Sunday, August 21, 2016

అక్షర యోధుడు షోయబ్ బలిదానం

ప్రతి మనిషికి మరణం తప్పదు.. చావు నుండి తప్పించుకోలేం.. అయితే ఆ మరణం ఒక లక్ష్యం కోసం జరగాలి దేశం కోసం మరణించడానికి నేను సంతోషిస్తాను - షోయబుల్లా ఖాన్
హైదరాబాద్ సంస్థానాన్ని నిరంకుశుడైన ఏడో నిజాం నవాబు మీర్ ఉస్మాన్ అలీఖాన్ పాలిస్తున్న రోజులవి.. మధ్య యుగాల నాటి ప్యూడల్ పాలన.. సంస్థానంలో పౌర హక్కులు లేవు.. మెజారిటీ ప్రజల మతం, విద్య, సంస్కృతి, సాంప్రదాయాలంటే పాలకులకు ఏమాత్రం గౌరవం లేదు.. నిజాం నవాబు ప్రోత్సాహంతో  రజాకార్ల ఆడగాలు మరోవైపు.. పగలంతా నిజాం పాలన సాగితే, రాత్రి రజాకార్లు గ్రామాలపై పడేవారు.. అందిన కాడికి దోచుకోవడం, మహిళలను చెరచడం, అడ్డం వచ్చిన వారిని చంపేయడం, ఇళ్లు, ఆస్తులు తగుల పెట్టడం నిత్యకృత్యంగా మారింది..
1947 ఆగస్టు 15న భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చినా, హైదరాబాద్ ఇంకా విముక్తి కాలేదు.. బ్రిటిష్ వారి సామంతుడు నిజాం తాను స్వతంత్రుడినని ప్రకటించుకున్నారు.. సంస్థాన ప్రజలంతా భారత దేశంలో విలీనం కావాలని కోరుకుంటున్నారు.. ఆర్యసమాజ్, స్టేట్ కాంగ్రెస్, కమ్యూనిస్టులపై నిర్భందం పెరిగింది.. నిజాం నవాబుకు అండగా నిలిచిన రజాకార్ల నాయకుడు కాశీం రజ్వీ మరింత రెచ్చిపోయాడు  అనల్ మాలిక్ నినాదంతో  హిందూ, ముస్లింల మధ్య చిచ్చు పెట్టి తన ఆగడాను ఉదృతం చేశారు రజాకార్లు..
ఇలాంటి వేళ గర్జించిందో ముస్లిం జర్నలిస్టు కలం.. నిజాం పాలన, నిజాం దురాగతాలపై షోయబుల్లాఖాన్ తన ఇమ్రోజ్ పత్రిక ద్వారా నిప్పులు చెరిగాడు.. 1920లో వరంగల్‌జిల్లా మహబూబాబాద్‌లో జన్మించిన షోయబుల్లాఖాన్ ఉస్మానియా యూనివర్సిటీ లో గ్రాడ్యుయేషన్ చేశారు. ప్రభుత్వ ఉద్యోగాన్ని కాలదన్ని జర్నలిజం వృత్తిని ఎన్నుకున్నాడు.. ముందుముల నరసింగరావు సంపాదకత్వంలోని జాతీయవాద పత్రిక రయ్యత్లో చేరాడు.. రజాకార్లూ, భూస్వాముల ఆగడాలపై వ్యాసాలు రాసేవాడు.. దీంతో ప్రభుత్వం రయ్యత్ ను నిషేధించింది..
ఇంతటితో ఆగని షోయబుల్లాఖాన్ ఇమ్రోజ్అనే సొంత పత్రికను ప్రారంభించాడు.. మరింత దూకుడుగా నిజాం, రజాకార్లను ఎండగట్టాడు.. ఈ ధిక్కార స్వరాన్ని సహించలేకపోయాడు కాశిం రజ్వీ.. అందునా ఇక ముస్లిం ఇలా అక్షరాయుధాలు ఎక్కుపెట్టడం జీర్ణించుకోలేకపోయాడు..  ఇలాగైతే ప్రాణాలకు ముప్పు అని షోయబుల్లాకు బెదిరింపులు వచ్చాయి..  ‘‘సత్యాన్వేషణలో మరణిస్తే అది గర్వించదగిన విషయం’’ అంటూ నిజాం షోయబుల్లాఖాన్‌ లేఖ రాశాడు..
1948 ఆగస్టు 21 అర్ధరాత్రి.. తెల్లవారితే 22.. కాచీగూడలోని ఇమ్రోజ్ కార్యాలయంలో పనిముగించుకుని ఇంటికి బయలుదేరాడె షోయబుల్లా.. లింగంపల్లి చౌరస్తా దగ్గర కత్తులు, తుపాకులతో రజాకార్లు దాడి చేశారు.. నిజాలను నిర్భయంగా రాసిన షోయబుల్లా అమరుడైపోయాడు.. షోయబుల్లా ప్రాణ త్యాగం వృధాగా పోలేదు.. మరికొద్ది హైదరాబాద్ సంస్థానం విముక్తమై భారత దేశంలో విలీనమైంది..
జాతీయవాద జర్నలిస్టు షోయబుల్లాఖాన్ స్మృతిలో ఉస్మానియా యూనివర్సిటీ జర్నలిజం శాఖ ప్రతి ఏటా అత్యధిక మార్కులు సాధించిన జర్నలిస్టుకు గోల్డ్ మెడల్ ప్రధానం చేయడం ఆనవాయితీగా వస్తోంది.. ఈనాడు దేశంలో మత తీవ్రవాదం, విద్రోహ కార్యకలాపాలు పెరిగిపోతున్న నేపథ్యంలో షోయబుల్లా ఖాన్ లాంటి జాతీయవాద జర్నలిస్టు అవసరం చాలా ఉంది.. షోయబుల్లా ఖాన్ అమర్ హై..


No comments:

Post a Comment