Monday, August 29, 2016

మన తెలుగులో తెలుగెంత?

దేశ భాషలందు తెలుగు లెస్స అని శ్రీకృష్ణ దేవరాయలు అన్నారని పదే పదే గుర్తు చేసుకుంటాం.. కానీ తెలుగు క్రమంగా లెస్అవుతున్నా పట్టించుకోం..
హిందీ తర్వాత దేశంలో రెండో అతిపెద్ద భాష తెలుగు.. హిందీకి సొంత లిపి లేదు.. కానీ తెలుగుకు సొంత లిపి, అస్థిత్వం ఉంది.. కానీ ఏమి లాభం?
దేశంలోనే భాష పేరిట ఏర్పడిన తొలి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్.. కానీ అధికార భాషగా ఏనాడూ తెలుగు అమలుకు నోచుకోలేదు.. ఎందుకిలా?
మన సొంత రాష్ట్రాల్లో తెలుగును ఎందుకు బతుకు తెరువు భాషగా మార్చలేకపోయాం? ఎందుకు ఇంగ్లీషు వెంట పడుతున్నాం?

కొద్దిపాటి జనాభా ఉన్న దేశాలు తమ భాషను ప్రపంచ భాషలుగా రుద్దాయి.. తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా 10 కోట్లకు పెగా ఉన్న మనం తెలుగును ఎందుకు ప్రపంచ భాష చేయలేకపోతున్నాం?
అరవం వాడు తమ భాషకు ప్రాచీన హోదా తెచ్చుకున్నాడని, మనమూ కేంద్ర ప్రభుత్వంతో పోరాడి తెచ్చుకున్నాం.. కానీ ఒరిగిందేమిటి?..
బ్రిటిష్, కుతుబ్ షాహీ, నిజాం పరాయిపాలనలో వికసించిన తెలుగు భాష, సొంత పాలకుల హయాంలో ఎందుకు కొడిగట్టుకుపోతోంది?
ఈ రోజున మనం మాట్లాడుతున్న తెలుగు భాషలో ఎన్ని తెలుగు పదాలు ఉన్నారో గమనించారా?..
తెలుగు టీవీ ఛానళ్లలో కనీసం 50 శాతం తెలుగు కూడా లేని సంగతి మీకు తెలుసా? తెలుగు పత్రికల్లో వాడే భాషలో 20 శాతం కూడా తెలుగు లేని విషయాన్ని గుర్తించారా?
అంతర్జాలంలో ఇంగ్లీషుకు ఉన్న సౌలభ్యం తెలుగు భాషకు ఎందుకు లేదు?.. వందలాది ఇంగ్లీషు ఫాంట్లు ఉచితంగా దొరుకుతాయి.. కానీ మనకు తెలుగు ఫాంట్లు మరీ అంత ఖరీదుగా మారాయెందుకు?
ప్రపంచంలో వేగంగా అంతరిస్తున్న భాషల్లో తెలుగు ఒకటని యునెస్కో ఏనాడో గుర్తించింది.. ఈ సంకేతాలు మీకు కనబడటం లేదా?
తెలుగు భాషకు అన్యాయం జరుగుతోందని, పాలకులు నిర్లక్ష్యం చేస్తున్నారని గగ్గోలు పెడుతున్నాం.. కానీ మన ఇళ్లలో, మన చుట్టు పక్కల సమాజంలో భాషను కాపాడుకుంటున్నామా?.. ప్రభుత్వాల మీద ఎందుకు వత్తిడి తేలేకపోతున్నాం..
తమిళ, కన్నడ రాష్ట్రాల్లో ఎన్ని రాజకీయాలు ఉన్నా వారి మాతృభాషను కాపాడుకోవడంలో అంతా ఒకటి అవుతారు.. ఈ పరిస్థితి మన తెలుగు రాష్ట్రాల్లో ఎందుకు లేదు?..
ఈ ప్రశ్నల్లో కనీసం 50 శాతమైనా ఆలోచింపజేస్తే మనలో తెలుగు భాషాభిమానం ఇంకా ఉన్నట్లే.. ఈ ఆశాభావమే తెలుగు భాష సంరక్షణకు పునాది కావాలి..
ఆగస్టు 29న తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు.. 

No comments:

Post a Comment