Thursday, May 30, 2013

మాయదారి రోగం మర్మమేమిటి?..

తాటి చెట్టు ఎందుకు ఎక్కావురా అంటే, దూడకు గడ్డి కోసం అన్నాడట వెనకటికి ఒకరు.. మన కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే వ్యవహారం కూడా ఇలాగే ఉంది.. ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలో మావోయిస్టులు జరిపిన ఘాతుకంపై స్పందించాల్సిన మంత్రి వర్యులు బాధ్య మరచి అమెరికాలో విహారం చేశారు.. మంత్రి గారి తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి.. చాలా తీరిక చేసుకొని స్వదేశానికి వచ్చారు షిండేజీ.. ఇదేం మహాశయా అని ప్రశ్నిస్తే.. తనకు అనారోగ్యం ఉన్నందున అమెరికాలో పరీక్షలు చేయించుకున్నానని సెలవిచ్చారు.. పైగా అమెరికాలో వరుస సెలవుల కారణంగా ఆలస్యమైందని అడక్కుండానే సంజాయిషీ ఇచ్చుకున్నారు.. భేష్ సుశీల్జీ..
ప్రపంచంలో అతి తక్కువ ఖర్చుతో వైద్య సేవలు అందిస్తున్న దేశంగా భారత్ పేరు తెచ్చుకుంది.. అమెరికా, బ్రిటన్ లాంటి దేశాల్లో సూపర్ స్పెషాలిటీ వైద్యం ఖరీదు కావడంతో విదేశీయులంతా భారత దేశానికి వచ్చి వైద్య చికిత్స చేయించుకుంటున్నారు.. ఇలా మన దేశంలో హెల్త్ టూరిజం వర్ధిల్లుతోంది.. కానీ మన నాయకులకు, ముఖ్యంగా షిండే లాంటి వారికి అమెరికా వైద్యమే నచ్చుతుంది.. ఇదేం మాయ రోగమోమరి.. పొరుగుంటి పుల్లకూర కమ్మన అంటారు ఇందుకేనా?.. లేక తీరగా వచ్చిన ప్రజాధనాన్ని మంచి నీటిలా ఖర్చు చేసేందుకే విదేశాల్లో వైద్యం పేరిట విహార యాత్రలు చేసి వస్తున్నారా?.. సుశీల్ కుమార్ షిండే గారే చెప్పాలి.. అఖరికి ఆయన ఇండియా వచ్చినందుకు సంతోషిద్దాం..

No comments:

Post a Comment