Wednesday, January 14, 2015

రైతన్న నిజంగా పండుగ చేసుకుంటున్నాడా?

సంక్రాంతి.. రైతుల పండుగ. పండిన పంట ఇంటికి చేరిన వేళ జరుపుకునే పండుగ.. రైతన్నలు ఎంతో ఆనందంగా చేసుకునే వేడుకలు భోగి.. సంక్రాంతి.. కనుమ.. ఇదీ మనం వింటున్నది.. ఇందులో నిజమెంత? అతిశయోక్తి ఎంత? మరి రైతన్న కష్టం గురుంచి ఎప్పుడైనా ఆలోచించామా?
తినే అన్నం మెతుకులు ఎక్కడి నుండి వచ్చాయో తెలియని తరం మనది.. షాపులో బియ్యం కొంటాం సరే, మరి వాటిని తయారు చేస్తున్నది ఎవరు? మీ పిల్లలకు ఎప్పుడైనా ఈ విషయం చెప్పారా?..
ఒక ఉత్పత్తిదారుడు తన వస్తువును తయారీకి అయ్యే ఖర్చుపోను లాభం చూసుకొని డిస్ట్రిబ్యూటర్ కు అమ్ముకుంటాడు.. ఆ డిస్ట్రిబ్యూటర్ తన లాభం చూసుకొని రిటైలర్ కు అమ్ముతాడు.. సదరు రిటైలర్ వినియోగదారునికి అమ్మిన మొత్తంలో కొంత లాభం చూసుకుంటాడు.. మరి రైతు సంగతో?
పంట వేయాలంటే అప్పు తేవాలి.. విత్తనాలు, ఎరువులు, మందులు కొనాలి.. నీటి వనరులు, విద్యుత్తు ఉండాలి.. ఆరు గాలం కష్టపడి పండించే పంటకు చీడ పీడల ముప్పు పొంచి ఉంటుంది.. దాన్నుంచి బయట పడేలోపు ఏ ప్రకృతి బీభత్సమో కబలించే ప్రమాదమూ ఉంది.. వీటిన్నింటినీ అధిగమించాక పండిన పంటకు తగిన రేటు ఉంటుందో లేదో తెలియదు.. రేటును నిర్ణయించేది తాను కాదు.. దళారీ చెప్పిన రేటుకే అమ్మాలి.. లేదా ప్రభుత్వం ఇచ్చే గిట్టుబాటు అనే దిక్కుమాలిన ధర ఉంటుంది.. వెరిసి రైతు చేతికి వచ్చింది లెక్కిస్తే చాలా సందర్భాల్లో తాను పెట్టిన పెట్టుబడి కూడా చేతికి రాదు.. అప్పు తీరదు.. దీన్ని తీర్చేందుకు కొత్త అప్పు చేసి మరో పంటకు సిద్దం కావాలి.. మరి ఆ పంట భవిష్యత్తు ఏమిటి?.. ఏమో తెలియదు.. ఎందుకంటే ఇదో మాయా జూదం..
రైతన్న ఎప్పుడో స్వేచ్ఛ కోల్పోయాడు.. కట్టు బానిసకన్నా దీనమైన పరిస్థితి.. అందరం తినేది రైతన్న కష్టమే.. కానీ అతని బాగోగులు ఎవరికీ పట్టవు.. వ్యవసాయంపై పెట్టుబడి విపరీతంగా పెరుగుతోంది.. కానీ ప్రతి ఫలం మాత్రం రైతుకు దక్కడం లేదు.. వీటి ఫలితమై రుణభారం, ఆకలి చావులు..

ప్రతి రాజకీయ నాయకుడు రైతు గురుంచి మాట్లాడే వాడే.. ఉచిత విద్యుత్తు, రుణ మాఫీ పేరిట తాయిలాలు చూపించి, వారి బతుకులను యాచకునికన్నా హీనంగా మార్చేశారు.. అసలు రైతుకు కావాల్సింది ఏమిటి? ఏం చేస్తే వారి  బతుకులు మారతాయి అని చిత్తశుద్దితో ఆలోచించారా? రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వాలు చేపడుతున్న కార్యక్రమాలు వారికి పూర్తి స్థాయిలో చేరుతున్నాయా? అందరు వ్యాపారులు లాభసాటిగా సరుకు అమ్ముకునే స్వేచ్ఛ ఉన్నప్పుడు రైతులు మాత్రం ఎవడో నిర్ణయించిన ధర ప్రకారమే ఎందుకు అమ్మాలి..


 

No comments:

Post a Comment