Tuesday, December 10, 2013

కేజ్రీ.. సో క్రేజీ..

కాంగ్రెస్ కే హాత్ ఆమ్ ఆద్మీకే సాత్.. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఉపయోగించిన నినాదం ఇది.. విచిత్రంగా ఇదే నినాదం అరవింద్ కేజ్రీవాల్ తన పార్టీకి పేరుగా పెట్టుకున్నారు.. అంతే కాదు ఢిల్లీలో కాంగ్రెస్ ఓటు బ్యాంకునూ తన వైపు మలుపుకున్నాడు.. కొత్తొక వింత పాతొక రోత అంటారు.. కేజ్రీవాల్ విషయంలోనూ అదే జరిగింది..
ఢిల్లీ ప్రజలు కాంగ్రెస్ పార్టీని పూర్తిగా తిరస్కరించారు.. ఈ క్రమంలో వారు రంగంలో ఉన్న బీజేపీ, ఆప్ లకు ఓటు వేశారు.. బీజేపీకి 31 సీట్లు వస్తే, ఆప్ కు 28 వచ్చాయి.. కాంగ్రెస్ పార్టీకి 8 మాత్రమే దక్కాయి.. కనీస మెజారిటీ అయిన 36 సీట్లు రానందున బేరసారాలు సాగించడం ఇష్టం లేక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు బీజేపీ ఆసక్తి చూపించడం లేదు.. ఇలాంటి సందర్భంలో కేజ్రీవాల్ విజ్ఞత ప్రదర్శించాలి.. ప్రజలు కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఓటేసినందువల్ల బీజేపీ, ఆప్ కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తే ఎవరికీ అభ్యంతరం ఉండదు..
అయితే ఇక్కడ కేజ్రీవాల్ అతి తెలివి ప్రదర్శిస్తున్నాడు.. తాను ప్రతిపక్షంలో కూర్చుంటాడట.. కాంగ్రెస్ మద్దతు తీసుకొని బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలట.. తాను మాత్రం ఆ పని చేయడట.. అంటే ప్రజలు తిరస్కరించిన పార్టీ మద్దతు బీజేపీ ఎలా తీసుకుంటుంది? పైగా రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఆ పార్టీ ప్రధాన ప్రత్యర్ధి కాంగ్రెస్ పార్టీయే కదా?
ఇంతకీ కేజ్రీవాల్ ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ మద్దతు ఇవ్వడానికి, లేదా తానే ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ఎందుకు జంకుతున్నాడో తెలుసా? అధికారం చేపడితే ఎదురయ్యే సమస్యలను ఎదుర్కొనే సత్తా లేనందు వల్లే.. ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు అలా ఉన్నాయి మరి..
తాము అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలను 50 శాతం తగ్గిస్తారట.. 700 వందల లీటర్ల తాగునీరు ఉచితంగా ఇస్తారట.. ఈ డిసెంబర్ 29 లోపు జన్ లోక్ పాల్ అమలు చేస్తారట.. మహిళల రక్షణ కోసం ప్రత్యేక కమెండో  ఫోర్స్ ఏర్పాటు చేస్తారట.. మంచిదే ఈ వాగ్దానాలు అమలు చేస్తే సంతోషమే.. కానీ వీటిని అమలు చేసేందుకు ప్రభుత్వంలో భాగస్వాములు కావడమో లేదా తామే ప్రభుత్వానికి సారధ్యం వహించే ప్రయత్నం చేయడమో ఎందుకు చేయడం లేదు.. అక్కడే ఉంది అసలు లోగుట్టు
కొత్త పార్టీ పెట్టిన తొందరలో కేజ్రీవాల్ అడ్డగోలు వాగ్దానాలు చేయడంలో ప్రధాన రాజకీయ పార్టీల నేతలను మించిపోయాడు.. తీరా ప్రజలు నమ్మేసి గెలిపించే సరికి ఎక్కడ అమలు చేయాల్సి వస్తుందో అని భయపడుతున్నాడట.. అసలు అమలుకు సాధ్యమయ్యే వాగ్దానాలేనా ఇవి?

అరవింద్ కేజ్రీవాల్ విషయంలో అన్నా హజారేకు ఉన్న అభిప్రాయం ఏమిటో కొద్ది వారాల క్రితమే మీడియాలో చూశాం..

No comments:

Post a Comment