Wednesday, August 31, 2016

వానలకు తట్టుకోలేని నగరమా..

కేవలం ఒకపూట, అదీ కొద్ది గంటలు కురిసిన భారీ వర్షానికే హైదరాబాద్ మహానగరం అతలాకుతలమైపోయింది.. రోడ్లు నదుల్లా మారాయి.. బస్తీలు, కాలనీలు చెరువులను తలపించాయి.. 2000 సం.నాటి విపత్తును తలచుకొని జనం భయపడిపోయారు.. 425 ఏళ్ల మన మహానగరానికి ఏమిటీ దుస్థితి?
ఒకప్పుడు హైదరాబాదు భాగ్ నగర్ (ఉద్యాన నగరం),లేక్స్ సిటీ (చెరువుల నగరం)గా గుర్తింపు ఉండేది.. ఈ మహానగర పరిధిలో 500కు పైగా చిన్నా పెద్ద చెరువులు, కుంటలు, కాలువలు, తోటలు ఉండేవి.. ఇవన్నీ గొలుసుకట్టు పద్దతిలో ఒకదానికొకటి అనుసంధానమై వరద నీరు మూసీలో కలిసేది.. (చిత్రాన్ని చూడండి) కానీ ఇప్పుడు ఇందులో 10వ వంతు కూడా ఇప్పుడు కనిపించడంలేదు..
నగరీకరణ పేరుతో అన్నింటినీ మింగేశారు.. చెరువులు, కాలువలు కబ్జా చేసి కాలనీలు, బస్తీలు, భవన సముదాయాలు నిర్మించారు.. మరి వాన పడితే నీరు ఎక్కడికి పోవాలి.. అందుకే వాన పడితే చాలు నీరంతా రోడ్లమీదకు వస్తోంది.. డ్రైనేజీలు, కాలువలపై వత్తిడి పెరిగి నగరం చెరువులా మారిపోతోంది.. ఈ పరిస్థితికి కారణం ఎవరు?
పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా నివాస వసతి కల్పించాలంటే చెరువులు, కుంటలను పూడ్చాల్సిందేనా?.. జనావాసాలకు తగ్గట్లుగా డ్రైనేజీలు, కాల్వలను విస్తరించాల్సిన అవసరం లేదా?.. కబ్జాలను తొలగించి, జలప్రవాహాలకు ఆటంకాలు నివాలించే ప్రయత్నం ఎందుకు  చేయడం లేదు? తప్పు ప్రభుత్వానిదేనా? ఇందులో మన పాత్ర లేదా? ఒక్కసారైనా ఆత్మ పరీక్ష చేసుకున్నామా?..

No comments:

Post a Comment