Tuesday, April 8, 2014

NOTA ఎంత వరకు అవసరం?

ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఓటర్లకు కొత్త అవకాశం ఇచ్చింది భారత ఎన్నికల సంఘం.. అదే NONE OF THE ABOVE.. దీన్నే సంక్షిప్తంగా NOTA అంటున్నారు.  ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లో అభ్యర్థులందరి పేర్లు, గుర్తుల దిగువన ఉంటుంది ఈ బటన్.. బ్యాలట్ పేపర్ ద్వారా ఓటింగ్ జరిగే రోజుల్లో అభ్యర్ధులు ఎవరూ ఇష్టం లేకపోతే.. ఓట్ ముద్రను సరిగ్గా వేయకపోవడమో, లేదా ముద్ర లేకుండానే పేపర్ బ్యాలట్ పేపర్ను బాక్సులో వేసేవారు.. కానీ EVMలు వచ్చాక చెల్లని ఓట్లకు స్థానం లేకుండా పోయింది. అభ్యర్థులు ఎవరూ ఇష్టం లేకున్నా, ఎవడో ఒక గొట్టంగాడికి కచ్చితంగా ఓటేయక తప్పదు.. ఈ పరిస్థితిని నివారించేందుకు కొందరు ఉద్యమ కారుల పోరాట ఫలితంగా NOTA వచ్చి చేరింది.. అభ్యర్థులెవరూ ఇష్టంలేకపోతే ఈ బటన్ నొక్కేయవచ్చనమాట..
నిజంగా ఈ NOTA వల్ల ప్రయోజనం ఉందా?.. ఇందులో భిన్నవాదనలు ఉన్నాయి.. నా వరకైతే ఈ NOTA వల్ల అంతగా ప్రయోజనం లేదనే అంటాను.. ప్రజాస్వామ్యం మనకు ఇచ్చిన పవిత్రమైన ఆయుధం ఓటు హక్కు.. మనకు నచ్చిన అభ్యర్థిని ఎన్నుకునే స్వేచ్చ మనకు ఉంది.. ఉన్నవారిలోనే ఉత్తములను ఎన్నుకుంటే బాగుంటుంది.. ప్రతి మనిషి(అభ్యర్థి)లో మంచి, చెడు రెండూ ఉంటాయి.. మనం మంచినే ఎన్నుకొని పాజిటివ్ గా ఆలోచించాలి.. అభ్యర్థులు ఎవరూ నచ్చలేదని వాదించేవారు నా దృష్టిలో మూర్ఖులు, తామే గొప్పవారమనే ఇగోయిస్టుల కిందే లెక్క.. సాటి మనిషిని నమ్మనివాడు అసలు సంఘజీవేనా?..
ప్రజాస్వామ్య వ్యవస్థను నమ్మని కొన్ని సంస్థలు ఎన్నికలను బహిష్కరించాలని పిలుపునివ్వడం చూస్తూనే ఉన్నాం.. అలాగే నాయకులెవరూ తమ గోడును పట్టించుకోవడం లేదని ఓటింగ్ కు దూరంగా ఉండాలని నిర్ణయించే వారూ ఉన్నారు.. ఇలాంటి వారు నిరసన తెలిపేందుకు NOTA కొంత మేర ఉపయోగపడుతుంది.. కొన్ని గ్రామాల ప్రజలు తమ గోడును వినిపించేందుకు సామూహికంగా వందల సంఖ్యలో నామినేషన్లు వేసి ఎన్నికల ప్రక్రియను సంక్లిష్టం చేసి అందరి దృష్టిని ఆకర్శించే ప్రయత్నం చేస్తుంటారు.. ఇలా చేయడం కన్నా NOTA ఎంచుకోవడమే మంచిది..
ఇక వీరందరినీ మించిన సోకాల్డ్ మేధావులు కొందరు మన సమాజంలో ఉన్నారు.. వారు ఎన్నికల వ్యవస్థే వేస్టంటారు వారు.. తుపాకి గొట్టం ద్వారా వచ్చే విప్లవం కోసం కలలు కనేవారే వీరిలో అధికం.. మరి కొందరికి ఓటు వేయడానికి వెళ్లాలంటే బద్దకం. ఓటెందుకు వేయలేదని అడిగితే ఎందుకు వేయాలని ఎదురు ప్రశ్నిస్తారు.. పోలింగ్ కేంద్రానికి వెళ్లి క్యూలో నిల్చోవడం, ఓటు వేసేందుకు వేచి ఉండటం వీరికి నామోషి.. తిన్నది అరగని వాదనలు చేసే ఇలాంటి వారి వల్ల సమాజానికి నష్టమే ఎక్కువ.. ఇలాంటి వారు కూడా NOTAను వాడుకోవచ్చు..

ఓటింగ్ మిషన్ దిగువన NOTA బటన్ అయితే పెడుతున్నారు.. కానీ ఈ విషయంలో చాలా మంది ఓటర్లకు అవగాహనే లేదనేది వాస్తవం.. చదువుకున్న వారికి సైతం ఈ సారి ఇలాంటి అవకాశం వచ్చిందనే విషయం వారి వరకు చేరలేదు.. అందుకు కారణం ఎన్నికల కమిషన్ తగిన ప్రచారం చేయకపోవడమే.. ఇక నిరక్షరాస్యుల పరిస్థితి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. NOTAకు సైతం ప్రత్యేక చిహ్నం ఇవ్వాలని సుప్రీం కోర్టు సూచిస్తున్నా, ఈ సారి ఎన్నికలల్లో ఇలాంటి గుర్తు లేనట్టే అని ఎన్నికల సంఘం సెలవిచ్చేసింది..

No comments:

Post a Comment