Sunday, May 5, 2013

ఏనుగులు తిరిగిన గడ్డ..

బద్దకంగా రోడ్డు మీద నడచుకుంటూ వెళ్లుతున్న మిమ్మల్ని వెనుక నుండి ఓ ఏనుగు తొండంతో తడితే ఎలా ఉంటుంది?.. ఒక్కసారి ఉలిక్కి పడతారా?.. భయపడకండి ఇప్పుడా పరిస్థితి లేదు.. రాదు కూడా.. నేను ప్రస్థావిస్తున్నది ఒక శతాబ్దం కిందటి హైదరాబాద్ నగర పరిస్థతి.. ఆరో నిజాం మీర్ మహబూబ్ అలీఖాన్ పాలిస్తున్న రోజులు అవి..

హైదరాబాద్ అంటే రద్దీ రోడ్డు, వాహనాల రొద, కాలుష్యం గుర్తు కొస్తాయి.. కానీ ఇది ఒకప్పడు దేశంలోనే అన్ని రకాల సదుపాయాలు గల సుందర నగరం.. బాగ్ నగర్ అంటే తోటల నగరం.. విదేశాలు, ఉత్తర భారత దేశం, సంస్థానంలోని నవాబులు, అమీర్లు, జమీన్ దార్లు, దొరలు, బ్రిటిష్ రెసిడెంట్ ఏజెంట్లు విలాసవంతమైన హైదరాబాద్ నగరంలో నివాసం ఏర్పాటు చేసుకున్నారు.. ఆరోజుల్లో వీరంతా వీధుల్లో ఎంతో ఆడంబరంగా ఎక్కి తిరిగిన వాహనాలు ఏమిటో తెలుసా?.. ఏనుగులు. విశాలమైన రోడ్లు, కొన్ని చోట్ల ఇరుకు గల్లీల్లో కదిలి వెళ్లే గజరాజు కొన్ని సందర్భాల్లో రోడ్లమీద తిరిగే సాధారణ పౌరులను చిరాకుపరిచేవి.. కొన్ని సార్లు ఘీకరిస్తూ అలజడి సృష్టించేవి.. అప్పడు వాటిని నియంత్రించేందుకు పోలీసులు చాలా కష్టపడాల్సి వచ్చేది.. ఫీల్ ఖానా ప్రాంతమంతా ఏనుగుల కొట్టాలతో సందడిగా ఉండేది..
1908లో ఓ చీకటి రాత్రి హైదరాబాద్ పై జల ప్రళయం విరుచుకు పడింది.. భారీ వర్షంతో మూసీనదికి వరద వచ్చి దాదాపు 15 వేల మందిని పొట్టన పెట్టుకుంది.. అంతకు మూడింతల మంది సర్వం కోల్పోయి నిరాశ్రయులయ్యారు.. ప్రజల కష్టాలు చూసి కన్నీరు పెట్టిన నవాబు మహబూబ్ అలీఖాన్ ఏనుగు అంబారీపై తిరుగుతూ సహాయక కార్యక్రమాలను పర్యవేక్షించారు.. 1911 ఆగస్టు 11వ తేదీ మధ్యాహ్నం మహబూబ్ అలీఖాన్ కన్ను మూశారు.. ఏనుగులపై నల్లజండాలు పట్టుకొని, బాకాలు ఊదుతూ నగర వీధుల్లో తిరిగిన సైనికులు నిజాం నవాబు ఇక లేడు అనే శోక వార్తను ప్రకటించడంతో, తమ ప్రియతమ రాజును తలచుకొని ప్రజలు కన్నీరు మున్నీరయ్యారు.. ఆ మరునాడే 37 ఏనుగులు బారులు తీరి వీధుల్లో తిరిగాయి.. ముందు నడిచిన ఏనుగుకు ఇరువైపులా నాణేల సంచులు ఉన్నాయి.. ఏడో నిజాం నవాబు మీర్ ఉస్మాన్ అలీఖాన్ రాజుగా బాధ్యతలు స్వీకరించాడనే వార్తను ప్రకటిస్తూ రోడ్లపై నాణేల వర్షం కురిపించారు.. జనం జయజయ ధ్వానాలు చేస్తే వాటిని స్వీకరించేందుకు ఎగబడ్డారు..
ఆరో నిజాం కాలానికే హైదరాబాద్ వీధుల మీద సైకిళ్ల సందడి ప్రారంభమైంది.. క్రమంగా విదేశాల నుండి కార్లు దిగుమతి అయ్యాయి.. అప్పటి దాకా ఏనుగులపై తిరిగిన వారంతా కొత్త వాహనాల వైపు మొగ్గు చూపారు.. క్రమ క్రమంగా ఏనుగుల యుగం అంతరించింది.. ఒకనాడు ఏనుగుల కొట్టాలు ఉన్న ఫీల్ ఖానా ధాన్యపు వ్యాపార కేంద్రంగా అవతరించింది.. వందేళ్ల క్రితం హైదరాబాద్ రోడ్లపై ఏనుగులు సందడి చేసేవి అనే వార్త నేటి తరానికి ఆశ్చర్యకరమైనదే.. ఇవాళ భాగ్య నగరంలో ఏనుగు కనిపించేది రెండే సందర్భాల్లో ఒకటి బోనాల సంబరాల్లో.. రెండోది మొహర్రం సంతాప ఊరేగింపులో..


No comments:

Post a Comment