Tuesday, May 31, 2016

పొగాకు కాదిది.. పగాకు..

*మీ జీవితాన్ని బూడిద చేసుకోకండి..*   _-క్రాంతి దేవ్ మిత్ర_
మీకెవడైనా పగోడున్నాడా?.. వాన్ని మూడో కంటికి తెలియకుండా లేపేద్దామనుకుంటున్నారా?.. చాలా సులభం..  వాడితో తీయగా, స్నేహంగా మాట్లాడుతూ సిగరెట్ ఆఫర్ చేయండి.. అలవాటుగా మార్చేయండి.. ఇక వాడి చావుకూ, మీకూ ఎలాంటి బాధ్యత లేదు.. ఇది హస్యాస్పదంగా అనిపించవచ్చు.. కానీ నమ్మలేని వాస్తవం..
_సిగరెట్ సైలెంట్ కిల్లర్.. అది కాలుతూ మీ జీవితాన్ని బూడిద చేస్తుంది.. చివరకు పాడె మీదకు చేరుస్తుంది.._
సిగరెట్ తో పాటు ఇతర పొగాకు ఉత్పత్తులైన చుట్ట, బీడీ, జర్దా, గుట్కా, పాన్ మసాలా ఏదైనా ప్రమాదకరమైనవే.. ప్రపంచ వ్యాప్తంగా ఏటా 60 లక్షల మందిని పొగాకు ఉత్పత్తులు పొట్టన పెట్టుకుంటున్నాయి.. భారత దేశంలో ఈ సంఖ్య 10 లక్షలు.. అంటే పొగాకు చంపేస్తున్న వారిలో ఆరో వంతు భారతీయులే.. మన దేశంలో ప్రమాదకరమై క్యాన్సర్ వ్యాధితో మరణిస్తున్న వారిలో నూటికి 66 శాతం పొగాకు ఉత్పత్తులను వాడే వారే.. పరిస్థితి ఇలాగే కొనసాగితే 2020 నాటికి ప్రపంచ వ్యాప్తంగా ఏటా కోటి మంది పొగాకు కారణంగానే మరణిస్తారని అంఛనా..
పొగాకు ఉత్పత్తులు మొదట దెబ్బతీసేది మన నోటినే.. ఆ తర్వాత ఊపిరితిత్తులను, మెదడు, రక్తనాళాలు, జీర్ణకోశం, మూత్ర పిండాలను పనికి రాకుండా చేస్తాయి..
సిగరెట్, బీడీ, చుట్ట ఏదైనా.. అది పీల్చే వారితో పాటు, పక్కనుండే వారికీ ముప్పే.. సో మీరు ఆ అలవాటు ఇతరులకు నేర్పినా, వారి పక్కన ఉండే మీకు కూడా ముప్పే..
సిగరెట్టు పెట్టెపై పొగాకు వాడకం ప్రమాదకరమని ఎంత పెద్దగా రాసినా ఫలితం ఉండదు.. అసలు ప్రభుత్వాలు పొగాకు ఉత్పత్తులను నిషేధిస్తాయని ఆశించడమే అత్యాశ.. పొగాకు ఉత్పత్తుల అమ్మకాల వల్ల ప్రభుత్వానికి భారీ సుంకాలు వసూలవుతున్నాయి.. అలాగే ఎగుమతులు భారీ ఆదాయాన్ని తెచ్చిపెడుతున్నాయి..  ప్రభుత్వానికి బంగారు గుడ్లు పెట్టే కోళ్ల లాంటి పొగాకు ఉత్పత్తులను వదులు కోవడం కత్తిమీద సాములాంటిదే..
బహిరంగ ప్రదేశాల్లో పొగాకు వాడకాన్ని నిషేధించడంతో పాటు, అమ్మకాలను కూడా పూర్తిగా అరికట్టాల్సిందే..  పొగాకు రైతులకు, ఈ వ్యాపారంపై ఆధారపడే వారికి ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించాలి.. ప్రయత్నం చేస్తే సాధ్యం కానిదంటూ ఉండదు.. ఇకప్పుడు ఐటీసీ కంపెనీకి పొగాకు వ్యాపారమే పెద్ద దిక్కు.. ఈ రోజు ఆ కంపెనీ ఇతర ఉత్పత్తులపై కూడా దృష్టి పెట్టి భారీగా విస్తరించింది.. అన్నింటకన్నా ముఖ్యం ప్రజల ఆరోగ్యానికి ముప్పు తెచ్చిపెట్టే పొగాకు ఉత్పత్తులను పూర్తిగా అరికట్టాలంటే ప్రజల్లో చైతన్యం రావాల్సిందే.. పొగాకు వల్ల కలిగే అనర్ధాలను తెలుసుకొని, వాటికి దూరంగా ఉండటంతో పాటు ఇతరులనూ అప్రమత్తం చేయాలి..

No comments:

Post a Comment