Wednesday, December 18, 2013

అమెరికా పట్ల మన దౌత్య విధానం మారాలి..

కొన్నేళ్ల క్రితం అమెరికా వెళ్లిన మన మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాంను అక్కడి విమానాశ్రయంలోని ఇమిగ్రేషన్ సిబ్బంది షూ విప్పించి తనఖీలు చేశారు.. అలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ సంఘటన పట్ల భారత్లో నిరసనలు వ్యక్తమయ్యాయి.. ఇంకా నయం నన్నయితే బట్టలు విప్పించి మరీ తనిఖీ చేశారని బయట పెట్టుకున్నారు మాజీ రక్షణ మంత్రి జార్జ్ ఫెర్నాండెజ్.. జరిగిన సంఘటనలకు అమెరికా ప్రభుత్వం చింతిస్తున్నట్లు ప్రకటించి చేతులు దులుపుకుంది.. ఆనాడే మన కఠినంగా వ్యవహరిస్తే దేవయానీ రూపంలో తాజా అవమానం జరిగేదా?
అమెరికాలోని భారత దౌత్య కార్యాలయంలో డిప్యూటీ కాన్సుల్ జనరల్ హోదాలో పని చేస్తున్న దేవయానీ ఖోబ్రాగాడేను అక్కడి పోలీసులు అరెస్టు చేసిన తీరు ఆశ్చరాన్ని కలిగిస్తోంది.. ఆమె తన ఇంట్లొ పని చేసేందుకు భారత్ నుండి తీసుకొచ్చిన ఆయాకు కనీస వేతనం ఇవ్వడం లేదనే కారణంగా అరెస్టు చేశారట.. అమెరికా కార్మిక చట్టాల ప్రకారం ఆమెకు నెలకు 4500 డాలర్లు (రూ.2.85 లక్షలు) వేతనంగా చెల్లించాలి.. కానీ దేవయాని కేవలం 573 డాలర్లు (రూ.35 వేలు) మాత్రమే ఇస్తోందట.. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంలే దేవయానికి భారత ప్రభుత్వం చెల్లిస్తున్న వేతనం రూ.4 లక్షలకు మించదు. అందులో పని మనిషికి రూ.2.85 లక్షలు చెల్లించాలట..
ఇంత పెద్ద నేరం చేసిందని దేవయానిని ఎంత అమానుషంగా హింసించారో తెలుసా?.. విచారణలో భాగంగా ఆమె దుస్తులు విప్పించి స్మగ్లర్లు, సెక్స్ వర్కర్ తో సమానంగా ట్రీట్ చేశారట. భారత్ తన సన్నిహిత దేశంగా చిలుక పలుకులు పలికే అమెరికా, అందుకు భిన్నంగా మన దౌత్య సిబ్బంది పట్ట ఎలా వ్యవహరించిదో చూశారు కదా.. చట్టం ముందు అందరూ సమానులంటారు నిజమే.. కానీ అది ఎవరి చట్టం అనేది కూడా పరిగణనలోకి తీసుకోవాలి.. అన్ని దేశాలపై తమ దేశ చట్టాలే రుద్దుతామనడం ఎంత వరకు సబబు.. ఏ దేశంలో అయినా దౌత్య సిబ్బందికి కొన్ని రక్షణలు ఉంటాయి.. ఈ మాత్రం విచక్షణ కూడా చూపకపోవడం దురహంకారమే అవుతుంది..
మీ ఇంటికి మేం వస్తే ఏమిస్తారు?.. మా ఇంటికి మీరు వస్తే ఏం తెస్తారు? అన్నట్లుగా ఉంటుంది అమెరికా నీతి.. తన దేశ ప్రయోజనాల ముందు ఇతర దేశాలు ఎంతటివైనా తలొగ్గాల్సిందే అన్నంత దురహంకారం వారిది.. భారత్ లో అమెరికా దౌత్య సిబ్బందికి మన దేశం ఎన్నో రాయితీలు, రక్షణలు కల్పిస్తోంది. ఆలస్యంగానైనా కళ్లు తెరచిన మన దేశం ఇక్కడి దౌత్యవేత్తల విషయంలో అదే స్థాయిలో కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించింది.. కానీ ఈ పని ఎప్పుడో చేయాల్సింది.. అమెరికా నుండి వచ్చే ప్రతి కుర్రనా అధికారులకు అధికార లాంఛనాలతో స్వాగతం పలికి, మర్యాదలు చేసే పద్దతి మానాలి..
మిత్రుత్వమైనా, శత్రుత్వమైనా సమ ఉజ్జీని ఎంచుకోవాలని మన పెద్దలు ఏనాడో చెప్పారు.. అమెరికా ఒకవైపు మన దేశంలో సన్నిహితంగా ఉన్నట్లు నటిస్తూ, ఉగ్రవాదంపై ఉమ్మడి పోరు అనే కబుర్లు చెబుతూ ఉంటుంది.. మరోవైపు ప్రపంచ ఉగ్రవాదులు తండాగా మారిన పాకిస్తాన్ కు అన్ని విధాల ధన, ఆయుధ సాయం చేస్తుంటుంది.. ఇదేం నీతి అని మన దేశం ఏనాడూ గట్టిగా ప్రశ్నించిన పాపాన పోలేదు.. అమెరికా మనతో ఎలా వ్యవహరిస్తోంది.. మనం వారితో ఎలా వ్యవహరిస్తున్నోమో గమనించారు కదా?  ఇకనైనా మన విదేశాంగ నీతిని సమీక్షించుకోవాలి..

No comments:

Post a Comment