Monday, September 15, 2014

విమక్తి ఉత్సవాలకు మతం రంగా?

17 సెప్టెంబర్ వస్తోందంటే కొందరికి ఎందుకో గుండెల్లో రైళ్లు పరుగెత్తుతాయి.. హైదరాబాద్ సంస్థానం భారత దేశంలో విలీనం అయిన రోజు.. నిజాం నవాబు నుండి విముక్తి పొందిన రోజు.. తరతరాల బూజు వదిలిన రోజు ఇది..  అసబ్ జాహీ వంశం నిరంకుశ పాలన, రజాకార్ల దురాగతాల, భూస్వాముల దోపిడి నుండి హైదరాబాద్ ప్రజలకు విముక్తి లభించిన దినమిది.. భారత దేశమంతటికీ 15 ఆగస్టు 1947 నాడు స్వాతంత్ర్యం వస్తే, హైదరాబాద్ ప్రజలు మాత్రం 17 సెప్టెంబర్ 1948 నాడు స్వేచ్ఛా వాయువులు పీల్చారు.. కానీ హైదరాబాద్ సంస్థానంలో భాగమైన తెలంగాణ ప్రజలు ఏనాడు ఉత్సవాలకు నోచుకోలేదు..
హైదరాబాద్ సంస్థానంలో భాగంగా ఉండి పొరుగు రాష్ట్రాల్లో కలిసిపోయిన మరాఠ్వాడ, హై.కర్ణాటక ప్రాంతాల్లో అక్కడి ప్రభుత్వాలు అధికారికంగా విలీన ఉత్సవాలు జరుపుతాయి.. కానీ హైదరాబాద్ సంస్థానంలో ప్రధాన భూభాగమై తెలంగాణలో మాత్రం ఉత్సవాలు జరగవు.. ఎందుకు?
సమైక్య ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గత ఆరున్నర దశాబ్దాల పాలనలో ఏనాడు హైదరాబాద్ విముక్తి ఉత్సవాలను నిర్వహించలేదు.. బీజేపీతో పాటు కమ్యూనిస్టులు సైతం పాలకులను ఉత్సవాలు జరపాలని కోరినా పెడ చెవిన పెడుతూ వచ్చారు.. తెలంగాణ ప్రజల చిరకాల కోరిక ఫలించి ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాతైనా 17 సెప్టెంబర్ ఉత్సవాలు ఘనంగా జరుగుతాయని అంతా ఆశించారు.. కానీ ఈ విషయంలో తెరాస ప్రభుత్వ స్పందించడం లేదు.. అంటే ఉత్సవాలు లేనట్లే అని అర్ధం చేసుకోవాలి.. ఎందుకిలా జరుగుతోంది?
హైదరాబాద్ సంస్థానం పాలకుడు మీర్ ఉస్మాన్ అలీఖాన్ ను గద్దె దింపినందుకు ముస్లింలు బాధ పడ్డారట.. పోలీస్ యాక్షన్ తర్వాత ఎంతో మంది ముస్లింను ఊచకోత కోశారట.. 17 సెప్టెంబర్ ఉత్సవాలు జరిపితే వారి మనోభావాలు దెబ్బతింటాయన.. ఇదండీ కొందరు వితండ వాదుల వాదన..
హైదరాబాద్ విముక్తి పోరాటం ఎందుకు జరిగింది? నిజాం నిరంకుశ పాలన, రజాకార్ల అరాచకాల కారణంగానే కదా? మరి మతం ప్రసక్తి ఎందుకు వస్తోంది?.. హైదరాబాద్ విముక్తి కోసం పోరాటం చేసింది కేవలం హిందువులేనా?.. ముస్లింలంతా ఏక మొత్తంగా నవాబు పక్షాన నిలిచారా?.. మరి షోయబుల్లా ఖాన్, షేక్ బందగీ,  ముక్దుం మొయినుద్దీన్ ఎవరు?..
నిజాం పాలనపై అక్షరాయుధాలు సంధించిన పాత్రికేయుడు షోయబుల్లాఖాన్ ను రజాకార్ల మూకలు నరికి చంపాయి.. నిజాం పాలనకు ప్రతిరూపమైన విసునూరు దేశ్ ముఖ్ రాంచంద్రారెడ్డిపై తిరుగుబాటు బావుటా ఎగురవేసిన షేక్ బందగీ అనే పేద రైతును పొట్టన పెట్టుకున్నారు.. కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో సాగిన తెలంగాణ సాయుధ పోరాటంలో కార్మిక నాయకుడు ముక్దుం మొయినుద్దీన్ కీలక పాత్ర పోషించారు.. వీరంతా ముస్లింలు కాదా?.. 17 సెప్టెంబర్ దినోత్సవానికి ఎందుకు మతం రంగు పులిమారు? అసలు ఎవరి వత్తిడి కారణంగా ఈ ఉత్సవాలు అధికారికంగా చేపట్టడం లేదు? ఎందుకీ ముసుగులో గుద్దులాట?
అసలు 17 సెప్టెంబర్ 1948 తేదీన హైదరాబాద్ విముక్తి జరగకపోతే చరిత్ర గతి ఎలా ఉండేది? ఒక్కసారి ఊహించుకోండి.. ఆంధ్రప్రదేశ్ అవతరించిన 1 నవంబర్ 1956కు కానీ, తెలంగాణ రాష్ట్రం సిద్దించిన 2 జూన్ 2014కు ప్రాధాన్యత వచ్చేదా?.. అసలు మన పాలకులకు హైదరాబాద్ సంస్థానం భారత దేశంలో విలీనం కావడమే ఇష్టం లేదా?.. సంకుచిత విధానాలు, రాజకీయాలు, కుహనా లౌకికవాద ముసుగును తొలగించుకొని ఇప్పటికైనా హైదరాబాద్ విముక్తి ఉత్సవాలను అధికారికంగా జరపాల్సిన అవసరం ఉంది.. 

No comments:

Post a Comment