‘ ప్రపంచమంతా
నిద్రిస్తున్న వేళ భారత జాతి జాగృతమై స్వాతంత్ర్యాన్ని పొందుతున్నది.. ’మరి కొద్ది గంటల్లో తాను చేసే ఉపన్యాస ప్రతికి మెరుగులు దిద్దుకుంటూ
మురిసిపోతున్నారు జవహర్ లాల్ నెహ్రూ.. కానీ ఆ సమయంలో భారత మాత మహా విషాదంలో
మునిగిపోయింది.. స్వాతంత్ర్యంతో పాటే కన్నీరు కార్చాల్సిన దురదృష్టకర సందర్భం..
ఆగస్టు 15, 1947 అర్ధరాత్రి బానిసత్వ పాలన నుండి విముక్తి..
కానీ ఒక రోజు ముందే ఆగస్టు 14న దేశం ముక్కలైంది.. బ్రిటిష్ వారి కుటిల నీతి,
కాంగ్రెస్ – ముస్లింలీగ్ నాయకుల
అధికార దాహానికి మన మాతృభూమి చీలిపోయింది.. పాకిస్తాన్ ఆవిర్భావం.. భరతమాతకు తీరని
శోకం.. లక్షలాది మంది భారతీయులు రాత్రికి రాత్రే పరాయి దేశస్తులైపోయారు.. కొత్త
సరిహద్దులకు ఆవతల, దేశమంతటా నెత్తురు చిందింది.. ఎందరో అభాగ్యులు మాన ప్రాణాలు
కోల్పోయారు.. తరతరాలుగా పూర్వీకుల నుండి వచ్చిన ఆస్తులను విదిలేసుకొని
కట్టుబట్టలతో కాందీశీకులుగా తరలి వచ్చారు.. మన నాయకులు చేసిన పాపానికి లక్షలాది
మంది సామాన్య ప్రజలు మూల్యం చెల్లించుకున్నారు.. దేశ చరిత్రలోనే అత్యంత విషాదకర
సందర్భమిది..
భారత దేశ స్వాతంత్ర్యం కోసం ఎందరో
మహనీయులు పోరాటం చేశారు.. త్యాగాలు చేశారు.. ప్రాణాలు కోల్పోయారు.. కానీ ప్రతి ఫలం
ఏమిటి? దేశ విభజనతో
స్వాతంత్ర్యమా?.. త్యాగాలు చేసింది ఒకరైతే, అప్పనంగా ఫలాలు అనుభవించింది మరి కొందరు..
రెండో ప్రపంచ యుద్దంలో బ్రిటిష్ వారు
విజయం సాధించినా, రవి అస్తమించని సామ్రాజ్యాన్ని ఇక నిలుపుకోలేమని గ్రహించారు..
అప్పటికే భారత దేశమంతటా బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఉద్యమాలు, పోరాటాలు పతాక స్థాయికి చేరాయి.. సుభాష్
చంద్రబోస్, భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్
తదితర విప్లవ వీరుల పోరాటాలను చూసి భయపడిపోయిన లండన్ పాలకులు ఇలాంటి స్థితిలో భారత
దేశాన్ని నిలుపుకోవడం సాధ్యం కాదని నిర్ణయానికి వచ్చేశారు.. కానీ యధాతథంగా
స్వాతంత్ర్యం ఇచ్చేస్తే భారత దేశం నుండి ఏనాటికైనా తమకు ముప్పు అని భయపడ్డారు..
ఇలాంటి కుట్రలో పురుడు పోసుకున్న విషాద ఘటలనే దేశ విభజన..
బ్రిటిష్ వారి కుట్రకు పావులుగా
దొరికారు కాంగ్రెస్, ముస్లిం లీగ్
నాయకులు.. మహ్మద్ అలీ జిన్నాను దువ్వి ద్విజాతి సిద్ధాంతాన్ని తెరపైకి తెచ్చారు.. ముస్లింట
కోసం ప్రత్యేక దేశం ఏర్పాటు చేయకుండా భారత దేశానికి స్వాతంత్ర్యం ఇస్తే ఒప్పుకునేది
లేదని పట్టుబట్టాడు జిన్నా.. ఆయన ఇచ్చిన ప్రత్యక్ష చర్య పిలుపుతో దేశ వ్యాప్తంగా
మత కల్లోలాలను చెలరేగి అమాయక ప్రజలెందరో ఊచకోతకు గురయ్యారు.. దేశ విభజన కోసం కాంగ్రెస్
నాయకులపై వత్తిడి పెరిగింది.. అప్పటికే వీరిలో చాలా మంది వృద్ధులు.. తమ జీవిత
కాలంలో పదవులు అనుభవిస్తామో లేదో అనే బెంగ పట్టుకుంది వారికి.. పైకి ఇష్టం లేనట్లు
మేకపోతు గాంభీర్యాన్నిప్రదర్శిస్తూనే దేశ విభజనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు..
స్వాతంత్ర్యం వచ్చిందని సంబర పడాలా భారత
మాత ముక్కలైందని బాధను పడాలా అన్నది
తేల్చుకోలేని దుస్థితి.. స్వాతంత్ర్య
దినోత్సవాలు జరుపుకోవాల్సిందే.. మన పెద్దల త్యాగాలను స్మరించుకోవాల్సిందే.. కానీ
అదే సమయంల్ చరిత్ర నుండి గుణపాఠం నేర్చుకోవాలి.. మళ్లీ ఇలాంటి దుస్థితి మన
దేశానికి రాకూడదు.. అందుకు మనం చేయాల్సిన కర్తవ్యం ఏమిటో ఆలోచించండి..
No comments:
Post a Comment