Wednesday, January 7, 2015

మీ రక్షణ కోసమే హెల్మెట్..

హైదరాబాద్, సైబరాబాద్ పోలీసులు మళ్లీ హెల్మెట్ కంపల్సీరీ చేశారు.. వీరికేం పోయేకాలం.. అంటూ నిట్టూర్చాడో జర్నలిస్టు మిత్రుడు. పోయే కాలం వారికి కాదు మిత్రమా, హెల్మెట్ పెట్టని నీలాంటోడికి అని మొహమ్మీదే పంచ్ విసిరాను.. మనోడు ఆశ్చర్యంగా చూశాడు.. మన పోలీసులు బుద్ది పుట్టినప్పుడు హెల్మెట్ కంపల్సీరీ అంటారు.. తర్వాత పట్టించుకోరు.. కానీ దేశంలోని ప్రధాన నగరాలన్నింటిలో టూవీలర్ నడిపే వారికి హెల్మెట్ కంపల్సరీ, వెనుక కూర్చున్న వారికీ తప్పదు..
హెల్మెట్ ధరించకుండా తప్పించుకోడానికి రకరకాల సాకులు చెబుతారు. హెల్మెట్ ఉంటే జుట్టు చెడిపోతుంది.. మెడ నొప్పి వస్తుందట.. పక్కన ఏ వాహనం పోతుందో సరిగ్గా కనిపించదు.. హారన్ వినిపంచదట.. శ్వాస తీసుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది.. హెల్మెట్ పెట్టుకున్నా యాక్సిడెంట్ జరిగితే పోయేవాడు ఎలాడూ పోతాడు.. ఈ వాదనల్లో దీనికీ పసలేదు..
నా దృష్టిలో హెల్మెట్ ధరించడం వల్ల నూటికి 100% లాభాలే ఉన్నాయి.. అన్నింటికన్నా ముఖ్యమైంది.. మీ తలకు భద్రత. ప్రమాదాలు జరిగిన సమయంలో తలకు బలమైన గాయాలు తగలకుండా హెల్మెట్ కాపాడుతుంది.. కాలుష్యం నుండి మీ మొహానికి  రక్షణ.. ఎండా కాలంలో, వానా కాలంలో, శీతాకాలంలో సీజన్ ఏదైనా మీ తల సేఫ్.. హాప్ హెల్మెట్, డిప్ప హెల్మెట్ల కన్నా ఫుల్ హెల్మెట్ ధరించడమే మంచిది.. పోలీసులు స్ట్రిక్ట్ చేస్తున్నారని డబ్బుకు కక్కుర్తి పడి నాసిరకం హెల్మెట్ కొనకండి.. డబ్బు కాస్త ఎక్కువైనా బ్రాండెడ్, నాణ్యమైన హెల్మెట్లే కొని ధరించండి..

నేను టూవీలర్ నడపడం ప్రారంభించిన రెండున్నర దశాబ్దాల్లో ఏనాడూ హెల్మెట్ లేకుండా రోడ్డు ఎక్కలేదు.. చివరకు పక్క వీధికి పోవాలన్నా హెల్మెట్ ఉండాల్సిందే.. ఈ అనుభవంతోనే మీకు సలహా ఇస్తున్నాను.. మరోమాట.. నేనే హెల్మెట్ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ కాదు.. ఏ బ్రాండునూ ప్రమోట్ చేయడం లేదు..

No comments:

Post a Comment