Saturday, May 18, 2013

గో హత్య మహా పాతకం..

హిందువులకు ఆవు అత్యంత పవిత్రమైనది.. సకల దేవతలు కొలువైన ఆవును దైవంగా పూజిస్తారు.. తల్లితో సమాన ప్రాధాన్యత ఇచ్చి గోమాత అని పిలుస్తారు.. ఆవు పాలు, పేడ, పంచకానికి ఎంతో విలువ ఉంది.. ఇవి పవిత్రమైనవే కాదు, ఔషద గుణాలు కూడా ఎంతో ఉన్నాయి.. సేంద్రీయ వ్యవసాయంలో వీటి పాత్ర ఎంతో ఉంది.. హిందూ సంస్కృతిలో ఆలయాలతో పాటు ఆవులు కూడా భాగమే...
ప్రాచీన కాలం నుండి ఆలయాల నిర్వహణలో గోశాలలు ఉన్నాయి.. ఆలయాలపై నమ్మకంతో భక్తులు ఆవులను భక్తితో సమర్పించుకుంటారు.. కానీ ఆలయాల నిర్వహణలో గో సంరక్షణ లోప భూయిష్టంగా ఉంటే ఏమనాలి?.. గోహత్య మహా పాతకమని పురాణాలు చెబుతున్నాయి.. ఆలయ అధికారుల నిర్లక్ష్యం కారణంగా గోవులు మృత్యువాత పడితే దీన్ని గోహత్య అనలేమా?
సింహాచలం దేవస్థాన గోశాలలో అధికారులు అపరిశుభ్ర వాతావరణంలో సరైన తాగునీరు, ఆహారం ఇవ్వని కారణంగా ఆవులు మరణించడం ఎంతో బాధను కలిగిస్తోంది.. దీనికి బాధ్యులుగా గోశాల నిర్వహకులను సస్పెండ్ చేసినంత మాత్రాన జరిగిన పాపం పోతుందా? ప్రాయశ్చిత్తం అవసరం లేదా? హిందూ ఆలయాల్లోనే హిందువుల మనోభావాలకు విలువ లేకుండా పోయింది.. ఇది ఒక్క సింహాచలం దేవస్థానానికి మాత్రమే పరిమితం కాదు.. రాష్ట్రంలోని అన్ని ఆలయాల గోశాలల పరిస్థితి ఇలాగే ఉంది..
హిందువులు పవిత్రంగా భావించే ఆవుల పోషణ బాధ్యత దేవాదాయ శాఖకు లేదా? ఇది తమ పరిధిలోని అంశం కాదని, పశు సంవర్ధన శాఖ వారిదని దేవాదాయ శాఖ మంత్రి అన్నట్లు మీడియాలో చూడటం ఎంతో బాధనుకలిగిస్తోంది... దేవాదాయ శాఖ ఉన్నది భక్తులు భగవంతునికి చెల్లించుకునే కట్న కానుకలను మింగేయడానికేనా?.. భక్తుల సొమ్ము మంత్రులు, అధికారులు, సిబ్బంది జీత భత్యాలకే ఉపయోగిస్తారా? వారు ఎంతో పవిత్రంగా భావించే గోవుల సంరక్షణ మీకు పట్టదా?
అసలు ఈ దుస్థితి అంతటికీ ధార్మక భావన లేని నాయకులు, అధికారులే కారణం.. గోవధ, కబేళాలను చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్న ప్రభుత్వ పెద్దలు, ఈ పాతకాన్ని అడ్డుకున్న వారిపై ఎదురు కేసులు పెట్టిన ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి.. ఇకనైనా మన నాయకులకు, అధికారులకు సద్భుద్ది, కనువిప్పు కలగాలని, గో సంరక్షణ సక్రమంగా జరగాలని కోరుకుందాం..

No comments:

Post a Comment