Saturday, October 4, 2014

దసరా జ్ఞాపకాలు..

దసరా అంటే నాకెంతో సరదా.. హైదరాబాద్ పాత నగరంలో పుట్టి, నాకు పండుగలంటే వినాయక చవితి, విజయ దశమి మాత్రమే.. మా ఓల్డ్ సిటీ జన జీవితంతో ఎంతగానో ముడిపడి ఉన్న పండుగలు ఇవి.. కులాలకు అతీతంగా అందిరినీ కలిపే ఉత్సవాలు ఇవి..
గణేష్ చవితి, దసరా పండుగల పేర్లు వినగానే చిన్ననాటి సంగతులు గుర్తుకు వస్తాయి... ఆ జ్ఞాపకాలు సరాసరి చిత్రగుప్త దేవాలయానికి వెళతాయి.. గుడిల గణేషున్ని తెచ్చిండ్రట.. అనగానే పరుగెత్తుకెళ్లి చూడాల్సిందే.. మా ఆటల ముందు ఆకలి దప్పులు బలాదూర్.. ఇక దసరా వచ్చిందంటే ఆ సందడే వేరుండేది..  బతుకమ్మ ఆటలు, పాట పిట్ట దర్శనం, రథయాత్ర, ఆర్య సమాజ్ శోభాయాత్ర, చివర్లో రావణ దహనం.. రావణాసురున్ని ఎప్పుడు కాలుస్తారా అని క్లైమాక్స్ కోసం ఎదురు చూసేవాళ్లం.. రావణ దహనం తర్వాత బంగారం అంటూ జమ్మి ఆకు పంచుకొని, ఆలింగనం చేసుకొని దసరా శుభాకాంక్షలు చెప్పుకోవడం, పెద్దల కాళ్లకు మొక్కి ఆశీర్వాదాలు తీసుకోవడం.. 1990కి ముందునాటి తీపి గుర్తులివి..
కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా?.. చిత్రగుప్త దేవాలయం ఉంది.. కానీ ప్రహరీ గోడను రైల్ ఓవర్ బ్రిడ్జ్ మింగేసింది.. ఆక్రమణలు పోగా ఆలయ ప్రాంగణ మూడో వంతుకు తగ్గిపోయింది.. బతుకమ్మలు నిమజ్జనం చేసే బావి రెండు దశాబ్దాల క్రితమే పూడ్చేశారు.. రథయాత్ర ఎప్పుడో నిలిచిపోయింది.. చిత్రగుప్త దేవాలయంలో దసరా వేడుకలు జరుగుతున్నాయి.. కానీ మునుపటి సందడి లేదు..

తరాలు మారిపోయాయి.. ఆనాటి ముచ్చట్లు చెప్పితే అవునా అని ఆశ్చర్యపోతోంది నేటి తరం.. మనసులో ఏదో కోల్పోయిన బాధ.. జ్ఞాపకాలు అలాగే ఉంటాయి.. కానీ మళ్లీ చిన్న పిల్లలం కాలేం కదా? 

No comments:

Post a Comment