Sunday, June 28, 2015

లోపలి మనిషి... మహా వ్యక్తి

అపర చాణక్యుడు, రాజనీతి చతురుడు, సంస్కరణల సారధి, బహు భాషా కోవిధుడు, సాహితీ వేత్త.. పాములపర్తి వెంకట నరసింహారావు గురుంచి ఎంత చెప్పినా తక్కువే.. రాజకీయ జీవితాన్ని ముగించుకొని ఆధ్యాత్మిక, సాహితీ, సేవా కార్యక్రమాలతో శేష జీవితాన్ని ప్రశాంతంగా గడపాలని మూలా ముల్లె సర్దుకొని ఢిల్లీ నుండి హైదరాబాద్ బయలు దేరేందుకు సిద్దమైన వేళ ప్రధానమంత్రి పదవి తలుపు తట్టింది..
దేశం ఆర్ధికంగా వివాళా తీసిన దశలో, రాజీవ్ గాంధీ మరణంతో ప్రధాని పదవి చేపట్టేందుకు పీవీ నరసింహారావును మించిన అర్హులు కాంగ్రెస్ పార్టీలో కనిపించలేదు. క్లిష్ట పరిస్థితుల్లో ఆర్థిక సంస్కరణలకు బాటలు వేసి దేశాన్ని ప్రగతి పథంలో నడిపించారు.. మైనారిటీ ప్రభుత్వాన్ని చాకచక్యంగా ఐదేళ్లు నెట్టుకొచ్చారు.. రాజకీయంగా ఎన్నో ఆరోపణలు, కుంభకోణాలు ఆయన్ని వేధించాయి.. ఎవరికీ కొరుకుడు పడని మౌనం మితభాషణం ఆయన ఆభరణాలు.. దురదృష్టవశాత్తు ఈ కారణంగానే రాజకీయంగా, వ్యక్తిగతంగా ఎన్నో ఇక్కట్ల పాలయ్యారు పీవీ..
కాంగ్రెస్ కోటరీ రాజకీయాలు, సోనియాగాంధీ కంటగింపులకు గురైన పీవీ జీవిత చరమాకం ప్రశాంతంగా సాగలేదు.. మరణించిన తర్వాత మాజీ ప్రధానులకు లభించాల్సిన గౌరవం ప్రకారం ఢిల్లీలో సమాధికి నోచుకోలేదు.. పార్థివ దేహాన్ని పార్టీ కార్యాలయంలోకి కూడా తీసుకురాని కుసంస్కారంతో, రోడ్డు మీద నుండే హైదరాబాద్ పంపేశారు కాంగీయులు.. చివరకు అంతిమ సంస్కారాలు కూడా సక్రమంగా నిర్వహించలేకపోయారు ఈ సోకాల్డ్ గాంధీ కుటుంబ భజనపరులు..
1921 జూన్ 28న తెలంగాణలోని వరంగల్ జిల్లా లక్నేపలిల్లో జన్మించిన నరసింహారావు చిన్నప్పటి నుండే నాయకత్వ లక్షణాలు అలవరచుకున్నారు. హైదరాబాద్ సంస్థాల విముక్తి పోరాటంలో, నిజాం పాలనకు వ్యతిరేకంగా వందేమాతరం నినాదం ఇచ్చి ఉస్మానియా యూనివర్సిటీ నుండి బహిష్కృతులయ్యారు. శాసనసభ్యునిగా, మంత్రిగా సేవలు అందించిన తర్వాత సంయుక్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడు. కాంగ్రెస్ వర్గపోరాటాలు ఆయనను పదవి నుండి అర్ధంతరంగా తప్పించాయి.. కానీ ఆయన చేపట్టిన భూసంస్కరణలు ప్రశంసలందుకున్నాయి.. పార్లమెంట్ సభ్యునిగా, మంత్రిగా కేంద్ర మంత్రిగా ప్రతిభను చాటుకున్న పీవీని అనూహ్యంగా ప్రధానమంత్రి పదివి దక్కినా ఆయన ప్రతిష్టకు గ్రహణం తెచ్చింది..
నరసింహారావు గొప్ప సాహితీ వేత్త మాత్రమే కాదు 10కి పైగా భాషలు వచ్చు.. విశ్వనాథ సత్యనారాయణ వేయిపడగలుకు ఆయన పీవీ హిందీ అనువాదం సహస్రపణ్ కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు తెచ్చిపెట్టింది.. పలు అనువాదాలు, కథలతో పాటు తన ఆత్మకథను ఇన్ సైడర్ పేరిట రాశారు.. తెలుగులో ఇది లోపలి మనిషిగా అనువాదమైంది.. దీనికి కొనసాగింపుగా రెండో భాగం తెచ్చేలోపే పీవీ మన మధ్య లేకుండాపోయారు.. 2004 డిసెంబర్ 23న ఈ లోకాన్ని వీడారు..

తనపై వచ్చిన ఆరోపణలు అన్నింటికీ నరసింహారావు చెప్పిన సమాధానాలు.. చట్టం తన పని తాను చేసుకుపోతుంది.. కాలమే అన్ని సమస్యలను పరిష్కరిస్తుంది.. చరమాంకంలో అన్ని కేసుల నుండి కడిగిన ముత్యంలా బయట పడ్డారు.. ఆ మహా మనిషిని తలచుకొని నివాళులర్పిద్దాం..

No comments:

Post a Comment