Saturday, January 3, 2015

శృతి మించిన నిజాం భజన

ఏడో నిజాం రాజు మన గొప్ప రాజు.. ఆయన పాలనలో తప్పులు జరిగి ఉండొచ్చు.. కానీ సెక్యులర్ రాజు.. అని కొనియాడారు తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు.. ఇది నిజమా? మీర్ ఉస్మాన్ అలీఖాన్ అంత గొప్పోడా?
నిజాం నవాబు అంత మంచివాడు, గొప్పవాడైతే కొమురం భీం ఎందుకు ఆయన మీద పోరాటం చేశారు?.. షోయబుల్లా ఖాన్ ఎందుకు నిజాం, ఆయన తొత్తులు రజాకార్లపై అక్షరాయుధాలు ఎక్కుపెట్టారు?.. మరి చాకలి ఐలమ్మ ఎందుకు నవాబు పాలన మీద తిరగబడింది? వీరి బలిదానాలు ఇక విలువలేనివేనా?
అంత గొప్ప మారాజుపై ఆర్యసమాజీయులు, స్టేట్ కాంగ్రెస్ వాళ్లు, కమ్యూనిస్టులు ఎందుకు పోరాటం చేశారు? వీరందరినీ మనం ఎందుక పూజిస్తున్నాం?.. ఆరాధిస్తున్నాం? చివరకు హైదరాబాద్ సంస్థానం భారత దేశంలో విలీనం కావడం కూడా తప్పేనా? అందుకేనా మీరు సెప్టెంబర్ 17 ఉత్సవాలు జరపడానికి వెనుకాడుతున్నది?
మా నిజాము రాజు తరతరాల బూజు అని రాసిన దాశరధి కృష్ణమాచార్య చాలా పెద్ద తప్పు చేశాడు కదూ..
నిజాం నవాబుకు గోల్కండ ఖిలా కింద ఘోరీ కడతానంటాడా నల్లగొండ యాదగిరి.. ఏం పోయే కాలం ఈయనకు?
నిజాం నవాబు మీద బాంబు వేసి హతమార్చే ప్రయత్నం చేసిన ద్రోహినారాయణ రావు పవారు నిన్నమొన్నటి దాకా మన ముందే ఉన్నా ఎలా సహించాం మనం?
ఏమంటిరి సీఎం గారూ?.. నిజాము నవాబు సెక్యులరా?.. మరి ఏడో నిజాం నవాబు ఉస్మాన్ అలీఖాన్ అధికారంలోకి రాగానే తన తండ్రి కాలం నుండి ప్రధానమంత్రి పదవిలో ఉన్న మహారాజా కిషన్ పర్షాద్ ను ఎందుకు అధికారంలోంచి తొలగించాడు.. ఒక హిందువుకు అత్యున్నత పదవిలో ఉండే అర్హత లేదని సాకు చూపాడు.. పైగా తూ కిషన్ పర్ షాద్ హైతో మై ఖుదా పర్ షాద్.. (నీవు కృష్ణుని ప్రసాదమైతే, నేను ఖదా ప్రసాదాన్ని) అంటూ ఈసడించాడు.. మరో సందర్భంలో బందే నా ఖూన్ హువా సున్కే నిదాయే తక్బీర్, జలజలా హి అహి గయారిప్త యే జున్మార్మేభి అంటూ రహబరే దక్కన్ అనేపత్రికలో హిందువుల తమ చిహ్నాలపై విధ్వేషాన్ని బయట పెట్టుకున్నాడు..
ఏడో నిజాం పాలనలో మెజారిటీ ప్రజల భాష తెలుగుపై నిషేధం అమలులో ఉండేది.. వినాయక చవితి, దసరా పండుగలు బహిరంగంగా జరుపుకునే వీలు లేదు.. ఊరేగింపులు, సభలపైనా నిషేధం అమలులో ఉండేది.. తబ్లిగ్ పేరిట విచ్చల విడిగా మత మార్పిడులు జరిగాయి.. ఇందు కోసం ప్రభుత్వంలో ఒక విభాగాన్నే ఏర్పాటు చేశారు.. హైదరాబాద్ సంస్థానంలో మెజారిటీ ప్రజలైన హిందువులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రాధాన్యత లేదు..
నిజాం ప్రభువు చల్లని పాలనలో ఆయన తొత్తు, రజాకార్ల అధినేత కాశిం రజ్వీ సాగించిన అరాచకాలు అన్నీ ఇన్నీ కావు.. నియంతృత్వ పాలనను, మత మార్పిడులను ప్రశ్నించిన ఎంతో మంది ఆర్యసమాజ్, కాంగ్రెస్ కార్యకర్తలను హత్య చేశారు.. కాశిం రజ్వీ నాయకత్వంలోని రజాకర్ల దండు, నిజాం సైన్యం, పోలీసులు విచ్ఛలవిడిగా సాగించిన దోపిడీలు, హత్యలు, అత్యాచారాల గురుంచి ఇంకా బతికే ఉన్న ఆనాటి పెద్దవాళ్లు తెలంగాణ ప్రాంతంలో ఇప్పటికీ చెప్పుకుంటునే ఉంటారు.. మహిళలను నగ్నంగా బతుకమ్మలు ఆడించడం.. గ్రామలపై పడి మగవాళ్లను సామూహికంగా హత్యలు చేసి, ఆడవాళ్లను మానభంగం చేయడం.. ఇంకా వారి కండ్ల ముందే మెదులుతుంటాయి.. చెప్పుకుంటూ పోతే భారీ పుస్తకమే రాయాలి..
నిజాము రాజు అవి కట్టించాడు ఇవి కట్టించాడు అని గొప్పలు చెప్పకోవడం సరికాదు.. ఎంత నిరంకుశ, నియంతృత్వ పాలకుడైనా తన రాజ్యాన్ని వల్లకాడుగా ఉంచుకోలేడు కదా? ప్రజల కోసం చేస్తున్నాం అని చెప్పుకోవడానికి ఎంతో కొంత అభివృద్ధి చూపించుకుంటారు. తమ రాజ్యాలకు అందాలు అద్దు కుంటుంటారు.. రాజ్యంలో కొన్ని సౌకర్యాలు అయినా ఉంటాయి.. నిజాం ఉస్మాన్ అలీఖాన్ చేసింది కూడా అదే పని.. వీటిని భూతద్దంలో చూపించి నిజాం నవాబు మంచోడు, గొప్పోడు అనడం సమంజసమేనా?

ఓటు బ్యాంకు రాజకీయాలతో మెజారిటీ ప్రజల మనోభావాల పరిహసించడం ఎందుకు? నిజాము గొప్పోడు, మంచోడు అని భావించే వారు ఆయన చిత్రపటాన్ని ఇంట్లో పెట్టుకొని నిరభ్యంతరంగా పూజించుకోవచ్చు.. కానీ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన యోధులు, అమరులు, త్యాగధనుల ఆత్మలకు క్షోభ కలిగించే భజనలు వద్దు..

No comments:

Post a Comment