Thursday, June 4, 2015

పిల్లల ఆరోగ్యాన్ని ప్రమాదంలో పడేయకండి..

ఇంటికొచ్చిన తనయుడు అమ్మా ఆకలి అంటాడు.. టూ మినట్స్ అంటూ తల్లి వంటింట్లోకి వెళుతుంది.. పొయ్యిమీద ఏదో మరుగుతుంటుంది..పిల్లోడు ఆసక్తిగా ఎదురు చూస్తుంటాడు.. క్షణాల్లో తల్లి వచ్చి సర్వ్ చేస్తుంది.. ఆసక్తిగా లొట్టలేస్తూ తినేస్తాడు.. టీవీలో వచ్చిన ఈ యాడ్ ఎంతో మంది భారతీయుల్ని కట్టి పడేసింది.. ఫలితంగా ఆ ప్రొడక్ట్ అమ్మకాలు విపరీతంగా పెరిగిపోయాయి.. ఇంటింటా డైనింగ్ టేబుల్ పై ఓ భాగమైపోయింది..
మీరు ఎప్పుడైన మ్యాగి ప్రకటనలో సత్యం ఎంతో గ్రహించారా?.. మీ ఇంట్లో రెండు నిమిషాల్లో మ్యాగి ఎప్పుడైనా ఉడికిందా?,, లేదు కదూ?.. అబద్దంతోనే ప్రారంభమైన మ్యాగి పిల్లల ఆరోగ్యాన్ని బుగ్గి చేస్తుంటే ఇంత కాలం మనం ఎలా కళ్లు మూసుకున్నామో.. తలచుకుంటేనే ఆశ్చర్యంగా ఉంది..
ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆహార నాణ్యతా ప్రమాణాల ప్రకారం సీసం 0.01 పీపీఎం మాత్రమే ఉండాలి.. కానీ లక్నోలో స్వాధీనం చేసుకున్న మ్యాగి శాంపిళ్లలో ఏకంగా 17 పీపీఎం సీసం ఉంది.. దీంతో దేశ వ్యాప్తంగా దుమారం లేచింది. కేంద్రంతో సహా రాష్ట్రాలన్నీ అప్రమత్తమయ్యాయి.. ఢిల్లీలో వెంటనే కొద్ది రోజులు నిషేధించి దర్యాప్తు ప్రారంభించింది. మిగతా రాష్ట్రాలు అదే బాటలో ఉన్నాయి. సైన్యంలో మ్యాగిపై పూర్తి నిషేధం విధించారు.
సీసం ఒక విషపూరితమైన లోహం.. ఇది మన శరీరంలోకి చేరితే తలనొప్పి, కడుపునొప్పి, గందరగోళం, చికాకు కలుగుతాయి. రక్తహీనత ఏర్పడుతుంది. మోతాదు మించితే మూర్చ, కోమా, మరణమూ సంభవించవచ్చు..ఆహార పదార్థాల రుచి పెంచడానికి మోనోసోడియం గ్లుటామేట్ కలుపుతారు. దీని కారణంగా కారణంగా తలనొప్పి, వెన్నునొప్పి, చికాకు, అయోమయం, మగత కలుగుతాయి. ఛాతిలో మంట, దవడలు బిగుసుకుపోవడం, అలర్జీలు వస్తాయి.. మ్యాగీని తయారు చేస్తున్న నెస్లే ఇండియా అనే బహుళజాతి సంస్థ తన వ్యవహారాన్ని సమర్ధించుకుంటోంది. అయితే ఈ సంస్థ తయారు చేసే పాలపొడిలో పురుగులు కనిపించం కూడా వివాదాస్పదమైంది.
ఎవరి వాదనలు ఎలా ఉన్నా మన పిల్లల ఆరోగ్యం మనకు ముఖ్యం.. ఎందుకొచ్చిన మ్యాగీలు, గీగీలు.. చూస్తూ చూస్తు ఆరోగ్యాలు బుగ్గి చేసుకుంటామా? ఒక మ్యాగినే కాదు, అన్ని ప్యాకింగ్ ఫాస్ట్ -జంక్ ఫుడ్లు, శీతల పానీయాలు కూడా ఆరోగ్యానికి హాని చేసేవే.. పిల్లలకు మన ఇంట్లో తయారు చేసే చిరుతిండ్లు, పళ్ల రసాలు ఇవ్వడమే మంచిది.. ఇంతకు మించిన ఆరోగ్యకర, పౌష్టికాహారం ఇంకేముంటుంది.. ఆలోచించండి..

No comments:

Post a Comment