Wednesday, June 3, 2015

ఇద్దరు చంద్రులు.. ఏడాది పాలన..

తెలుగునాట ఎల్ నినో ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది.. ప్రకృతి అంతా గందరగోళం.. వానాకాలంలో సకాలంలో వర్షాలు పడలేదు.. చలికాలం కూడా అంతంతే ప్రభావాన్ని చూపింది.. ఈలోపు వేసవి వచ్చేసింది.. ఎండాకాలం మొదటి భాగమంతా అండపాదడపా చిరు జల్లులు పడ్డాయి.. రెండో భాగం మాత్రం ఉష్ణోగ్రతలు సాధారణాన్ని మించిపోయే సరికి ప్రజలు కళ్లుతేలేశారు.. మళ్లీ వానాకాలం వచ్చేస్తోంది.. ఈసారీ సాధారణంకన్నా తక్కువ వర్షపాతమే అంటూ వాతావరణ శాఖ అధికారులు చల్లగా తమ అంఛనాలు చెప్పేశారు..
ఇద్దరు చంద్రుల ఫోటో వ్యాఖ్య పెట్టి ఈ సోదంతా ఎందుకు రాశాడనుకుంటున్నారా?.. ఏం చేస్తాం మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల పరిస్థితి కూడా ఈ ఎన్ నినోకు భిన్నంగా లేదు మరి.. పోయిన కాలం, వయస్సు తిరిగి రాదని మన పెద్దలు చెబుతుంతారు.. ఏం చేయాలన్నా మన జీవిత కాలంలోనే చేయాలి.. ఐదేళ్లు అంటే ఇంకా చాలా సమయమే ఉందిలే అనుకుంటారు నేతాజీలు.. కానీ కాలచక్రం గిర్రున తిరుగుతున్న కొద్దీ తత్వం బోధపడుతుంది వారికి.. ఇటు చంద్రశేఖర రావు, అటు చంద్రబాబు నాయుడు తన పీఠాలపై బేషుగ్గా, తీరిగ్గా ఏడాది కొలువు పూర్తి చేస్తుకున్నారు.. ఏం చేశారయ్యా అని అడిగితే.. చాలానే చేశాం, ఇంకా అవీ ఇవీ చేస్తాం అంటుంటే వింటున్న జనం ఇంతేనా అని నిట్టూరుస్తున్నారు..
స్వరాష్ట్ర స్వప్నం సిద్ధించి ఏడాది పూర్తయిన సందర్భంగా తెలంగాణలో సంబరాలు జరిగాయి.. రాజధాని లేని గందరగోళ పరిస్థితుల్లో చీలిపోయిన ఆంధ్రప్రదేశ్లో నవ నిర్మాణ దీక్ష జరిగింది.. ఈ రెండింటిలో అధికారంలో ఉన్నవారి హడావుడి తప్ప సాధారణ ప్రజల పాత్ర ఏమాత్రం లేదనేది నిష్టూరమైన నిజం.. ఇద్దరు చంద్రులు ఇరు రాష్ట్రాల్లో అత్తెసరు రుణమాఫీ, ఫించన్లులాంటివి లేపనాలు తప్ప పెద్దగా చేసిందేమీ లేదు.. ప్రభుత్వోద్యోగులను మాత్రం పోటీలు పడి చల్లగా చూసుకుంటున్నారు.. ముఖ్యమైన సమస్యలపై ఇంకా దయ చూపడంలేదు..  రైతులు, మహిళలు, విద్యార్థులు, నిరుద్యోగ యువత, ఇతర సాధారణ వర్గాల ప్రజలు గుర్రుగా చూస్తున్నారు.. ఎన్నికల వాగ్దానాలను పక్కన పెట్టేసి తమ స్వప్నాలను జనాలకు త్రీడీ ఎఫెక్టుతో చూపిస్తున్నారు.. హైదరాబాద్ నగరాన్ని ఎక్కడికో తీసుకుపోతానని కేసీఆర్ చెబుతుంటే.. సింగపూర్ రేంజిలో హైదరాబాదును మించిన రాజధాని కడతానంటున్నాడు బాబు.. ప్రతిపక్ష సభ్యులకు వల వేయడం.. గిల్లి కజ్జాల్లో మాత్రం ఎవరికి వారే..
ఇప్పటికే ఏడాది గడచిపోయింది.. ఎల్ నినో ప్రభావం నుండి బయటనకు వచ్చి వాస్తవ పరిస్థితులను అర్థం చేసుకొని జనాలను అంతో ఇంతో మేళ్లు చేసి చూపిస్తే చాలు.. మీ స్వప్నాలను మాటల్లో కాకుండా ఆచరణలో చూపిస్తే 2019లో వద్దు మొర్రో అన్నా జనం మళ్లీ మిమ్మల్నే కోరుకుంటారు.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అంతా శుభం కలగాలని కోరుకుందాం..

( *ఈ పోస్టుతో ఉన్న ఫోటో వ్యాఖ్య సరదాకి మాత్రమే.. )

No comments:

Post a Comment