Saturday, September 29, 2012

కపట నాటకాలు కట్టిపెట్టండి..

అంతా వంచన.. కపట నాటకం.. అధికార పక్షం, ప్రధాన ప్రతిపక్షం ఒక్కటే.. తెలుగు ప్రజలు దారుణంగా మోసపోతున్నారు.. తెలంగాణ విషయంలో కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు అవలంభిస్తున్న విపరీత ధోరణికి అంతు లేకుండా పోయింది.. సమస్య ఎటూ తేలకుండా జఠిలం కావడానికి అటు సోనియా గాంధీ, ఇటు చంద్రబాబు నాయుడు శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నారు..
తెలంగాణపై ప్రధానంగా నిర్ణయం తీసుకోవాల్సింది ఈ రెండు పార్టీలే.. సమస్యకు ఆజ్యం పోస్తూ జాప్యం చేస్తున్నారు.. ఎక్కడ సెల్ఫ్ గోల్ అవుతుందనో ఈ రెండు పార్టీల అధినేతలకు భయం.. అసలు తెలంగాణ సమస్య ముదరడానికి వీరు చేసిన అంతులేని జాప్యమే కారణం.. తమ రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం తెలంగాణ రాష్ట్ర సమితితో 2004 ఎన్నికల్లో కాంగ్రెస్, 2009లో టీడీపీ పొత్తు పెట్టుకున్నాయి.. ఆనాడు తాము తెలంగాణకు అనుకూలమే అంటే ప్రకటించాయి.. ఏరు దాటాక బోడి మల్లన్న అంటూ సమస్యను దాటవేశాయి..
2009లో తెలంగాణ ఉద్యమం తీవ్ర రూపం దాల్చాక హోంమంత్రి చిదంబరం డిసెంబర్ 9న ప్రకటన చేయగానే కాంగ్రెస్, టీడీపీలోని సీమాంధ్ర నేతలు తమ కపటకాలకు తెర తీశారు.. ఎన్నికల్లో పొత్తు పెట్టుకున్నప్పుడు లేని అభ్యంతరాలు తెలంగాణ ఇవ్వడానికి ఎందుకో? నిజానికి తెలంగాణను ప్రధానంగా వ్యతిరేకిస్తున్న వారంతా వ్యాపారవేత్తల నుండి నాయకులుగా ఎదిగిన వారే.. తమ స్వార్థ ప్రయోజనాల కోసం తెలంగాణ ప్రజల ప్రత్యేక రాష్ట్ర వాంఛను బలి పెడుతున్నారు.. ఉద్యమంలో బలవుతున్న వారి ఉసురు వీరికి తాకకమానదు..
తమ స్వరాష్ట్రాల్లో విఫల నాయకులైన గులాంనబీ ఆజాద్, వయలార్ రవిలకు తెలంగాణ సమస్యను పరిష్కరించే సత్తా ఎక్కడిది? ఎందుకు చెత్త వాగుడు వాగి తెలంగాణ వాదులను మరింత రెచ్చగొడుతున్నారు.. పరిష్కరించడం చేత కాకపోతు నోరుమూసుకొని పడుండాలి..కాంగ్రెస్ అధిష్టానం ఇంకెంత కాలం మోసం చేస్తుంది?
లేఖ పేరిట హైడ్రామా నడిపిన టీడీపీ అధినేత చంద్రబాబు చివరకు పట్టుకున్నది కొండను తవ్వి ఎలుకను పట్టుకోవడమే.. ఆయన కొత్తగా చెప్పిందేముంది?.. అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయమంటున్నారు.. అఖిలపక్షం పెడితే మళ్లీ ఇరు ప్రాంతాల నేతలు మళ్లీ రెండు నాలుకలతో వాధించడం కోసమే కదా?
ఇక తెలంగాణ క్రెడిట్ అంతా తనకే దక్కాలని ఆశపడుతున్నతెరాస అధినేత చంద్రశేఖర రావు ఇంత కీలక సమయంలో ఢిల్లీ వెళ్లి వెలగబెడుతున్న రాచ కార్యం ఏమిటి?.. కొండా లక్ష్మణ్ బాపూజీ అంత్య క్రియల్లో కూడా పాల్గొనే తీరిక లేనంత లాబీయింగ్ అక్కడేమి నడుపుతున్నట్లు? ఉద్యమంలో కలిసొచ్చే పార్టీలను కలుపుకొని పోకుండా, కాంగ్రెస్ అధిష్టానాన్ని ఆయన ఇంకా గుడ్డిగా ఎందుకు నమ్ముతున్నట్లు?..
తెలంగాణ వస్తే అసలు ఎవరికి నష్టం? ఎందుకు తెలుగు ప్రజల్లోభయాన్ని, గందరగోళాన్ని సృష్టిస్తున్నారు? ఇరు ప్రాంతాలు స్వయంప్రతిపత్తితో అభివృద్ది అవుతాయి కదా? ప్రభుత్వ ఉద్యోగాల ప్రాధాన్యత తగ్గన ఈ రోజుల్లో తెలంగాణ, కోస్తా, రాయలసీమలతో సహా దేశంలో ఎక్కడికైనా వెళ్లి ఉపాధిని వెతుక్కునే స్వేచ్ఛ ప్రతి భారతీయునికీ ఉంటుంది.. సీమాంధ్రులు తెలంగాణకు. తెలంగాణ వారు సీమాంధ్రకు వెళ్లి ఉద్యోగాలు చేసుకుంటే అడ్డుకునేవారెవరు? ఇదేమన్నా దేశ విభజన సమస్యా? బయటి వారు వచ్చి తమను కొల్లగొడుతున్నారనే అపోహలు ఎందుకు?
తెలంగాణ, కోస్తా, రాయలసీమతో సహా ఇతర రాష్ట్రాలు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలారా.. మనం వాస్తవిక దృక్పథంతో ఆలోచించి ముందుకు సాగుదాం.. కొందరు నాయకుల స్వార్థ రాజకీయాలకు అతీతంగా ఆలోచించండి.. ఇలాంటి స్వార్థ రాజకీయ పార్టీలకు బుద్ది చెబుదాం.. ప్రజల ఆకాంక్షలను గౌరవిద్దాం.. ముందు మనం భారతీయులం, ఆ తర్వాతే తెలుగువారం..

No comments:

Post a Comment