Thursday, October 2, 2014

మహాత్మా.. ఓ మహాత్మా

మోహన్ దాస్ కరంచంద్ గాంధీ.. భారత మాత మహా పుత్రుడు..దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన నాయకుల్లో ప్రముఖులు.. 20వ శతాబ్దంలో ప్రపంచాన్ని ప్రభావితం చేసిన వ్యక్తుల్లో మహాత్మా గాంధీయే అగ్రస్థానంలో ఉన్నారు.. గాంధీజీ జీవితమే ఒక సందేశం.. సత్యం, అహింస ఆయన ఆయుధాలు.. వీటితోనే ఆయన స్వాతంత్ర్య సమర పోరాటంలో పాల్గొన్నారు.. సత్యాగ్రహం, సహాయ నిరాకరణ, స్వదేశీ స్వావలంభన గాంధీజీ ఆచరించి చూపించారు.. జాత్యహంకారం, అంటరానితరం, మద్యపానం లాంటి సామాజిక రుగ్మతలపై ఆయన పోరాడారు..
మహాత్మ గాంధీ రామరాజ్యం, గ్రామ స్వరాజ్యం గురుంచి కలలు కన్నారు..స్వదేశీ స్వావలంభన కోసం పిలుపునిచ్చారు.. తాను స్వయంగా నూలు వడికి, అవే బట్టలు ధరించారు.. గాంధీజీ దేశ ప్రజల కష్టాలను చూసి చలించిపోయి జీవితాంతం నిరాడంబరంగా జీవించారు.. ఒంటిపై కేవలం రెండే వస్త్రాలు ధరించారు మహాత్ముడు.. గ్రామ సీమలు సస్యశ్యామలంగా ఉంటేనే దేశం పచ్చగా ఉంటుందని గాంధీజీ చెప్పేవారు.. గో ఆధారిత ఆర్ధిక వ్యవస్థపై ఆయనకు పూర్తి నమ్మకం ఉండేది అందుకే సంపూర్ణ గోవధ నిర్మూలనకు పిలుపునిచ్చారు గాంధీజీ.. మహిళలు అర్ధరాత్రి కూడా నిర్భయంగా తిరిగే పరిస్థితి ఉన్నప్పుడే దేశానికి నిజమైన స్వాతంత్ర్యం వచ్చినట్లని చెప్పాడు మహాత్ముడు..
గాంధీజీని భారత దేశం ఎప్పటికీ మరచిపోదు.. కానీ ఆయన బోధనలను మాత్రం పాటించడంలో మాత్రం విఫలమౌతున్నాం.. గాంధీజీ బోధనలు స్వాతంత్ర్యోద్యమ కాలం నాటి సమాజాన్ని ఉద్దేశించినవే కావచ్చు.. కానీ అవి నేటి సమాజానికీ ఎంతో చక్కగా వర్తిస్తాయి.. కాలానుగుణంగా మార్పులు సహజం.. కాని మూల సూత్రాలు మాత్రం ఎన్నటికీ ఆచరణయోగ్యమే.. నేటి తరం నాయకులు గాంధీ పేరు చెబుతారు.. కాని ఆయన సూచించిన నిరాడంబర జీవితాన్ని పాటించడం మాత్రం కష్టమంటారు.. గాంధీజీ మాదిరిగా రెండు వస్త్రాలు ధరించాల్సిన అవసరం లేదు.. కానీ ఆయన సూచించిన మార్గంలో నడుస్తూ, నిజాయితీగా ప్రజా సేవ చేస్తే చాలు..
మహాత్మా గాంధీ 145వ జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పిస్తూ ఆ మహానుభావున్ని స్మరించుకుందాం..

No comments:

Post a Comment