Wednesday, August 24, 2016

బాధ్యత ప్రభుత్వానిదేనా? మీది కాదా?

130 కోట్ల జనాభా గల పెద్ద దేశం సాధించింది రెండు పతకాలేనా? అందులో ఒకటి వెండి, ఇంకోటి కాంస్యం.. ఒక్క బంగారు పతకమైనా గెలిచారా సిగ్గు సిగ్గు..పెదవి విరిచాడు మా రావు గారు..
ఇది మన ప్రభుత్వాల వైఫల్యం.. మరోసారి హుంకరించాడు..
మాస్టారూ మీరు మాట్లాడుతున్నది ఏ విషయంలో?.. కాస్త అమాయకంగానే అడిగాను..
నువ్వేమి జర్నలిస్టువయ్యా? ఆ మాత్రం అర్థం చేసుకోలేవా?.. నేను మాట్లాడేది రియో ఒలింపిక్స్ లో మన దేశ వైఫల్యంగురుంచి.. కాస్త కసురుకున్నట్లే జవాబిచ్చాడు రావు..
అది సరేగానీ రావుసాబ్.. మీ పిల్లలేం చేస్తున్నారు?..

అబ్బాయి ఇంజినీరింగ్ సెకండియర్.. మా అమ్మాయి ఇంటర్ బైపీసీ ఫైనల్ ఇయర్.. డాక్టర్ అవ్వాలనుకుంటోంది.. కాస్త కుతూహలంగా చెప్పాడు..
ఓహో.. మీ ఇంట్లో ఒకరు ఇంజినీరు, మరొకరు డాక్టర్ అవుతున్నారన్నమాట..
కాస్త గర్వంగా కాలరెగరేస్తూ నావైపు లుక్కిచ్చుకున్నారు రావుగారు..
మీ పిల్లలు ఏమైనా ఆటలాడతారా? క్రికెట్, హాకీ, టెన్నిస్, కబడ్డీ, చెస్.. ఇంకేమైనా?..
వాళ్లకు అంత తీరికెక్కడిది నాయనా? పొద్దున్నే కాలేజీకి వెళ్లి రాత్రికి గానీ తిరిగి రారు.. కాలేజీలోనే స్పెషల్ కోచింగ్.. రాత్రికి ఇంటికి వచ్చాక కాస్త మింగుడు పడి పడుకుంటారు.. మళ్లీ పొద్దున్నే ఉరుకులు, పరుగులు..
కనీసం సెలవు రోజుల్లో అయినా ఆడుకునేందుకు పోతారా?..
కష్టపడి చదువుకోవాల్సిన వయసులో ఆటలు ఎందుకు?.. ఆటల మీద ధ్యాస పెడితే, వారి చదువు సంకనాకి పోదా? కాస్త ఆగ్రహంగానే బదులిచ్చారు రావు గారు..
గురుడు దొరికి పోయాడు.. నా మొహంపై ఓ చిరునవ్వు మొలిచింది.. ఇక అప్పుడందుకున్నాను..
రావు సాబ్.. ఏమంటిరి ఏమంటిరి?.. ఆటలాడితే చదువు సంకనాకి పోతదా?.. అందరూ కెరీర్ పేరిట తమ పిల్లలకు ఆటలకు దూరం చేసి పుస్తకాల పురుగులను చేస్తే, క్రీడాకారులు ఎలా తయారవుతారు?.. ఒలింపిక్స్, ఏసియన్ గేమ్స్ లో మన దేశానికి పతకాలు ఎలా వస్తాయి?
గతుకుక్కు మన్నారు రావు గారు.. కాస్త ఇబ్బందిగా మొహం పెట్టి అక్కడి నుండి నిష్క్రమించాడు..
మన దేశం ఒలింపిక్స్ లో పతకాలు సాధించలేదని, ప్రభుత్వం క్రీడాకారులను ప్రోత్సహించడం లేదని నిందిస్తారు.. కానీ తమ పిల్లలు క్రీడాకారులు కావాలని ఏ తల్లి దండ్రులూ కోరుకోరు.. సాయంకాలం వేళ వారిని ఆడుకోవడానికి పంపరు.. అందరూ తమ పిల్లలు చదువులకే పరిమితం కావాలని కోరుకుంటే, క్రీడాకారులు ఎలా తయారవుతారు? దేశానికి పతకాలను ఎవరు తీసుకు వస్తారు..
మీ పిల్లలు చదువుకునే స్కూళ్లలో ప్లే గ్రౌండ్స్ ఉన్నాయా? వాటిలో ఏయే ఆటలు ఆడిస్తున్నారు?.. అసలు స్కూళ్లలో పీఈటీలు అనేవారు ఉన్నారా?.. ఈ ప్రశ్నలకు మీ దగ్గర ఏమైనా జవాబు ఉందా?
తల్లి దండ్రులు ముందు తమ పిల్లలు ఆడుకునే స్వేచ్ఛ ఇవ్వాలి.. వారి ఇష్టాఇష్టాలను గమనించాలి.. క్రీడలపై వారికి ఆసక్తి ఉంటే ప్రత్యేక శిక్షణ ఇప్పించాలి.. ఇవేవీ పట్టించుకోకుండా ప్రభుత్వాలదే తప్పు అని బండరాయి పడేయడం ఎంత వరకు సమంజసం?.. ఆలోచించండి..

No comments:

Post a Comment