Monday, January 29, 2018

ఇది న్యాయమేనా?



ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యం అని మనం చెప్పుకుంటాం.. కానీ దురదృష్టవశాత్తు తాజా పరిణామాలు మన ప్రజాస్వామ్యానికే మచ్చ తెచ్చే విధంగా ఉన్నాయి..
ప్రజాస్వామ్య వ్యవస్థలో శాసన, న్యాయ, కార్యనిర్వాహక వ్యవస్థల పాత్రను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. ఈ మూడు వ్యవస్థలు దేని పని అది సక్రమంగా పని చేస్తేనే వ్యవస్థ విజయవంతంగా సాగి ప్రజలు సుఖ సంతోషాలతో జీవిస్తారు.. ఈ విషయాలు అన్నీ మనం చిన్నప్పుడే స్కూలు పాఠాల్లో చదువుకొని ఉంటాం..
శాసన, న్యాయ వ్యవస్థల ఘర్షణ కొత్తేమీ కాదు. మన రాజ్యాంగం న్యాయ వ్యవస్థకు స్వతంత్ర ప్రతిపత్తిని కట్టబెట్టింది.. ఇందులో ప్రభుత్వాల జోక్యాన్ని పరిమితం చేసింది..
ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలు న్యాయ వ్యవస్థ తమకు అండగా ఉండాలని కోరుకోవడం సహజం. ప్రభుత్వ పెత్తనాన్ని న్యాయ వ్యవస్థ ఒప్పుకోదు.. ఇది మంచిదే.. 
ఇటీవలి కొన్ని పరిణామాలు గమనిస్తే కోర్టులు పరిధిని మించి క్రియాశీలకంగా పని చేస్తున్నాయా అనిపిస్తుంది.. పలు సందర్భాల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పులు ఇవ్వడం, విధానాలు, చర్యలను తప్పు పట్టడం చూస్తున్నాం.. 
ఇలాంటి జోక్యం ప్రజలకు మేలు చేసేదిగా ఉంటే ఆహ్వానించవచ్చు.. కానీ ప్రతి విషయంలో బెత్తం పట్టిన మాస్టారు మాదిరిగా ఉంటే ఇబ్బందిగానే ఉంటుంది.. ఇంత ఓవర్ యాక్షన్ అవసరమా అనిపిస్తోంది.. సుప్రీం కోర్టు న్యాయమూర్తుల నియామకంలో ప్రభుత్వ జోక్యం వద్దంటున్నారు.. సరే మరి వారు వేసుకున్న కొలీజియం ఏమి చేస్తోంది? జడ్జీల నియామకాల్లో జాప్యం కారణంగ ఎన్నో కీలకమైన కేసులు పెండింగులో పడిపోయాయి. 
ఇక అసలు విషయానికి వద్దాం..
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి వ్యతిరేకంగా నాలుగు న్యాయమూర్తులు గళం ఎత్తారు.. ఇక్కడ నేను సీజేను కానీ తిరుగుబాటు జడ్జీలను కానీ సమర్ధించడం లేదు.. వ్యతిరేకించడం లేదు.. వారి వెనుక ఎవరు ఉన్నారు?.. ఎందుకు ఈ పని చేయిస్తున్నారు అనేది కూడా చర్చించడం లేదు.. కానీ వీరు మీడియాకు ఎక్కి దేశ సర్వోత్తమ న్యాయస్థాన ప్రతిష్టను మాత్రం మంటకలిపారు.. వీరి టార్గెట్ ప్రధాన న్యాయమూర్తి.. ఈ వ్యవహారంలో తమకూ సమిష్టి బాధ్యత ఉందని గుర్తించడంలో పూర్తిగా విఫలం అయ్యారు.. ప్రధాన న్యాయమూర్తి కూడా పట్టు విడుపులతో వ్యవహరించాల్సింది..
అంతా అయిపోయాక ఆకులు పట్టుకున్న చందాన వీధిన పడ్డ వ్యవహారాన్ని అంతర్గతంగా పరిష్కరించుకోవాలనే ప్రతిపాదన మరీ విచిత్రం.. వీధిన పడి పరువు తీసుకున్న తర్వాత, దేశ ప్రజల దృష్టిలో పలచన అయ్యాక ఎన్ని రాజీలు, సర్దుబాట్లు చేసుకున్నా ఫలితం ఏముంటుంది?
(15.01.2018)

No comments:

Post a Comment