Friday, March 22, 2013

చైనాను నమ్మొచ్చా?


పంచశీల.. ఈ పదం ఎక్కడో విన్నట్లుందా?.. దీని గురుంచి తెలిసిన ఏ భారతీయుడికైనా రక్తం సలసల మరుగుతుంది.. అర్ధ శతాబ్దం నాటి చైనా వంచన గుర్తుకు వస్తుంది..
హిందూ-చీనీ భాయి భాయి అంటూ భారత ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ చైనాకు స్నేహ హస్తం ఇచ్చారు.. పంచశీల సూత్రాలపై భారత ప్రధాని నెహ్రూ, చైనా ప్రధాని చూ ఎన్ లై మధ్య ఒప్పందం జరిగింది.. ఒకరి ప్రాదేశిక సార్వభౌమత్వాన్ని మరొకరు గౌరవించాలి, ఒకరి అంతరంగిక విషయాల్లో మరొకరు జోక్యం చేసుకోవద్దు, పరస్పరం ఇచ్చిపుచ్చుకునే ఇరువురికీ ఆమోదయోగ్యమైన విధానాలు అవలంభించాలి, శాంతి సామరస్యాలతో మెలగాలి.. తదితర అంశాలతో రూపొందిన పంచశీల అవగాహన ఇది..
జవహర్ లాల్ నెహ్రూ గారు చైనాను గుడ్డిగా నమ్మేశారు.. అప్పటికే చైనా టిబెట్ ను ఆక్రమించేసింది.. నిజానికి బ్రిటిష్ ఇండియా సైన్యం టిబెట్ను కాపాడుతూ వచ్చింది.. భారత స్వాతంత్రం తర్వాత ఆ రక్షణ భారం మన దేశంపై పడింది.. అయితే చైనా మాయలో పడ్డ నెహ్రూజీ భారత సైన్యాన్ని అక్కడి నుండి క్రమంగా తొలగించేశారు.. చైనా సునాయాసంగా టిబెట్ ను కబ్జా చేసేసింది.. దీన్ని ప్రపంచ దేశాలన్నీ ఖండిచినా నెహ్రూ మహాశయుడు మాత్రం టిబెట్ చైనాలో అంతర్భగం అంటూ గుర్తించేశాడు.. మరోపక్క దలైలామాకు మన దేశంలో ఆశ్రయం ఇచ్చి తాను ప్రపంచ శాంతి దూతగా పేరు తెచ్చుకోవాలని కలలు కన్నారు.. కానీ ఆయన కలలు కల్లలైపోయాయి..
ఓ మాంచి ముహూర్తం చూసుకొని చైనా దొంగ దెబ్బ తీసింది.. 1962 అక్టోబరు 20న భారత దేశంపై ఏక పక్షంగా యుద్దానికి దిగింది.. ప్రపంచ శాంతి అంటూ అలీన ఉద్యమానికి నాంది పలికి ప్రపంచ నాయకుడు కావాలని కలలు కంటున్న నెహ్రూ షాక్ తిన్నాడు.. ఏ మాత్రం యుద్దానికి సిద్దంగా లేని భారత సైన్యం చిత్తుగా ఓడిపోయింది.. బ్రిటిష్ వారు మన దేశానికి స్వాతంత్రం ఇచ్చి వెళ్లిన తర్వాత సైన్యాన్ని బలోపేతం చేసే విషయంలో జవహర్లాల్ నెహ్రూ చాలా నిర్లక్ష్యం చేశారు.. ఆయనకు తోడు అసమర్ధ రక్షణ మంత్రి కృష్ణ మీనన్.. దాని ఫలితమే మన ఓటమి.. చైనాను గుడ్డిగా నమ్మి దేశం పరువు తీసిన నెహ్రూ మానసికంగా చాలా కృంగిపోయారు.. మరో రెండేళ్లకే కన్ను మూశారు..
మొదటి నుండి చైనా భారత దేశంతో శతృ వైఖరిని అవలంభిస్తూ వచ్చింది.. భారత్ పై యుద్దానకి దిగక మునుపే చైనా 1959లో పాకిస్తాన్ సహకారంతో కాశ్మీర్లోని అక్సాయ్ చిన్ ప్రాంతాన్ని కబ్జా చేసేసింది.. భారత పార్లమెంట్ లో ఈ అంశంపై దుమారం రేగితే, గడ్డి పరక మొలవని ప్రాంతం మనకు ఉంటే ఎంత? లేకుంటే ఎంత? అన్న ధోరణితో నెహ్రూ సమాధానం ఇచ్చారు.. వళ్లు మండిన ఓ సభ్యుడు వెంటుకలు లేని మీ బట్టతల ఉంటే ఎంత? లేకుంటే ఎంత అని నిలదీశాడు.. అంతే కాదు అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం తమవేనని చైనా చెప్పు కుంటోంది..
గడచిన 60 ఏళ్లలో చైనా రక్షణ పరంగా భారీగా ఆయుధ సంపత్తిని పోగేసింది.. భారత దేశం చుట్టూ ఉన్న పాకిస్తాన్, బర్మా, శ్రీలంక, మాల్దీవుల్లో సైనిక స్థావరాలు ఏర్పాటు చేసుకునే దిశగా ఆ దేశాలకు ప్యాకేజీలు చూపి బుట్టలో వేసుకుంటోంది.. ఎక్కువ పని గంటలు, చవక వేతనాలకే పని చేసే కార్మికులు ఉండే చైనా తన చవక, నాసిరకం సరుకులతో తెలివిగా భారత మర్కెట్ ను కబ్జా చేస్తోంది.. (ఇవేమీ అర్థం కాని మన వెర్రి భారతీయులు చైనా వస్తులు, చైనా బజార్ల మోజులో పడుతున్నారు..
ఇన్ని రకాలుగా భారత దేశంతో కుట్ర పూరితంగా వ్యవహరిస్తున్న చైనా ఇప్పడు కొత్త సీసాలో పాత సారా బయటకు తీసింది.. అదే పంచశీల.. ఆనాడు పంచశీల సూత్రాలను ఉల్లంఘించి భారత దేశాన్ని మోసగించిన చైనా, ఇప్పడు మన పంచశీల సూత్రాలనే మనకు వల్లించే ప్రయత్నం చేస్తోంది.. ఇప్పడు చెప్పండి చైనాను మనం నమ్మొచ్చా? ఎన్డీఏ ప్రభుత్వంలో రక్షణ మంత్రిగా ఉన్న జార్జ్ ఫెర్నాండెజ్ చైనా మన దేశానికి అసలైన శత్రువని ప్రకటించి కుండ బద్దలు కొట్టారు.. అయితే ఇండియాలోని చైనా మిత్రులు (తొత్తులు అనడం నాకు ఇష్టం లేదు) ఆయనపై గయ్యిన లేచారు.. కానీ ఇది ముమ్మాటికి నిజం.. చైనాను నమ్మలేం..





No comments:

Post a Comment