Wednesday, July 23, 2014

తెలంగాణను రక్షించుకుందాం..

నిన్న, మొన్నటి దాకా కశ్మీర్ హిందుస్తాన్ కా.. నహీ కిసీకా బాప్ కా.. అంటూ దేశ ప్రజలు నినాదాలు చేసేవారు.. ఇప్పుడు తెలంగాణ విషయంలో కూడా అలాంటి నినాదాలు చేస్తే దుస్థితి రానుందా?.. మోకాలికి, బట్ట తలకు ముడి పెట్టినట్లు కొందరు మహానుభావులు కాశ్మీర్, తెలంగాణ సమస్యలు కలిపేసి వాదిస్తున్నారు.. అసలు వీరికి భారత దేశ చరిత్ర తెలుసా? ఈ దేశ ప్రజల మనోభావాలు అర్థం చేసుకున్నారా?
1947కి పూర్వం జమ్మూ కాశ్మీర్, తెలంగాణ భారత దేశంలో భాగం కాదట.. ఈ రెండు ప్రాంతాల భూ చట్టాలు ఒకేలా ఉన్నాయట.. స్థానికేతరులు భూములు కొనడం నిషేధమట.. ఎందుకీ వక్రీకరణ? ఎవరి చెవిలో పూలు పెట్టాలనుకున్నారు?
తెలంగాణ ప్రాంతం హైదరాబాద్ స్టేట్లోని మూడు ప్రధాన భూభాగాల్లో ఒక భాగం.. దానికి ప్రత్యేక భూచట్టం ఉన్నట్లు చరిత్రలో ఎక్కడా లేదు.. నిజాం నవాబు నిరంకుశ పాలన, రజాకార్ల దురాగతాలకు వ్యతిరేకంగా ఇక్కడి ప్రజలు పోరాడారు.. హైదరాబాద్ స్వతంత్ర దేశంగా ఉంటుందని, అవసరమైతే పాకిస్తాన్లో చేరతామని ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ బెదిరించాడు.. కానీ హైదరాబాద్ రాష్ట్ర ప్రజలంతా భారత దేశంలో కలవాలని కోరుకున్నారు.. స్టేట్ కాంగ్రెస్ , ఆర్యసమాజం, కమ్యూనిస్ట్ పార్టీలు నిజాం పాలనకు వ్యతిరేకంగా తమ తమ మార్గాల్లో పోరాడాయి.. చివరకు భారత హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ నిర్వహించిన పోలీస్ యాక్షన్ తో భారత్ లో హైదరాబాద్ విలీనం సంపూర్ణంగా జరిగింది.. నిజాం నవాబు సైతం హుందాగా అంగీకరించి రాజ్ ప్రముఖ్ (గవర్నర్) పదవి స్వీకరించారు.. ఇదీ చరిత్ర..
ఇక తెలంగాణకి ప్రత్యేక భూచట్టం ఎక్కడి నుండి వచ్చినట్లు? ఇప్పటికే ఆర్టికల్ 370 పుణ్యమా అని జమ్మూ కాశ్మీర్ రావణ కాష్టంలా రగులుతోంది.. ఆ రాష్ట్రంలో ఇతరులు భూములు కొనడం నిషేధం.. కాశ్మీరీలు దేశ ప్రజలతో మమేకం కాకుండా మరికొన్ని క్రూర నిబంధనలు ఆర్టికల్ 370 కారణంగా అడ్డు పడుతున్నాయి.. చూడబోతే తెలంగాణకు కూడా ఇలాంటి ఆర్టికల్ కోసం వీరు డిమాండ్ చేయబోతున్నారా అనే అనుమానాలు ఏర్పడుతున్నాయి..
పాకిస్తాన్ ప్రేరిత వేర్పాటువాద శక్తుల కారణంగా ఇప్పటికే కాశ్మీర్ రావణ కాష్టంలా రగులుతూనే ఉంది.. ఈ జాబితాలో తెలంగాణను చేర్చాలనుకుంటున్నారా?

తెలంగాణ ఎక్కడి నుండో ఊడిపడలేదు.. ఈ దేశంలో సంపూర్ణమైన అంతర్భాగమిది.. ముందు మనం భారతీయులం.. ఆ తర్వాతే తెలంగాణ వాసులం.. మన తెలంగాణను రక్షించుకుందాం..

No comments:

Post a Comment