Friday, June 19, 2015

అడ్వానీ వ్యాఖ్యలకు వక్రభాష్యం..

గుడ్డు మీద వెంట్రుకలు పీకడం చాలా ఈజీ.. అదెలాగో ఇందులో నిపుణులైన కాంగ్రెస్ నాయకులను అడిగితే చెబుతారు. ఎమర్జెన్సీ మళ్లీ రాదని చెప్పలేం.. ప్రజాస్వామ్యాన్ని నలిపేసే శక్తులు చాలా ఉన్నాయిఅని మాజీ ఉప ప్రధాని, బీజేపీ అగ్రనేత లాల్ కృష్ణ అడ్వానీ చేసిన వ్యాఖ్యలను వారు అన్వయించిన తీరే ఇందుకు నిదర్శనం.. అడ్వానీ ఈ వ్యాఖ్యలు ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి చేశారని వారంటున్నారు. గురవింద తన కింది నలుపును చూసుకోకుండా ఎదుటి వారిని గేలి చేస్తుందట..
ఎల్.కె.అడ్వానీ చెప్పింది మన ప్రజాస్వామ్య వ్యవస్థ గురుంచి. వ్యవస్థలో లోపాలు ఎప్పటికైనా ప్రజాస్వామ్యాన్ని ప్రమాదంలో పడేస్తాయని మళ్లీ ఎమర్జెన్సీకి దారి తీస్తాయని విశ్లేషించారాయన. ఇక్కడ మోదీని విమర్శించినట్లు వారికి ఎలా అనిపించిందో.. ఈ వ్యవస్థను తయారు చేసింది ఎవరు? దేశాన్ని అత్యధిక కాలం పాలించించి ఎవరు? కాంగ్రెస్ పార్టీ కాదా?.. ఒక రకంగా కాంగ్రెస్ వక్ర వ్యాఖ్యానం ఆ పార్టీనే ఇబ్బంది పెడుతుంది. ఎమర్జెన్సీ తాలూకు క్రూర గాయాలను దేశ ప్రజలకు మళ్లీ తడుతోంది..

40 ఏళ్ల క్రితం ఇందిరా గాంధీ విధించిన ఎమర్జెన్సీ గురుంచి నేటి తరానికి పెద్దగా తెలియకున్నా, ఆ దారుణ పాలన తాలూకు కష్టాలు అనుభవించిన వారిని అడగండి.. కళ్ల ముందు ఆవిష్కరిస్తారు.. వారిలో అడ్వానీ కూడా ఒకరు.. ఇందిర తాను చేసిన తప్పుకు న్యాయస్థానం విధించిన శిక్ష నుండి తప్పించుకోవడానికి నియంతగా మారారు. యావత్ ప్రతిపక్షాన్ని జైలుపాలు చేసి ఎమర్జెన్సీ విధించారు. పత్రికల నోరు నొక్కి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు.. ఇలాంటి వారసత్వ చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ, ఎమర్జెన్సీ గురుంచి మాట్లాడటం, వక్ర వాక్యాలు చెప్పడం దెయ్యాలు వేదాలు వల్లించడమే అవుతుంది. 

No comments:

Post a Comment