Thursday, April 26, 2012

పిచ్చుకలు ఇంకా ఉన్నాయి..

ఒక పుస్తకంలో బొమ్మను చూసి, నాన్నా ఇదేమిటని అడిగాడు మా చిన్నోడు..
అది పిచ్చుక కన్నా అని చెప్పాను..
అదెక్కడుంటుందని అడిగాడు..
అంతటా ఉంటుంది.. మన ఇంటి వెంటిలెటర్లో, చెట్లపైనా, వీధి దీపాలపైనా.. ఎక్కడంటే అక్కడే అని చెప్పా..
మరి నాకు ఎప్పడూ కనిపించలేదేంటి నాన్నా? అని ఆశ్చర్యంగా అడిగాడు మా చిన్నోడు..
అవాక్కయ్యాను నేను.. కాంక్రీట్ జంగల్ నగరంలో నేను పిచ్చుకలను చూసి చాలా కాలమే అయ్యింది.. అదే సమయంలో ఒక్క పత్రికలో చదివాను.. సెల్ టవర్ల రేడియేషన్, కాలుష్య ప్రభావానికి పిచ్చుకలు అంతరించిపోతున్నాయని.. నగరంలో అస్సలు కనిపించడం లేదని..

పిచ్చుకలను ఇక చూడలేనేమో అనుకున్న దశలో చాలా రోజుల తర్వాత మా ఇంటి వెంటిలేటర్లో ఓ పిచ్చుక కనిపించింది (మీరు చూస్తున్నది ఈ పిచ్చుకనే)..
పిచ్చుకలు అంతరించలేదు, ఇంకా ఉన్నాయని సంతోషించా.. కానీ మా చిన్నోడికి ఆ పిచ్చుకను చూపించలేకపోయా.. ఆ సమయంలో వాడు స్కూలులో ఉన్నాడు మరి. అయితే ఏంటి? నా మొబైల్లో దాన్ని బందించేశా..
మరో విషయం.. ఓ రోజు కోపంతో మా పెద్దోడిని గాడిదా అని తిట్టా..
నాన్నా గాడిదంటే ఏమిటని వాడు నన్నడిగాడు..
అవును హైదరాబాద్ నగరంలో గాడిదను చూసి ఎన్నాలైంది.. నా చిన్నప్పుడు రోడ్డపై ఎక్కడంటే అక్కడ గాడిదలు కనిపించేవి.. ఇప్పడు ఆధునికత గాడిదల్ని మింగేసింది..

No comments:

Post a Comment