Friday, October 31, 2014

వల్లభభాయి తొలి ప్రధాని అయ్యి ఉంటే?..

సర్దార్ వల్లభభాయ్ పటేల్ స్వతంత్ర భారత తొలి ప్రధానమంత్రి అయ్యి ఉంటే?.. దేశ చరిత్ర గతి ఎలా ఉండేది?
ఈ ప్రశ్న ఈ మధ్య కాలంలో తరచూ వినిపిస్తోంది.. నిజమే సర్దార్ పటేల్ మన దేశానికి తొలి ప్రధాని అయి ఉంటే బాగుండేది.. ప్రస్తుతం మన దేశం ఎదుర్కొంటున్న సమస్యలకు ఆనాడే ఫుల్ స్టాప్ పడి ఉండేది..
బ్రిటిష్ వారు స్వాతంత్ర్యం ఇచ్చే నెపంలో దేశాన్ని విభజించారు.. పాకిస్తాన్ అనే శాశ్వత చిచ్చు రగిలించారు.. 552 స్వదేశీ సంస్థానాలకు ఇండియా లేదా పాకిస్తాన్లో చేరవచ్చు లేదా స్వతంత్రంగా ఉండొచ్చు అనే మెలిక పెట్టి వెళ్లారు.. ఈ సంస్థానాల కారణంగా ఎప్పటికీ సమస్యలు తప్పదని గ్రహించారు తొలి ఉప ప్రధాని, హోంమంత్రి సర్ధార్ వల్లభభాయి పటేల్.. సంస్థానాధీశులందరినీ ఒప్పించి భారత దేశంలో సంపూర్ణంగా విలీనం చేశారు.. అయితే హైదరాబాద్, జునాఘడ్, జమ్మూ కాశ్మీర్ సంస్థానాల సంగతి తేలలేదు..  ఈ దశలో పటేల్ కఠిన నిర్ణయం తీసుకున్నారు.. హైదరాబాద్, జునాఘడ్లను దండోపాయంతో దారికి తెచ్చారు.. అయితే కాశ్మీర్ విషయంలో ప్రధాని నెహ్రూ తానే స్వయంగా జోక్యం చేసుకున్నాడు.. అందుకే అది నేటికీ ఎటూ తేలకుండా రావణ కాష్టంలా రగులుతూ ఉంది..
కాశ్మీర్ సమస్యను నెహ్రూ ఐక్యరాజ్య సమితికి నివేదించడాన్ని వల్లభభాయి పటేల్ తప్పు పట్టారు. అలాగే పాకిస్తాన్ కు 55 కోట్ల రూపాయలు ఇవ్వాలనే నిర్ణయాన్ని గట్టిగా వ్యతిరేకించారు. సర్దార్ పటేల్ కేవలం 40 నెలలు మాత్రమే ఉప ప్రదాని పదవిలో ఉన్నారు.. ఆయన ఇంకొన్ని సంవత్సరాలు బతికి ఉంటే టిబెట్ సమస్య, చైనా యుద్దం వచ్చేవి కావని చెప్పక తప్పదు.. పాకిస్తాన్, చైనా దురాక్రమణలకు కచ్చితంగా అడ్డుకట్ట వేసి ఉండేవారు..  ప్రధాని నెహ్రూ తొందర పాటు  నిర్ణయాలకు పటేల్ ఎప్పటికప్పుడు అడ్డుకట్ట వేస్తూ వచ్చారు..  వారి మరణం తర్వాత నెహ్రూకు పట్టపగ్గాలు లేకుండా పోయాయి.. ఎన్నో తప్పటడుగులు వేస్తూ వచ్చారు..
వాస్తవానికి దేశ విభజన తర్వాత సర్ధార్ పటేల్ ప్రధానమంత్రి పదవి చేపట్టాలని దేశ ప్రజలంతా కోరుకున్నారు. కాంగ్రెస్ పార్టీలోని మెజారిటీ నాయకులు, సభ్యుల అభిమతం కూడా అదే.. కానీ మహాత్మా గాంధీ తన ప్రియ శిష్యుడు నెహ్రూ వైపు మొగ్గు చూపించారు.. ఉప ప్రధానిగా, హోంమంత్రిగా పటేల్ బాధ్యతలు చేపట్టిన పటేల్ తానేమిటో ఆచరణలో చూపించారు.. దేశ సమగ్రతకు బాటలు వేశారు.. వల్లభభాయి పటేల్ తొలి ప్రధాని అయి ఉంటే మన దేశ చరిత్ర ఇప్పుడున్నంత అధ్వాన్న స్థితిలో మాత్రం ఉండేది కాదు.. పటేల్ తన ధృడ నిర్ణయాలతో చక్కని బాట వేసేవారు.. నెహ్రూలా తొందర పాటు నిర్ణయాలు తీసుకునేవారు కాదు.. అందుకే అన్ని ఉక్కు మనిషి అన్నారు..

అక్టోబర్ 31న సర్ధార్ వల్లభభాయి పటేల్ జయంతిని భారత ప్రభుత్వం రాష్ట్రీయ ఏక్తా దివస్ గా ప్రకటించింది.. దేశ సమగ్రత, ఐక్యత, భద్రత కోసం చిత్తశుద్దితో పని చేస్తూ పటేల్ ఆశయాల సాధన కోసం మనమంతా ప్రతిన బూనాల్సిన తరుణమిది..

No comments:

Post a Comment