Friday, September 13, 2013

మనది ఏ జాతి?

మీకు పాస్ పోర్టు ఉందా?.. ఉంటే అందులో మీ జాతీయత (Nationality) ఏమని రాసి ఉంది?..TELUGU అని ఉందా? లేక INDIAN అని ఉందా?.. మీకు పాస్ పోర్టు లేనట్లయితే మీరు ఏదైనా దరఖాస్తు ఫారం నింపేటప్పుడు జాతీయత అనే కాలమ్ వద్ద ఏమని రాస్తారు? తెలుగు అని రాస్తారా? ఇండియన్ (భారతీయ) అని రాస్తారా?..
ఇప్పుడు చెప్పండి మీది ఏ జాతి?.. భారత జాతీయులా? తెలుగు జాతీయులా?.. సరే మీరు భారతీయులే అయితే తెలుగు జాతి అనే పదాన్ని ఎందుకు వాడుతున్నారని ఎప్పుడైనా ఆలోచించారా?..
ప్రపంచంలో మనకు ఏ దేశ పౌరసత్వం ఉంటే ఆ జాతీయులుగా పిలవబడతాం.. ఇదాహరణకు ఇండియన్,  అమెరికన్, రష్యన్, చైనీస్, కొరియన్, పాకిస్తానీ..  కానీ భాష పేరుతో జాతీయత ఉంటుందా? ఒకవేళ భాష పేరుతో జాతీయ ఉంటే మన దేశంలో ప్రభుత్వం గుర్తించిన భాషలు 22 ఉన్నాయి. అంటే 22 జాతులు ఉన్నట్లా.. అలాగే చిన్నా, పెద్ద కలిపి 1,576 భాషలు (1991 జనాభా లెక్కల ప్రకారం) ఉనికిలో ఉన్నాయి.. మరి భారతీయులను అన్ని జాతులుగా గుర్తించాలా?
ప్రతి మనిషికి మాతృభాష (లేదా ఇంటి భాష) ఉంటుంది. తన భాషపై తనకు అభిమానం, గౌరవం ఉండటం సహజం.. ఉండాలి కూడా.. మనం తెలుగు తల్లిని ఏర్పాటు చేసుకొని పూజిస్తున్నాం.. ఇది మనకు గర్వకారణం కూడా.. భాషను తల్లిలా గౌరవించడంలో ఎలాంటి తప్పులేదు.. నేను రాసే, మాట్లాడే భాష అంటే నాకు ఎంతో అభిమానం.. కానీ భాషకు జాతీయతకు ఉన్న స్పష్టమైన తేడాను మనం అర్ధం చేసుకోవాలి..
కొంత కాలంగా (కొన్నేళ్లుగా) తెలుగు జాతి అనే పదాన్ని అతిగా వాడుతున్నారు. అంటే తెలుగు వారు భారతీయులు కాదా? తెలుగు జాతి సమైక్యత, తెలుగు జాతి ఐక్యత, తెలుగు జాతిని చీలుస్తారా? అనే మాటలు వినే ఉంటారు.. మనది భారత జాతీయత అయినప్పుడు తెలుగు జాతిగా చెప్పుకోవడం ఎందుకు? తెలుగు వారిమి అనో లేదా ఆంధ్రప్రదేశ్ వాళ్లం అనో చెప్పుకుంటే తప్పు పట్టాల్సిన అవసరం లేదు.. తెలుగు వారు ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే లేరు. తమిళనాడు, కర్ణాటక, ఒరిస్సా, మహారాష్ట్ర, చత్తీస్ ఘడ్ రాష్ట్రాల్లో కూడా గణనీయంగా ఉన్నారు.. మని వారి భౌగోళిక సరిహద్దులు, జాతీయత మాటేమిటి? వారి బాగోగులు ఎవరైనా పట్టించుకుంటున్నారా?
పరిపాలన సౌలభ్యం దృష్ట్యా ఆంధ్రప్రదేశ్ ఒకటిగా ఉండాలా? లేదా తెలంగాణ విడిపోవాలా అనేది తర్వాత విషయం.. కానీ తెలుగు జాతి విడిపోతుంది అని గగ్గోలు పెట్టడం ఎంత వరకు సమంజసం?.. రాష్ట్రం విడిపోయినంత మాత్రాన మన జాతీయత, దేశం విడిపోయినట్లా? ప్రత్యేక రాష్ట్రం కోరే వారిని దేశ ద్రోహులుగా చిత్రీకరించేందుకు కొందరు రాజకీయ నాయకులు, వ్యక్తులు పడరాని పాట్లు పడుతున్నారు. దీనికి తెలుగు జాతి అనే ముసుగును వాడుకుంటున్నారు.. కొందరు సమైక్యవాదులు తమకు తాము జాతీయ వాదులమని సర్టిఫికెట్ ఇచ్చేసుకుంటున్నారు. జాతి అంటే వారి దృష్టితో తెలుగు జాతా? భారత జాతా? తెలుగు మాట్లాడే వారంతా ఒకే రాష్ట్రంగా ఉండాలని కోరుకునే వారు హిందీ మాట్లాడే వారంతా 9 రాష్ట్రాలుగా ఉన్నారెందుకు అంటే సమాధానం చెప్పలేరు.. అప్పుడు మనది తెలుగు జాతి అంటూ నసుగుతారు..
నావరకైతే నేను భారతీయుడినని సగర్వంగా చెప్పుకుంటాను.. ముందు భారతీయుడిని, ఆ తర్వాతే తెలుగువాడిని.. ఇవాళ ఆంధ్రప్రదేశ్ వాన్ని.. ప్రత్యేక రాష్ట్రం వచ్చాక తెలంగాణ వాడిని.. తెలుగు నా మాతృభాష అని గర్వపడతాను.. నా దేశాన్ని, నేను నివసించే ప్రాంతాన్ని అమితంగా ప్రేమిస్తాను.. మరి మీరు ఏమిటో మీరే నిర్ణయించుకోండి..

(Note: ఇంత కాలం దేశ సమైక్యత గురించి పట్టించుకోకుండా, ఇప్పడు తెలుగు జాతి సమైక్యత అంటూ రాగాలు అందుకున్న కొందరు నా మిత్రులకు సమాధానంగా..)

No comments:

Post a Comment