Saturday, March 16, 2013

విఫల విదేశాంగ విధానం

జనాభా రీత్యా ప్రపంచంలో రెండో స్థానంలో ఉంది మన దేశం.. అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా గుర్తింపు ఉంది మన దేశానికి.. ఏ దేశానికి వెళ్లినా భారతీయులు తమదైన ముద్రను వేస్తున్నారు.. శాస్త్ర సాంకేతిక రంగాల్లో దూసుకెళ్లుతున్నారు.. మన సంస్కృతీ సాంప్రదాయాల కారణంగా ప్రత్యేక గౌరవాన్ని అందుకుంటున్నాం.. కానీ..
దురదృష్టవశాత్తు విదేశాంగ విధానంలో భారత దేశం రాను రానూ అంతర్జాతీయంగా చులకనైపోతోంది.. ఇతర దేశాలు మనను చూసి నవ్వుకునే పరిస్థితి ఏర్పడింది.. భారతీయ మత్స్యకారులను చంపిన తమ నావికులకు అప్పగించేది లేదని ఇటలీ తేల్చి చెప్పడంతో దిక్కుతోచని పరిస్థితే ఇందుకు నిదర్శనం.. సముద్రంలో భారతీయ జలాల్లో మన దేశ పౌరులను చంపడమే తప్పయితే, వారు సోమాలియా సముద్ర దొంగలుగా పొరబడ్డామని.. అంతర్జాతీయ సముద్ర జలాల్లో జరిగిన సంఘటనకు తమను శిక్షించే అధికారం భారత దేశానికి లేదని దబాయించడం ఇటలీకే చెల్లింది.. తమ దేశంలో ఎన్నికలు ఉన్నాయని, ఓటు వేసేందుకు తమ పౌరులకు బెయిల్ ఇవ్వాలని కోరి విడిపించుకున్న ఇటలీ ప్రభుత్వం, ఇప్పడు వారిని అప్పగించేది లేదు పొమ్మనడం చేయడం స్పష్టంగా కండకావరమే..
నిజానికి ఇటలీని గుడ్డిగా నమ్మి ఆ దేశ నావికులకు బెయిల్ ఇవ్వడం మన అమాయకత్వమే.. ఈ విషయంలో మనం ఉదారంగా ఉన్నా, ఆ దేశం అవమానకరంగా వ్యవహరించడం ద్వారా భారత దేశ సార్వభౌమత్వానికే సవాలు విసిరింది.. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు ఇటలీపై ఎన్ని రకాలుగా హుంకరించినా ఫలితం ఏముంటుంది?.. దౌత్య విధానంలో భారత దేశ వైఫల్యానికి ఈ సంఘటన ఉదాహరణ మాత్రమే.. నిజానికి ఈ రకమైన వైఫల్యం మన దేశానికి తొలిసారి కానేకాదు.. తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ కాలం నుండీ మనం ఇలాంటి తప్పుల మీద తప్పులు చేస్తూనే ఉన్నాం..
కాశ్మీర్ కుంపటి ఈనాటికి రగలడానికి కారణం ఎవరో ఇక్కడ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. 1947లో భారత దేశంలో విలీనం అవుతున్న కాశ్మీర్ పై పాకిస్తాన్ సైన్యం దొంగదాడి చేస్తే మన సైన్యాలు విజయవంతంగా తిప్పి కొట్టాయి.. కానీ నెహ్రూజీ ఈ అంశాన్ని ఐక్యరాజ్య సమితి దృష్టికి తీసుకెళ్లి అంతర్జాతీయం చేశారు.. సగం కశ్మీర్ ఇంకా పాక్ చేతిలోనే ఉంది.. ఆ దేశం కాశ్మీర్ సమస్యకు నిత్యం ఆజ్యం పోస్తూనే ఉంది.. మన దేశంలో తీవ్రవాద కార్యకలాపాల వెనుక పాక్ ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తున్నా, ఇంకా ఆ దేశంతో స్నేహ సంబంధాలు ఆశించడం వెర్రిబాగుల తనమే.. అలాగే హిందీ-చీనీ భాయ్ భాయ్ అంటూ నెహ్రూ గుడ్డిగా చైనాను నమ్మేశారు.. ఆయన స్నేహ హస్తాన్ని వమ్ము చేస్తూ చైనా 1962లో భారత దేశంపై యుద్దానికి దిగింది.. కాశ్మీర్లోని అక్సాయి చిన్, ఈశాన్య రాష్ట్రాల్లో ఒకటైన అరుణాచల్ ప్రదేశ్ తమవేనంటూ చైనా దబాయిస్తున్నా ఏమీ చేయలేని దుస్థితిలో ఉన్నాం..
నెహ్రూ తదనంతరం కూడా మన దౌత్య వైఫల్యాలు కొనసాగుతూనే ఉన్నాయి.. పాకిస్తాన్ కబంద హస్తాల నుండి విడిపోయి స్వతంత్ర దేశంగా నిలిచేందుకు బంగ్లాదేశ్ కు మన ఎంతో సాయం చేశాం.. కానీ ఈ విషయంలో మనకు రుణ పడాల్సిన బంగ్లాదేశ్ నేతలు అందుకు విరుద్దంగా మన దేశంలో తీవ్రవాద శక్తులకు ఊతం ఇస్తూనే ఉన్నారు..
భారత దేశానికి విశ్వాసపాత్ర మిత్రునిగా ఉండాల్సిన శ్రీలంక కూడా క్రమంగా చైనా విష కౌగిలిలోకి జారుకుంటోంది.. కరవ మంటే కప్పకు కోపం, విడవమంటే పాముకు కోపం అన్నట్లు తయారైంది మన దేశ పరిస్థితి.. తమిళుల సమస్య మనకు కొరగాని కొయ్యగా మారిపోయింది.. తమిళనాడు రాజకీయ పార్టీల వత్తిడి కారణంగా లంక ప్రభుత్వంతో మన దేశ సంబంధాలు డోలాయామంలో పడ్డాయి..
భారత దేశం నుండి ఎంతో లబ్ది పొందిన ద్వీప రాజ్యం మాల్దీవ్స్ సైతం తోక జాడించేసింది.. అక్కడి తిరుగుబాటు దారులు భారత అనుకూల అధ్యక్షున్ని గద్దె దించారు.. చైనాతో సంబంధాలు పెంచుకున్నారు.. జీఎంఆర్ కాంట్రాక్ట్ రద్దు చేయడం ద్వారా భారత దేశానికే సవాలు విసిరింది మాల్దీవ్స్ ..
సాంస్కృతికంగా భారత దేశంతో పురాతన కాలం నుండి సంబంధాలు ఉన్న నేపాల్ సైతం చైనా ఉచ్చులో పడింది.. చైనా చాలా తెలివిగా మన దేశాన్ని చుట్టు ముడుతోంది.. హిందూ మహా సముద్రంలో స్థావరాలు నెలకొల్పినా చేష్టలుడిగిపోతున్నాం.. చైనా భయంతో బర్మాలో ప్రజాస్వామ్య పోరాటానికి మద్దతు ఇవ్వలేక, సైనిక పాలకులను సమర్ధించలేక మన దేశం సతమతం అవుతోంది..
ప్రచ్చన్న యుద్ద కాలంలో భారత దేశం అలీనోద్యమాన్ని తెరపైకి తెచ్చినా, దాన్ని కొనసాగించకుండా కమ్యూనిస్టు సోవియట్ యూనియన్ తో దోస్తీ కట్టింది.. ఫలితంగా పెట్టుబడి దారీ అమెరికా మనపై శీత కన్నేసింది.. సోవియట్ యూనియన్ పతనం తర్వాత అనివార్యంగా అమెరికా-ఇండియాలు సంబంధాలు ఏర్పరచుకున్నాయి.. ఇందుకు మార్కెట్ అవసరాలే కారణమని చెప్పక తప్పదు.. ప్రపంచీకరణ, సరళీకృత ఆర్ధిక విధానల పేరిట మన విదేశాంగ నీతిని దారి మరలిస్తున్నాం..


ప్రపంచానికి నాయకత్వం వహించే స్థితిలో ఉండాల్సిన మన దేశం ఇతర దేశాల దృష్టిలో చులకనైపోవడం భారతీయులందరికీ అవమానకరం.. దక్షిణాసియాలో పెద్దన్న పాత్ర పోషించాల్సిన ఇండియాను పొరుగు దేశాలే ఖాతరు చేయనప్పడు.. ఇటలీ, అమెరికా, చైనాలు గౌరవిస్తాయని భావించడం అత్యాశే అవుతుంది.. చివరగా ఈ పరిస్థితికి కారణం ఏమిటి అనే ప్రశ్నకు సమాధానం కటువుగానే చెప్పక తప్పదు.. మన దేశానికి సమర్ధ నాయత్వం లోపించింది.. స్వతంత్రించి నిర్ణయాలు తీసుకునే నాయకత్వమే లేదు.. ఇప్పడు మన దేశం సమర్థ నాయకుని కోసం ఎదురు చూస్తోంది.. ఈ విషయంలో మనం రాజకీయాలు పక్కన పెట్టి సీరియస్ గా అలోచించాల్సిన సమయం వచ్చింది.. 

No comments:

Post a Comment