Sunday, September 16, 2012

17.09.1948 నాడు ఏం జరిగింది?

సెప్టెంబర్ 17.. ఈ తేదీ దగ్గర పడుతున్న సమయంలో చర్చ మొదలౌతుంది.. ఆ తర్వాత అంతా మరిచిపోతారు.. నిజాలు ఎలా ఉన్నా చరిత్రకు వక్ర భాష్యాలు చెప్పే వారు ఎక్కువయ్యారు.. ఈ భాష్యాలతో చారిత్రిక సత్యాలు మరుగున పడుతున్నాయి.. ఈ చారిత్రిక దిన ప్రతిష్ట దిగజారుతోంది.. ఇంతకీ 1948 సెప్టెంబర్ 17న ఏం జరిగింది?..
హైదరాబాద్ సంస్థానాన్ని పాలించిన అసఫ్ జాహీ వంశ పాలకుడు ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ నిరంకుశ పాలన గురుంచి తెలుసుకోవాలనుకుంటే ఇంకా జీవించి ఉన్న ఆనాటి వయోవృద్దులను అడిగి చూడండి.. నిజాం పాలనలో ప్రజల కనీస హక్కులపై తీవ్రమైన నిర్భందం ఉండేది.. తెలుగువారు తమ మాతృభాషలో చదువుకునే హక్కు లేదు.. పండుగలు, మత ఆచారాలపై ఆంక్షలు ఉండేవి.. రాజకీయ పార్టీలపై నిషేధం కొనసాగింది.. రజాకార్లు, జాగీర్దార్లు, దేశ్ ముఖ్లు ప్రజలను ఎంతగానో పీడించారు.. బీబీనగర్, బైరోనిపల్లి తదితర గ్రామాలు ఈ దురాగతాలకు సజీవ సాక్ష్యాలు.. తెలంగాణ పల్లెల్లో ఈ అరాచకాల గురుంచి నేటికీ కథలు కథలుగా చెప్పుకుంటారు.. ఏడో నిజాం నిరంకుశ పాలనపై కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలతో పాటు ఆర్యసమాజ్ తమదైన సైద్దాంతిక దృక్పథాలతో పోరాటం సాగించాయి..

నిజాం నిరంకుశ పాలనపై జరిగిన పోరాటంలో ఎందరో వీరులు అమరులయ్యారు.. వీరి గాథలు వెలుగు చూడకుండాపోయాయి.. రజాకార్ల దౌర్జన్యాలపై ధైర్యంగా రాసిన ఇమ్రోజ్ పత్రిక ఎడిటర్ షోయబుల్లాఖాన్ ను వారి నాయకుడు కాసిం రజ్వీ దారుణంగా హత్య చేయించాడు.. 15 అగస్టు 1947 రోజున భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చింది.. కానీ హైదరాబాద్ సంస్థాన ప్రజలు ఇంకా చీకటి పాలనలోనే మగ్గిపోయారు.. హైదరాబాద్ స్వతంత్రంగానే ఉంటుందని నిజాం ప్రభువు ప్రకటిస్తే, ఢిల్లీ ఎర్రకోటపై అసఫ్ జాహీ పతాకం (నిజాం జెండా) ఎగురేస్తానని కాసిం రజ్వీ విర్రవీగాడు.. సంస్థానంలో క్షీణిస్తున్న పరిస్థితులను గమనించిన ప్రభుత్వం హైదరాబాద్ నలువైపుల నుండి ఆపరేషన్ పోలో పేరిట సైనిక చర్య (పోలీస్ యాక్షన్) చేపట్టింది.. నాలుగు రోజుల పోరాటం తర్వాత నిజాం ప్రభువు లొంగుబాటును ప్రదర్శించి, 1948 సెప్టెంబర్ 17న హైదరాబాద్ ను భారత దేశంలో సంపూర్ణంగా విలీనం చేశారు..

ఆనాటి హైదరాబాద్ సంస్థానంలో భాగాలుగా ఉండి తర్వాత మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో చేరిన జిల్లాల్లో విలీన వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు.. కానీ హైదరాబాద్ సంస్థానంలోని ప్రధాన భూభాగమైన తెలంగాణలో మాత్రం ఈ ఉత్సవాలు జరగవు.. ఉత్సవాలు జరిపితే మైనారిటీలు నొచ్చుకుంటారని మన పాలకుల భయం.. నిజానికి నిజాం నిరంకుశ పాలనపై పోరాటంలో హిందువులతో పాటు ముస్లింలు కూడా భాగస్వాములుగా ఉన్నారు.. కానీ ఈ చారిత్రిక సత్యాన్ని తొక్కి పెడుతూ, చరిత్రకు వక్రభాష్యాలు చెబుతున్నారు.. ఎందుకీ వంచన?.. విలీనమా? విమోచనమా? దురాక్రమణా? అనే చర్చ అర్థరహితం.. హైదరాబాద్ (తెలంగాణ) ప్రజలకు స్వాతంత్ర్యం వచ్చిన 17 సెప్టెంబర్ వేడుకలను ఘనంగా జరుపుకుందాం..

No comments:

Post a Comment