Saturday, June 13, 2015

ఆప్ సర్కారులో అన్యాయ మంత్రులు

తాను డిగ్రీ చదివిన కాలేజీ, యూనివర్సిటీ ఎక్కడుందో ఆయనకే తెలియదు.. పోలీసులు అక్కడికి తీసుకెళ్లినా తరగతి గదులను, అధ్యాపకులను కూడా గుర్తించలేకపోయాడు. ఫేక్ డిగ్రీల కేసులో అరెస్టయిన ఢిల్లీ న్యాయ శాఖ మంత్రి జితేందర్ సింగ్ తోమర్ వ్యవహారం ఇది.. తమ మంత్రిని కేంద్ర ప్రభుత్వం కుట్ర పన్ని అన్యాయంగా అరెస్టు చేయించిందని లొల్లి చేసిన సీఎం అరవింద్ కేజ్రీవాల్ గొంతులో పచ్చి వెలగకాయ పడింది. పరువు కాపాడుకునేందుకు తోమర్ ను పార్టీలోంచి తొలగించుకునే పనిలో పడ్డాడిప్పుడు..
అంతకు 49 రోజుల పాలనలో న్యాయ మంత్రిగా ని చేసిన సోమనాథ్ భారతిది మరో వ్యవహారం.. మంత్రిగా వెలగబెట్టిన రోజుల్లో అర్ధరాత్రి వేళ అనుచరులతో ఢిల్లీలో ఉగండా యువతుల ఫ్లాట్ మీద దాడి చేసి వారు మత్తు పదార్ధాలు అమ్ముతున్నారని రాద్ధాంతం చేశాడు. అరెస్టు చేయాలని పోలీసుల మీద వత్తిడి తెచ్చాడు.. అందులో నిజం లేదని భావించిన పోలీసులు పట్టించుకోకపోవడంతో, సాక్షాత్తు మంత్రి ఆదేశించినా పట్టించుకోరా అంటు సీఎం కేజ్రీవాల్ రోడ్డెక్కి ధర్నాక దిగి రెండు రోజులు ఢిల్లీ ప్రజలకు నరకయాతన చూపించారు.. ఇంత చేసి కేజ్రీవాల్ సాధించింది ఏమిటయ్యా అంటే సదరు పోలీసులను బదిలీ చేయించడం.. సోమనాథ్ భారతిపై ఉగండా యువతులు పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకునే పరిస్థితి లేక పోవడంతో మహిళలపై చిన్నచూపును నిరసిస్తూ ఆమ్ ఆదీ పార్టీ నుండి కొందరు మహిళా నేతలు బయటకు వచ్చారు..
తాజాగా సదరు సోమనాథ్ భారతిపై గృహ హింస కేసు నమోదైంది. భర్త తనను అన్ని రకాలుగా హింసిస్తున్నాడని ఆయన భార్య లిపిక పోలీసుల్ని ఆశ్రయించింది.. తాను ఆప్ లో పని చేయడం భార్యకు ఇష్టంలేదని, తమ తల్లిని ఆమె నిర్లక్ష్యం చేస్తోందని సోమనాధ్ డొంక తిరుగుడు వాదన వినిపిస్తున్నాడు.. గతంలో సోమనాథ్ భారతిని వెనుకేసుకు వచ్చిన కేజ్రీవాల్ ఇప్పుడేమంటారో వేచి చూడాలి.. 49 రోజుల పాలనా సమయంలోనే రాఖీ బిర్లా అనే మంత్రి ఒక కేసు విషయంలో పోలీసు స్టేషన్ వెళ్లి దౌర్జన్యంగా వ్యవహరించినట్లు వార్తలు వచ్చాయి.

ఇదండీ ఆప్ అన్యాయ మంత్రుల కథ.. దేశ భద్రత కారణాల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం పోలీసు శాఖను ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వానికి బదలాయించలేకపోతోంది.. ఇప్పటికే లెఫ్టినెంట్ గవర్నర్ తో చీటికి మాటికీ గిల్లి కజ్జాలు పెట్టుకుంటూ, అధికారుల జీవితాలతో ఆడుకుంటున్నాడు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్.. తన పార్టీలో అచారక ప్రజాప్రతినిధులను వెనుకేసుకు వస్తున్నాడు.. కేజ్రీవాల్ డిమాండ్ చేస్తున్నట్లు పోలీసు శాఖ ఢిల్లీ ప్రభుత్వానికి బదలాయిస్తే ఇంకెన్ని అరాచకాలు జరిగేవో అనిపిస్తోంది..

No comments:

Post a Comment