Tuesday, December 3, 2013

సీమ భవిత్వం ఏమిటి?

రాయలసీమ.. ఇక ఈ పదం మనం చరిత్ర పుటల్లోనే చూడాలేమో? ఘనత వహించిన కేంద్ర ప్రభుత్వం రాయలసీమను రెండుగా చీల్చేసి అటు తెలంగాణలో.. ఇటు సీమాంధ్రలో కలిపేయాలని నిర్ణయించింది.. నాడు బళ్లారి పోయింది.. ఇప్పడు రాయలసీమే లేకుండా పోయే పరిస్థితి ఏర్పడింది..
రాష్ట్రంలో తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో ప్రధానంగా తెలుగే మాట్లాడుతున్నా యాస, సంస్కృతి, సాంప్రదాయాలు, ఆచార వ్యవహారాల్లో తమదైన అస్థిత్వాన్ని కలిగి ఉన్నాయి.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతున్న క్రమంలో 1956 నాటి స్థితి ప్రకారం రాయలసీమ ప్రాంతం సీమాంధ్ర (నాడు ఆంధ్ర రాష్ట్రం)లో కొనసాగుతుందని భావించారు.. కానీ స్వార్థ రాజకీయుల కారణంగా రాయలసీమ రెండుగా చీలిపోయే ప్రమాదం ఏర్పడింది.. కర్నూలు, అనంతపురం జిల్లాలను తెలంగాణ(రాయల తెలంగాణ అట)లో కలిపేస్తారట.. కడప, చిత్తూరు జిల్లాలను మాత్రం సీమాంధ్ర(ఆంధ్రప్రదేశ్)లోనే కొనసాగిస్తారట.. ఏమిటి ఈ దుర్మార్గం.. అసలు రాయలసీమ ప్రత్యేకత తెలుసా ఈ ఆలోచన చేసిన వారికి?.. అసలు ఏమిటి ఈ సీమ కథ.. క్లుప్తంగా పరిశీలిద్దాం..
చరిత్రను చూస్తే ఈ ప్రాంతం తూర్పు చాళుక్యుల కాలంలో హిరణ్యక రాష్ట్రంగా పిలిచేవారు.. చోళుల కాలంలో సీమకు ప్రత్యేక అస్థిత్వం ప్రారంభమైంది.. విజయనగర చక్రవర్తుల కాలంలో ఒక వెలుగు వెలిగింది ఈ ప్రాంతం.. శ్రీకృష్ణ దేవరాయల ముద్ర బలంగా పడింది. విజయనగర సామ్రాజ్య పతనం తర్వాత కుతుబ్ షాహీ, అసఫ్ జాహీల పాలనలోకి వచ్చేసింది.. నిజాం నవాబులు బ్రిటిష్ వారితో సైన్య సహకార పద్దతిలో పన్నులు కట్టలేక ఈ ప్రాంతానికి ధారాదత్తం చేసేశారు.. అలా మద్రాసు ప్రావిన్స్(స్టేట్)లో భాగమైన సీమ జిల్లాలను సీడెడ్ అని పిలిచేవారు..
శ్రీకృష్ణ దేవరాయల పాలన ప్రభావం అధికంగా ఉన్న ఈ ప్రాంతానికి 1928లో చిలుకూరి నారాయణ రావు గారు రాయలసీమ అనే పేరును పెట్టారు.. మద్రాసు నుండి విడిపోయి తెలుగు మాట్లాడే ప్రాంతాలన్నీ ఆంధ్ర రాష్ట్రంగా ఏర్పడాలనే ఉద్యమం సాగుతున్న కాలంలో రాయలసీమ నాయకులు తాము మద్రాసుతోనే ఉంటామన్నారు.. ఆంధ్రా కాంగ్రెస్ నాయకులు వారిని నచ్చజెప్పి కొన్ని ప్యాకేజీల ద్వారా కొత్త రాష్ట్రంలో చేరేలా ఒప్పించారు.. అదే శ్రీభాగ్ ఒప్పందం.. ఫలితంగా 1953లో సీమలోని కర్నూలు రాజధానిగా ఆంధ్ర రాష్ట్రం ర్పడింది..
ఆంధ్ర రాష్ట్ర ఏర్పడినప్పుడే పెద్ద ఘోరం జరిగిపోయింది.. రాయలసీమ అంటే అప్పట్లో బళ్లారి, అనంతపురం, చిత్తూరు, కడప, కర్నూలు.. ఆనాటి నాయకులు అసమర్థ విధానాల కారణంగా తెలుగువారు అధికంగా ఉన్నప్పటికీ బళ్లారిని మైసూర్(ఇప్పడు కర్ణాటక) స్టేట్లో కలిసిపోయింది.. ఇది కోలుకోని దెబ్బగా మారింది.. 1956లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది.. నీలం సంజీవరెడ్డి ప్రధమ ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది మొదలు ఈ రాష్ట్రాన్ని అత్యధిక కాలం పాలించింది రాయలసీమ నేతలే..
రాయలసీమలో తిరుపతి, కాలహస్తి, శ్రీశైలం, మంత్రాలయం, అహోబిలం, లేపాక్షి తదితర లెక్కలేనన్ని పుణ్య క్షేత్రాలు, పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి.. అపారమైన ఖనిజ సంపద ఉంది.. అయితే సాగునీటి సమస్య ఈ ప్రాంతానికి ప్రధాన సమస్యగా మారిపోయింది.. ఈ కారణం వల్లే అనంతపురం క్రమంగా మరో థార్ ఎడారిగా మారిపోతోంది.. వ్యవసాయ ఆధారిత రాయలసీమలో వర్షపాతం అతి తక్కువ.. సీమకు సాగునీరు అందించేందుకు ప్రభుత్వాలు ఎన్నో పథకాలు తయారు చేశారు. బ్రిటిషు వారు నిర్మించిన కర్నూలు కడప కాలువ తోపాటు, శ్రీశైలం కుడి బ్రాంచి కాలువ, తెలుగుగంగ, హంద్రీ-నీవా సుజల స్రవంతి, గాలేరు-నగరి.. ఇలా చెప్పుకోడానికి ఎన్ని ఉన్నా నీటి లభ్యత సక్రమంగా లేక అరకొరగా సాగుతున్నాయి..
తెలంగాణ ఉద్యమం నేపధ్యంలో రాష్ట్ర విభజన అనివార్యమైపోయింది.. ఈ సమయంలో రాయలసీమ అంశం మళ్లీ తెర మీదకు వచ్చింది.. కోస్తాంధ్ర జిల్లాలతో పాటు సీమలోనూ సమైక్యాంధ్ర ఉద్యమం బలంగా నడిచింది.. ఇదే క్రమంలో కొందరు సీమ నాయకులే కుట్రలకు తెర తీశారు.. రాయల తెలంగాణ అంటూ విచిత్రమైన వాదన మొదలు పెట్టారు.. వాస్తవానికి నలుగురైదుగురు నాయకులు తప్ప ఎవరికీ ఈ ఆలోచనే లేదు.. హైదరాబాద్, బెంగళూరులో ఆస్తులు  కూడబెట్టి వ్యాపారాలు చేసుకుంటున్న కొందరు సీమ నాయకులను కలిగిన దురాలోచన ఇది.. ఉన్న నాలుగు రాయలసీమ జిల్లాల్లో రెండు (అనంత, కర్నూలు) తెలంగాణలో కలిపితే మిగతా రెండు (కడప, చిత్తూరు) సీమాంధ్రలో ఉండాలట.. తమ వ్యక్తిగత ఎజెండా కోసం రాయలసీమ భవితవ్యాన్ని బలి పీటంపై పెట్టేశారు.. సీమ అస్థిత్వానికి మరణ శాసనం రాసేశారు..
రాయల తెలంగాణ కుట్రను ఎదుర్కొని, తమ నాయకులకు బుద్ది చెప్పాల్సిన బాధ్యత ఈ ప్రాంత ప్రజలపైనే ఉంది..

No comments:

Post a Comment