదు.. ఇవి ఆయా సామాజిక వర్గాల్లోని పేదలకు మాత్రమే చెందేలా చూడాలి.. ధనికులకు రిజర్వేషన్ సదుపాయాన్ని తొలగించాలి..
నిజమైన సామాజిక న్యాయం, వివక్ష లేని సమాజం ఏర్పడాలనే తలంపు ఉన్న వారంతా ఇందు కోసం పోరాడాలి.. మనం కుల మతాల కోణాలు వదిలేసి భారతీయులుగా ఆలోచిద్దాం..
స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్లలో ఆనాటి సామాజిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని బాబాసాహెబ్ అంబేద్కర్ రిజర్వేషన్ విధానాన్ని ప్రవేశపెట్టారు.. షెడ్యూల్డ్ కులాలు, తెగలు, బడుగు బలహీన వర్గాల సామాజిక-ఆర్థిక-రాజకీయ అభివృద్ధి ఈ రిజర్వేషన్ల లక్ష్యం.. రిజర్వేషన్ల కారణంగా కోట్లాది మందికి సామాజిక న్యాయ ఫలాలు అందాయి ఆనండంలో ఎలాంటి అనుమానం లేదు..

No comments:

Post a Comment