Sunday, January 18, 2015

కశ్మీరీ పండిట్ల ఆక్రంధనలు పట్టావా?..

తేదీ:19-01-1990.. సరిగ్గా పాతికేళ్లు పూర్తయింది.. తరతరాలుగా జీవిస్తున్న నేల నుండి అన్యాయంగా గెంటేశారు.. సామూహికంగా బహిష్కరించారు.. ఒకరు కాదు, ఇద్దరు కాదు.. వేలు, లక్షల మంది జనం... తమ కళ్ల ముందే జరుగుతున్న అన్యాయాన్ని చూడలేక పోయారు.. పట్టించుకునే దిక్కు లేదు.. ప్రభుత్వం అనేదే లేదు.. తమ ఇండ్లు, ఆస్తిపాస్తులు వదిలేసి ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని సొంత పట్టణాలు, గ్రామాలను వదిలేసి బయటకి వచ్చేశారు.. వారే కశ్మీరి పండిట్స్.. దేశ విభజన తర్వాత జరిగిన మరో విషాద ఘట్టం ఇది..
ఆజాది.. జీహాదీ.. వారి నినాదం. భారత దేశం నుండి వేరు కావాలి.. పాకిస్తాన్ అండ దండలతో చెలరేగి పోతున్న వెర్రి తలల వేర్పాటు వాదం కాశ్మీర్ లోయలో చిచ్చు పెట్టింది.. వేలాది సంవత్సరాల కశ్మీరి, హిందూ సంస్కృతి సాంప్రదాయలకు ప్రతీక అయిన కశ్మీరి పండిట్స్ వీరికి శత్రువుల్లా కనిపించారు.. వీరిని తరిమేస్తే కానీ తమ లక్ష్యం పూర్తి కాదనే వెర్రితనం వేర్పాటు వాదులను ఆవహించింది.. పొరుగు దేశం స్వార్థ ప్రయోజనాలతో నూరిపోసిన ఆజాదీ అనే మత్తు మందుకు తోడు ఏకే 47 లాంటి ఆయుధాలతో పైశిచికంగా విజృంభించారు.. కశ్మీర్లో ఉండాలంటే హిందూ మతాన్ని వదిలేయాలి.. ఆజాదీకి మద్దతు పలకాలి.. లేదా లోయను వదిలేసి పోవాలి.. ఇవి వేర్పాటు వాదుల బెదిరింపులు.. పండిట్ల ఊచకోతలు, మానభంగాలు, లూఠీలు, గృహ దహనాలు, బెదిరింపులు నిత్యకృత్యంగా మారాయి. ఈ ముష్కరుల ఆగడాలకు విలవిలలాడిపోయారు కశ్మీరీ పండిట్లు.. స్వధర్మాన్ని, భారత దేశంతో ఉన్న అనుబంధాన్ని వదులుకోవడం ఇష్టంలేక, విధిలేని పరిస్థితుల్లో లోయను వదిలేసి వచ్చేశారు.. అలా కశ్మీర్లో 1980ల చివర్లో మొదలైన చిచ్చు 90ల తొలి భాగంలో తీవ్రమైంది.. పండిట్ల గెంటివేత పెద్ద సంఖ్యలో మొదలై, ఈనాటికీ కొనసాగుతోంది..
కశ్మీరీ పండిట్ల వ్యధను పట్టించుకునే నాధుడే లేడు.. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వారి సమస్యను పరిష్కరించడంలో పూర్తిగా విఫలమైపోయాయి.. తమ నేలను, ఇళ్లూ, ఆస్థి పాస్తులు వదిలేసి వచ్చిన పండిట్లు ఈనాటికీ సొంత దేశంలో శరణార్థుల్లా, దిక్కులేని వారిలా జీవిస్తున్నారు.. ఢిల్లీ, జమ్మూ తదితర నగరాల్లో వేలాది మంది కశ్మీరీ పండిట్స్ గుడారాల్లో మగ్గిపోతున్నారు.. తమ భవిష్యత్తు ఏమిటో తెలియని దుస్థితి.. మానవ హక్కులు, న్యాయం, చట్టం అంటూ గొంతు చించుకు అరిచే వారికి ఆజాదీ, జీహాదీ అనే వేర్పాటు వాదుల పాటలు వీనుల విందుగా వినిపిస్తాయి.. కానీ కశ్మీర్ మూల సంస్కృతికి ప్రతీకలైన పండిట్ల ఆక్రందనలు మాత్రం వినిపించవు..
కశ్మీరీ పండిట్లు పెద్ద సంఖ్యలో లోయను వదిలేసిన తేదీ 19-01-1990ని Kashmiri Pandits Exodus Dayగా పాటిస్తున్నారు.. జమ్మూ కశ్మీర్ రాష్ట్రం ఏవిధంగా చూసినా భారత దేశంలో సంపూర్ణమైన భూభాగం. దీన్ని దేశం నుండి విడదీసే శక్తి ఎవరికీ లేదు..  కశ్మీర్ ను కాపాడుకునే బాధ్యత ప్రతి భారతీయుడిపై ఉంది.. అలాగే పండట్లకు పూర్తి స్థాయిలో న్యాయం జరిగే వారకు వారికి మనమంతా అండగా నిలవాల్సిన అవసరం ఉంది.

No comments:

Post a Comment