Friday, November 21, 2014

పేరు.. పోరు.. హైదరాబాద్ విమానాశ్రయం

శంషాబాద్ విమానాశ్రయ దేశీయ టెర్మినల్ కు ఎన్టీఆర్ పేరు పెట్టడాన్ని సమర్ధిస్తారా?.. వ్యతిరేకిస్తారా?.. కొందరు మిత్రులు నన్ను అడిగిన ప్రశ్నలు ఇవి.. అభిప్రాయాన్ని ప్రకటించేందుకు నేనేం రాజకీయ నాయకున్ని కాదు.. అలాగని నా అభిప్రాయాన్ని దాచుకోవాల్సిన అవసరం కూడా లేదు..
ఇది అసందర్భమైన చర్య.. తొందర పాటు నిర్ణయం అని నేరుగా, ముందుగానే చెబుతున్నాను.. ఎన్టీ రామారావు గొప్ప తెలుగు నాయకుడు.. అత్యధిక సంఖ్యలో ప్రజలు అభిమానించే రాజకీయ నాయకుడు, సినీ నటుడు.. దీన్ని అంగీకరించాల్సిందే.. మరి ఇంతటి మహనీయుని పేరును వివాదాల్లోకి లాగడం అవసరమా?.. ఎన్టీఆర్ నెంబర్ వన్ తెలుగు వాడు, సమైక్య ఆంధ్రప్రదేశ్ కు మూడు సార్లు ముఖ్యమంత్రిగా పని చేశారని వాదించినా మారిన పరిస్థితుల్లో ఎవరైనా ఆయన స్వరాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అనే అంటారు కధా? పీవీ నరసింహారావు దేశ ప్రధానిగా పని చేసిన గొప్ప తెలుగువాడు కావచ్చు కానీ ఆయన స్వస్థలం వచ్చే సరికి అది తెలంగాణ రాష్ట్రంలో భాగం అని మనం అంగీకరిస్తున్నామా లేదా?
రాజశేఖర రెడ్డి హయాంలో బేగంపేటలోని విమానాశ్రయాన్ని శంషాబాద్ కు తరలించినప్పుడు అప్పటి వరకూ దేశీయ టెర్నినల్ కు ఉన్న ఎన్టీ రామారావు పేరును అక్కడ కొనసాగించక పోవడం అన్యాయమే.. తాము మళ్లీ అధికారంలోకి వస్తే ఎన్టీఆర్ పేరును మళ్లీ పెడతామని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆనాటి పరిస్థితుల్లో ప్రకటించారు.. కానీ రాష్ట్ర విభజన తర్వాత పరిస్థితులు మారిపోయాయి.. శంషాబాద్ విమానాశ్రయం కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో భాగమైపోయింది..
కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా అశోక్ గజపతి రాజును నిమమించినప్పుడే తేనెటీగ తుట్టెను కదిపే ఈ తొందరపాటు నిర్ణయం తీసుకుంటారేమో అని నేను ఊహించాను.. నేను ఊహించిందే  నిజం అయింది.. శంషాబాద్ విమానాశ్రయం విషయంలో  తీసుకున్న వివాదాస్పద నిర్ణయాన్ని టీఆర్ఎస్ తో పాటు అన్ని పార్టీలు వ్యతిరేకించక తప్పని పరిస్థితి ఏర్పడింది.. చివరకు ఈ తుంటరి పని వల్ల తెలంగాణ అసెంబ్లీలో టీడీపీ సభ్యులు కూడా ఇరకాటంలో పడాల్సి వచ్చింది.. అశోకుని సాయంతో చంద్రబాబు కేంద్ర ప్రభుత్వంపై వత్తిడి తెచ్చి ఎన్టీఆర్ పేరును పెట్టించడంతో ఇక్కడ బీజేపీ నాయకులు కూడా ఇబ్బందికర పరిస్థితినే ఎదుర్కొన్నారు..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖపట్నం, విజయవాడ (గన్నవరం), తిరుపతి (రేణిగుంట) విమానాశ్రయాలు ఉన్నాయి.. కొత్త రాష్ట్రం రాజధానితో పాటు కొత్త విమానాశ్రయం కూడా నిర్మించుకోవడానికీ అవకాశం ఉంది.. వీటిలో దేనికి ఎన్టీరామారావు పేరును పెట్టినా వ్యతిరేకించే వారు ఉండరు.. ఒక టెర్మినల్ కేం కర్మ ఏకంగా విమానాశ్రయం మొత్తానికి ఆ మహనీయుని పేరును పెట్టుకున్నా అభ్యంతరం ఎవరికుంటుంది.. ఇంత చక్కని అవకాశం ఉన్నప్పుడు పొరుగు రాష్ట్రం వారి విమానాశ్రయానికి బలవంతంగా ఎన్టీఆర్ పేరును రుద్దడంలోని ఆంతర్యం ఏమిటి.. ఇది తెంపరితనం కాదా? కోరి జగడం పెట్టుకోవడానికి మహనీయుడు ఎన్టీరామారావు పేరే దొరికిందా?.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు దాదాపులో అన్ని విషయాల్లో ఇప్పటికే ప్రతి రోజూ సిగపట్లు పడుతున్నాయి.. ఈ పరిస్థితిలో మూలిగే నక్కపై తాటి పండు పడ్డట్లు మరో కొత్త వివాదం అవసరమా?

శంషాబాద్ విమానాశ్రయంలోని రెండు టెర్నినళ్లకు పీవీ నరసింహారావు, కొమరం భీమ్ పేర్లు పెడితే అభ్యంతరం ఎవరికి? అలాగే నవ్యాంధ్ర రాజధాని, విమానాశ్రయాలకు ఎన్టీఆర్ పెరు పెట్టుకుంటే వ్యతిరేకించేది ఎవరు?

No comments:

Post a Comment