Wednesday, September 5, 2012

ఉపాధ్యాయుల స్థానం ఎక్కడ?

గురువును బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులతో పోల్చాయి మన పురాణాలు.. తల్లిదండ్రుల తర్వాత స్థానం గురువుదేనని చెప్పారు మన పెద్దలు.. పిల్లలకు విద్యాబుద్దులు నేర్పించి వారి భవిష్యత్తుకు పునాదులు వేసే ఉపాధ్యాయులకు మన సంస్కృతిలో ప్రముఖ స్థానమే ఉంది.. అయితే ఇదంతా నిన్నటి చరిత్రగానే మగిలిపోనుందా?

నేటి గురు శిష్య సంబంధాలు చూస్తే బాధ కలుగుతోంది.. విద్య అంగడి సరుకయ్యాక ఇది ఒక వ్యాపారికి, వినియోగదారునికి సంబంధించిన వ్యవహారమైపోయింది.. ఇదీ ఒక క్విడ్ ప్రొకో అంటే ఎలాంటి అతిషయోక్తి లేదు.. చదువుకునే వారు కరువై, చదువు కొనే వారు తయారయ్యారు.. ఉపాధ్యాయుల గౌరవం కూడా మసకబారింది.. నేటి సినిమాల్లో ఉపాధ్యాయులను బఫూన్ల మాదిరిగా, విద్యార్థులు వారిని టీజ్ చేసే వారిగానే చూపిస్తున్నారు.. సారీ టీచర్ లాంటి చిత్రాలు మరీ పరాకాష్టగా మారాయి.. ఇది చాలదన్నట్లు అక్కడక్కడా కీచక టీచర్లకు సంబంధించిన వార్తలు చూస్తున్నాం.. విలువలతో కూడిన విద్యకు, నైతిక విద్యకు స్థానం లేకుండాపోయింది..
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు పూర్తిగా దిగజారిపోయాయి.. ప్రయివేటు టీచర్లతో పోలిస్తే ఎన్నో రెట్లు అధిక జీతాలు తీసుకునే ప్రభుత్వ ఉపాధ్యాయులు తమ బాధ్యతలను ఏనాడో గాలికి వదిలేశారు.. ఈ పరిస్థితిని సరిదిద్దే పని తమది కాదన్నట్లుగా వ్యవహరిస్తున్నాయి ఉపాధ్యాయ సంఘాలు.. ఈ సంఘాల నేతలు దళారులుగా తయ్యారని చెప్పడానికి బాధ కలుగుతోంది.. ఈ పరిస్థితులు మారాలని ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా కోరుకుందాం.. - క్రాంతి దేవ్ మిత్ర

No comments:

Post a Comment