విద్యార్థుల పరీక్షా ఫలితాల సీజన్ ఇది.. పదో తరగతి
పరీక్షా ఫలితాలు వచ్చేశాయి.. ఇక ఇంటర్మీడియట్, ఫలితాలు, ఎంసెట్ ఫలితాలు రావాల్సి
ఉంది.. ఈ పరీక్షా ఫలితాల విషయంలో నాకే కాదు, ఎందరికో అంతు పట్టని సందేహాలున్నాయి అవి..
ప్రతి ఏటా కొన్ని కాలేజీలకు మాత్రమే వరుసగా ఉత్తమ
ఫలితాలు (ర్యాంకులు) ఎలా వస్తున్నాయి?.. ర్యాంకుల విధానం తీసేసినా అంత తక్కువ
సమయంలో ఆయా విద్యా సంస్థలకు తమ విద్యార్థులకే మొదటి ర్యాంకు (లేదా అత్యధిక
మార్కులు) వచ్చిన విషయం ఎలా తెలిసిపోతోంది? ఫలితాలు ప్రకటించక ప్రెస్ మీట్లు ఎలా ఏర్పాటు చేస్తున్నారు?..
ర్యాంకర్లు సరిగ్గా సమయానికి ఎలా అందుబాటులో (వారి బయోడేటా, ఫోటోలు, తల్లి
దండ్రులు సహా) ఉంటున్నారు?.. ర్యాంకులు తమకే వస్తాయని వారికి ఎలా తెలుస్తోంది?.. ఈ
కాలేజీలకు ర్యాంకులు వచ్చినట్లు ఎస్సెస్సీ, ఇంటర్ బోర్టుల నుండే ముందే సమాచారం
ఇస్తున్నారా?.. ఇవ్వక పోతే వారు సందడి, సంబరాలకు ఎలా ఏర్పాట్లు చేసుకోగలుగుతున్నారు?..
వారికి వస్తున్న ర్యాంకుల్లో అసలు ర్యాంకులు ఎన్ని? కొనుకున్నవి ఎన్ని? (ఇతర
సంస్థల్లో చదివిన వారిని తమ విద్యార్థులుగా ప్రకటించుకోవడం)
ఇప్పటి వరకూ మనం ప్రశ్నా పత్రాల లీకేజీ, మాస్
కాపీయింగ్, హైటెక్ కాపీయింగ్ల గురుంచే విన్నాం.. కానీ ఫలితాల లీకేజీపై ఎవరైనా ఎందుకు
దృష్టి సారించడం లేదు? ఈ ప్రశ్నలకు జవాబులు కష్టమేమీ కాదు.. కానీ ఎవరూ నోరు
మెదపరు.. పత్రికలకు, టీవీలకు ఆయా విద్యాసంస్థల నుండి దండిగా ప్రకటనల రూపంలో ఆదాయం
వస్తుంటే ఎందుకు ప్రశ్నిస్తారు? ప్రకటనలు రాని మీడియా సంస్థలు మాత్రం అక్కసుతో
అరచి గోల పెడుతున్నాయి.. అది వేరే విషయం లెండి.. సరే మీడియా సంగతి అలా పెడితే
కార్పోరేట్ విద్యాసంస్థల అక్రమాలపై ప్రభుత్వం, విద్యాశాఖ, పోలీసులు ఎందుకు దృష్టి
పెట్టడం లేదు? ఈ అక్రమాల్లో వారి వాటా ఎంత?
హైదరాబాద్ ఇతర ప్రధాన నగరాలతో పాటు ఒక మోస్తరు
పట్టణంలో ఎక్కడ పడితే అక్కడ కార్పోరేట్ విద్యా సంస్థల బ్రాంచీలు కనిపిస్తాయి..
ఇరుకు గల్లీల్లో, కోళ్ల పారాలను తలపించే భవనాల్లో కాలేజీలు పెట్టి ర్యాంకులు అశ
చూపి వేలాది రూపాయలు(లక్ష కూడా దాటుతోంది) ఫీజల రూపంలో వసూలు చేస్తున్నారు.. ధనికులు,
మధ్య తరగతి వారు తమ పిల్లల భవిష్యత్తు కోసం ఎలాగోలా ఫీజులు కట్టి ఈ కాలేజీల్లో చేరుస్తున్నారు..
కానీ పేదల పరిస్థితి ఏమిటి? వారి పిల్లలు నాసి రకం చదువులకే పరిమితం కావాలా? ఈ
దోపిడీకి అంతులేదా?.. పట్టించుకునే నాధుడు లేడా?.. ప్రభుత్వానికి పట్టదా?..
నాయకులు, అధికారులు తమ తమ వాటాలు చూసుకొని ధృత రాష్ట్ర నిద్ర నటిస్తున్నారా?..
No comments:
Post a Comment