Wednesday, May 8, 2013

బీజేపీ స్వయంకృత అపరాధం..

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ముందుగా ఊహించినవే, కాబట్టి పెద్దగా ఆశ్చర్యం కలిగించలేదు.. బీజేపీ పరాజయం స్వయంకృతాపరాధమే.. ఎన్నో సంవత్సరాల తర్వాత వచ్చిన అధికారాన్ని నిల్పుకోవడంలో ఆ పార్టీ దారుణంగా విఫలమైంది.. యడ్యూరప్ప అవినీతి- గాలి జనార్ధన రెడ్డి గనుల లూఠీ ఒక ఎత్తైతే, కొందరు మంత్రులు-ఎమ్మెల్యేల అనైతిక చర్యలు కన్నడ ప్రజలకు ఏవగింపు కలిగించాయి.. నిజానికి పరిపాలనా పరంగా సదానంద గౌడ, జగదీష్ షెట్టర్ల  ప్రభుత్వాలను ఎక్కడా తప్పు పట్టలేం.. కానీ యడ్డీ, గాలి చేయాల్సినంత నష్టం చేశారు.. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్న చందాన వీరిద్దరి వదిలించుకున్నాం అని బీజేపీ నాయకులు ఎంత అరిచి గీ పెట్టినా ప్రజలు పట్టించు కోలేదు.. దీని ఫలితమే దారుణ ఓటమి..

యడ్యూరప్ప ముందుగా ప్రకటించినట్లు బీజేపీని ఓడించి ప్రతీకారమైతే తీర్చుకున్నాడు.. కానీ ఆయనకు అధికారం దక్కక పోగా కొబ్బరి చిప్పే (కేజేపీ ఎన్నికల చిహ్నం) మిగిలింలింది.. గాలి అనుచరుడు శ్రీరాములు బీఎస్సార్ కాంగ్రెస్ ( మన వైస్సార్ కాంగ్రెస్) లాంటిదే ప్రభావం బళ్లారీ పరిసరాలకే పరిమితం అయ్యింది.. ఇక దేవెగౌడ కుటుంబ పార్టీ మైసూర్ పరిసర జిల్లాలకే పరిమితం అయినా, బీజేపీతో సమానంగా ఓట్లు తెచ్చుకుంది.. పొత్తులు లేకుండా ఆ పార్టీ ఎన్నటికీ సొంతంగా అధికారంలోకి వచ్చే అవకాశం లేదు..
ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన ఆధిక్యత వచ్చినా,  వారేదో ఉద్దరిస్తారనే నమ్మకంతో కర్ణాటక ప్రజలు ఓట్లేశారని భావించలేం.. భాజపాతో పోలిస్తే కాంగ్రెస్ ఎన్నో రెట్ల అవినీతి పార్టీ అని అందరికీ తెలుసు.. కన్నడ ప్రజలు గతంలో కాంగ్రెస్ పాలనతో ఇంతకన్నా ఎక్కువ ఇబ్బందులే పడ్డారు.. అయితే  బీజేపీ, జేడీఎస్ పార్టీలపై నమ్మకం లేనందు వల్లే గత్యంతరం లేని పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించారు.. ప్రధాని మన్మోహన్ చెప్పినట్లు ఇదేం రాహుల్ గాంధీ ఘనతేం కాదు.. అదే నిజమైతే రాహుల్ గతంలో ప్రచార బాధ్యతలు చేపట్టిన ఉత్తర ప్రదేశ్, గుజరాత్, కేరళ తదితర ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవాల్సింది.. ఏమైనా క్రెడిట్ దక్కితే సిద్ద రామయ్యకే దక్కాలి..
ఏది ఏమైనా కర్ణాటక ప్రజలు కోరుకున్న మార్పును గౌరవించాల్సిందే.. కన్నడిగులకు అంతా మేలు జరుగుతుందనే ఆశిద్దాం..

No comments:

Post a Comment