Thursday, October 10, 2013

ఏది న్యాయం?.. ఏది సమ న్యాయం?

ఒక సమస్యపై ఆందోళన చేస్తున్న వారికి తమ డిమాండ్ ఏమిటి అనే విషయంలో స్పష్టత ఉండాలి.. తెలంగాణ వాదులు ప్రత్యేక రాష్ట్రం కావాలని కోరుకుంటుంటే, సమైక్య వాదులు ఆంధ్రప్రదేశ్ విభజనను వ్యతిరేకిస్తున్నారు.. ఈ రెండు భిన్న మార్గాలైనా, ఆయా ఉద్యమకారులకు స్పష్టత ఉంది..
కానీ తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు గారు మాత్రం తన దీక్ష విషయంలో స్పష్టత ఇవ్వలేకపోతున్నారు.. తెలంగాణకు వ్యతిరేకం కాదని చెబుతూనే సమ న్యాయం అంటున్నారు.. కానీ సమ న్యాయం ఎలా ఉండాలి అనే విషయంలో ఇప్పటికీ స్పష్టత ఇవ్వలేకపోయారు.. దీన్ని ఎవరికి తోచినట్లు వారు అన్వయించుకుంటున్నారు..
తెలంగాణ టీడీపీ నాయకులు ప్రత్యేక రాష్ట్రానికి తమ నాయకుడు వ్యతిరేకం కాదని, కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చిన లేఖకు ఇప్పటికీ కట్టుబడి ఉన్నామని చెబుతున్నారు.. కానీ సీమాంధ్ర టీడీపీ నాయకులు మాత్రం సమైక్యాంధ్ర ఉద్యమంలో చురుగ్గా పాల్గొంటున్నారు.. మరోవైపు బాబును పరామర్శించిన కాంగ్రెస్ పీ రాయపాటి సాంబశివరావు మాత్రం బాబు సమైక్యాంధ్ర కోసం దీక్ష చేస్తున్నారని ప్రశంసించారు. మరి టీడీపీ తెలంగాణకు మద్దతుగా ఉందనుకోవాలా? సమైక్యాంధ్రవైపు మొగ్గు చూపుతుందనుకోవాలా?
కాంగ్రెస్ పార్టీ తన స్వార్థ ప్రయోజనాల కోసం తెలుగు జాతిని ముక్కలు చేస్తోందని, రెండు ప్రాంతాల ప్రజల అభిప్రాయాలను పరిణనలోకి తీసుకోవాలని చంద్రబాబు నాయుడు చెబుతున్నారు. ఇరు ప్రాంతాలకు సమన్యాయం కోసం తాను దీక్ష చేస్తున్నట్లు చెబుతున్నారు. మరి సమన్యాయం ఎలా ఉండాలి అనే విషయంలో మాత్రం ఒప్పటి వరకూ స్పష్టత ఇవ్వలేదు. కేంద్రమే సమస్యను పరిష్కరించాలని బాబు గారు చెబుతున్నారు. కానీ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని మాత్రం వ్యతిరేకిస్తున్నారు.
ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ భవన్ లో దీక్ష చేస్తున్న చంద్రబాబు గారిని సీఎన్ఎన్ ఐబీఎన్ ఛానెల్ కు చెందిన సుప్రసిద్ధ పాత్రికేయుడు రాజ్ దీప్ సర్దేశాయి పావు గంటపాటు ఫోన్ ద్వారా ఇంటర్వూ చేశారు. ఆయన సూటిగా అడిగిన ప్రశ్నలు వేటికీ బాబుగారు జవాబు ఇవ్వలేకపోయారు. విసిగిపోయిన సర్దేశాయి చంద్రబాబు ఏమి కోరుకుంటున్నారనే విషయం తనకు స్పష్టం కాలేదని వాపోయారు.
చంద్రబాబు నాయుడు గారు రాజకీయాల్లో మూడున్నర దశాబ్దాలకు పైగా కొనసాగుతున్నారు. ఆంధ్రప్రదేశ్ కు 9 ఏళ్లు ముఖ్యమంత్రిగా, గత 9 ఏళ్లుగా ప్రతిపక్ష నేతగా, గతంలో యునైటెడ్ ఫ్రంట్ సారధిగా పని చేసిన ఘనత ఆయనది.. అసలు మలి దశ తెలంగాణ ఉద్యమం ఆరంభమైందే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో.. ఆంధ్ర ప్రదేశ్ వ్యవహారాలపై బాబు గారికి ఉన్నంత అవగాహన మరే నాయకునికి లేదని చెప్పక తప్పదు. కానీ అనుభవాన్ని ప్రస్తుత సంక్షోభ సమయంలో ఎందుకు ఉపయోగించడం లేదు?

చంద్రబాబు గారు తన డిమాండ్లు ఏమిటో నేరుగా కేంద్రం ముందు పెట్టి, వాటిని పరిష్కరించాలి అని అడగాలి.. కానీ ఏమీ చెప్పకుండా సమన్యాయం పేరుతో దీక్ష చేస్తే నీరసం తప్ప ఎలాంటి ప్రయోజనం ఉండదు.. 

No comments:

Post a Comment