Saturday, January 31, 2015

ఛ‌త్తీస్‌గ‌డియా స‌బ్‌లే బ‌డియా..

छत्तीसगढ़िया सबले बढ़िया.. రాయ్‌పూర్‌ శివారులో స్వామి వివేకానంద విమానాశ్రయం వెళ్లే రోడ్డులో స్వాగత ద్వారంపై కనిపించిన వాక్యం ఇది.. అంటే ఛ‌త్తీస్‌గ‌డ్‌ చాలా ఉత్తమమైనది అని అర్థం..
ఛ‌త్తీస్‌గ‌డ్‌ రాజధాని రాయ్‌పూర్‌ వెళతానని ఎప్పుడూ అనుకోలేదు.. మహా అయితే మన దేశంలో ఢిల్లీ, ముంబై లాంటి మెట్రో నగరాలకో లేదా పర్యాటక ప్రదేశాలకో, పుణ్యక్షేత్రాలకో ఏదో ఒక సందర్భంలో వెళతాం.. కానీ రాయ్‌పూర్‌ వెళ్లాల్సిన అవసరమే పడకపోవచ్చు.. కానీ ఈ చిన్న నగరానికి అనుకోకుండా వెళ్లాను.. ఒక విధంగా మంచిదే అయింది.. లేకపోతే ఒక అందమైన నగరాన్ని చూసే అవకాశం కోల్పోయేవాన్నే..
రాయ్‌పూర్‌.. 11 లక్షల జనాభా గల ఈ చిన్న నగరం ఎంతో సుందరంగా కనిపించింది. హైదరాబాద్ నగరంతో పోలిస్తే రాయ్‌పూర్‌ రోడ్లు చాలా నయం అనిపించింది. విశాలమైన రోడ్లకు తోడు ట్రాఫిక్, కాలుష్యం కూడా చాలా తక్కువ.. తెల్లని చొక్కాలు, టోపీలతో ట్రాఫిక్ కానిస్టేబుల్స్ కౌబాయ్స్ మాదిరిగా కాస్త వింతగా కనిపించారు. తక్కువ వ్యవధి ఉన్నందున రాయ్‌పూర్‌ నగరంలోని ప్రదేశాలన్నింటినీ పెద్దగా చూడలేకపోయాం.. కానీ నగర్ గడీ క్లాక్ టవర్, షహీద్ స్మారక్ చౌక్, వివేకానంద సరోవర్, మాలవీయ మార్గ్, బిరాన్ బజార్ల మీదుగా కారులో ప్రయాణించాం..
ఛ‌త్తీస్‌గ‌డ్‌ ముఖ్యమంత్రి రమణ్ సింగ్ పరిపాలనా దక్షత చూడాలంటే రాయ్‌పూర్‌ చూస్తే చాలనిపించింది.. కొత్తగా నిర్మిస్తున్న నయా రాయ్‌పూర్‌ మరో అద్భుతం.. కానీ సమయాభావం వల్ల సందర్శించలేకపోయాం..
అంతా బాగానే ఉంది కానీ రాయ్‌పూర్‌ ఆహారం తలచుకుంటేనే భయమేసింది.. పొద్దున్నే కచోరీ, జిలేబీల అల్పాహారం.. భోజనంలో లావుపాటి జిడ్డు పూరీలు భరించలేక పోయాం.. రాయ్‌పూర్‌ వాసులు పెరుగు, మజ్జిగ అంతగా వాడరనుకుంటాను.. మనకు అవి లేనిదే ముద్ద దిగదాయే.. అక్కడి ఆహారంలో కారాలు, మసాలాల వాడకం కాస్త తక్కువే.. ఇదీ ఒకందుకు మంచిదే అనిపించింది..

జమ్మూ కశ్మీర్ అధ్యయన కేంద్రం జాతీయ సదస్సు కోసం ఎన్వీకె ప్రసాద్, రాకా సుధాకర్, రవిశంకర్, విక్రం సింహా, చౌదరి గార్లతో ఇటీవల రాయ్‌పూర్‌ నగరానికి వెళ్లాను.. నిజంగా ఈ నగర దర్శనం చాలా చక్కని అనుభూతిని ఇచ్చింది.. రాయ్‌పూర్‌ను చూసి పరవశించిపోయిన మా బృందంలోని ఒక మిత్రుడు ఒక్కడే స్థిరపడి వ్యాపారం పెట్టేసుకుంటాననేశాడు.. నాకైతే మరోసారి ఈ నగరాన్ని చూసేందుకు వెళ్లాలనిపిస్తోంది..

No comments:

Post a Comment