Monday, July 29, 2013

మాయల తెలంగాణ వద్దు..

అడిగింది ఇవ్వరట.. ఎవరూ అడగనిది ఇచ్చేందుకు సిద్దపడ్డారు.. దానికే రాయల తెలంగాణ అనే పేరు పెట్టారు..
అర్ధ శతాబ్ద కాలంగా తెలంగాణ సమస్య రగులుతోంది.. 1969లో ఉవ్వెత్తున ఉద్యమం చెలరేగింది.. కాంగ్రెస్ అధిష్టానం కొందరు నాయకులను లోబరుచుకొని తెలంగాణ ప్రజల ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను అణచివేసింది.. దశాబ్ద కాలంగా మలిదశ ఉద్యమం సాగుతోంది.. దాదాపు ఆరేడు వందల మంది ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రాణ త్యాగం చేశారు..
ఇదేమీ పట్టని కాంగ్రెస్ అధిష్టానం రాయల తెలంగాణను తెరపైకి తెచ్చింది.. అసలు రాయల తెలంగాణ కావాలని అడిగింది ఎవరు? ఒక వ్యాపార రాజకీయ వేత్త చేసిన ప్రతిపాదనకు మరో మతోన్మాద రాజకీయ వేత్త వత్తాసు పలికాడు..  ఈ తలతిక్క ప్రతిపాదనను తన స్వరాష్ట్రంలోనే దిక్కూ దివానం లేని కాంగ్రెస్ అధిష్టాన పెద్ద ఒకరు అందరిపైనా రుద్దే ప్రయత్నం చేస్తున్నాడు..
అసలు రాయల తెలంగాణ కోసం ఉద్యమించిన వారెవరైనా ఉన్నారా? ఇందు కోసం ప్రాణ త్యాగాలు చేసిన వారెవరైనా ఉన్నారా? ఒకరిద్దరి పుర్రెల్లో మెదిలిన ఆలోచనను పట్టుకొని రాయలసీమను నిలువునా చీలుస్తారా? కర్నూలు, అనంతపురం జిల్లాల నాయకుల్లో ఎంత మంది రాయల తెలంగాణ కోరుతున్నారు? తెలంగాణతో బలవంతంగా ఈ రెండు జిల్లాలను బలవంతంగా ముడిపెట్టే అధికారం కాంగ్రెస్ అధిష్టానం పెద్దలకు ఎవరిచ్చారు? మీ సామాజిక సమీకరణాలకు, ఓటు బ్యాంకులకు తెలంగాణ, రాయలసీమలను బలి చేస్తారా?
తెలంగాణ నాయకులు, ఉద్యమకారులు ఎవరు కూడా రాయల తెలంగాణ కోర లేదు.. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని దీర్ఘ కాలం పాలించింది రాయలసీమ నేతలే.. మూడు ప్రధాన రాజకీయ పార్టీలకు నాయకత్వం వహిస్తున్నది సీమ నాయకులే.. రాయలసీమను చీల్చే ప్రతిపాదనను వీరు సమర్ధిస్తున్నారా?.. దీన్ని స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది.. సీమను చీల్చిన తర్వాత వీరు తమ స్వప్రాంతాల్లో తెలెత్తుకు తిరగగలరా?
రాయలసీమ నుండి ఆరు దశాబ్దాల క్రితం బళ్లారి జిల్లా పోయింది.. ప్రకాశం జిల్లా ఏర్పడ్డప్పుడు మార్కాపురం, గిద్దలూరు తాలుకాలు పోయాయి.. ఇప్పడు మిగిలిన నాలుగు జిల్లాలు రెండు కొత్త రాష్ట్రాలకు బదిలీ అయిపోతే, రాయలసీమకు సొంత అస్థిత్వం అనేది ఉంటుందా?.. తెలంగాణ, రాయలసీమలకు సొంత అస్థిత్వాలు ఉన్నాయి.. ఒకే ఒరలో రెండు కత్తులు ఇరికించే ప్రయత్నం చేయడం అర్థరహితం.. హైదరాబాద్ నగరంలో కొందరి వ్యాపార ప్రయోజనాలు, కులతత్వ, మతోన్మాద రాజకీయాలను దృష్టిలో పెట్టుకొని తెరపెకి వచ్చిన రాయల తెలంగాణ ప్రతిపాదనను మొగ్గలోనే తుంచేయాలి..
అసలు దీన్ని రాయల తెలంగాణ అని పిలవడం తప్పు.. మాయల తెలంగాణ అనాలి..

No comments:

Post a Comment