Wednesday, September 17, 2014

బానిస సంకెళ్లు తెగిన చారిత్రిక దినోత్సవం..

తరతరాల బూజు వదిలిన రోజు.. శతాబ్దాల ప్యూడల్ పాలన నుండి విముక్తి లభించిన మహోన్నత ఘట్టం.. స్వేచ్ఛ కోసం తపించిన ప్రజల బానిసత్వ సంకెళ్లు తెగిన రోజు ఇది.. 17 సెప్టెంబర్ 1948
భారతదేశం నడిబొడ్డున క్యాన్సర్ కణితిలా తయారైన హైదరాబాద్ సంస్థానంలోకి భారత సైన్యం నలు వైపుల నుండి దూసుకు వచ్చింది.. నిరంకుశ పాలన అందించిన ముసలి నవాబుకు వాస్తవం తెలిసి వచ్చింది.. స్వతంత్ర హైదరాబాద్ కోసం ఆయన కన్న కలలు పటాపంచలయ్యాయి.. మెజారిటీ ప్రజల ప్రజాస్వామ్య ఆకాంక్షలను గౌరవించక తప్పని పరిస్థితి ఏర్పడింది.. ఏడు తరాలు పాలించిన తన సంస్థానాన్ని భారత దేశంలో విలీనం చేయడానికి అంగీకరించాడు మీర్ ఉస్మాన్ అలీఖాన్..
మత మౌఢ్యం, ప్యూడలిజం, నిరంకుశత్వం.. మధ్య యుగం నాటి పాలనా లక్షణాలను సజీవంగా కొనసాగిస్తూ వచ్చింది అసఫ్ జాహీ వంశం.. ప్రపంచమంతా వస్తున్న పరిపాలనా సంస్కరణలు


వారికి పట్టలేదు.. తన సంస్థానంలో మెజారిటీ ప్రజల ఆకాంక్షలను నిర్లక్ష్యం చేశాడు నిజాం నవాబు.. గ్రామీణ ప్రాంత ప్రజలు భూస్వాముల (దేశ్ ముఖ్, దేశ్ పాండే, దొరలు) కింద నలిగిపోయేవారు.. సమాజంలో కొన్ని ఉన్నత వర్గాలకు మాత్రమే గౌరవం, మర్యాదలు దక్కేవి.. మిగతా ప్రజలవి బానిస బతుకులే.. పరిపాలనలో మతత్వం పాతుకుపోయింది.. మెజారిటీ ప్రజల భాష, సంస్కృతి సాంప్రదాయాలకు విలువలేదు.. రక్తపిపాసులైన రజాకార్లను అడ్డం పెట్టుకొని పాలన పాలన సాగించాడు నిజాం ప్రభువు.. రజాకార్లు గ్రామాలపై పడి మారణకాండ సృష్టించారు.. మహిళల మానప్రాణాలు దోచుకున్నారు.. ఇవేవీ పట్టలేదు నవాబుగారికి.. ప్రజాస్వామిక హక్కుల కోసం పోరాడిన ఆంధ్రమహాసభ, ఆర్యసమాజం, స్టేట్ కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలను నిషేధించారు.. ఆ పార్టీల నాయకులను జైలు పాలు చేసి చిత్ర హింసలు పెట్టారు..

15 ఆగస్టు 1947న భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చింది.. అప్పటి వరకూ బ్రిటిష్ వారికి సామంతుడిగా ఉన్న ఉస్మాన్ అలీఖాన్ హైదరాబాద్ సంస్థానం స్వతంత్ర్యం రాజ్యంగా ఉంటుందని ప్రకటించాడు.. ఇందు కోసం పాకిస్తాన్ మద్దతు తీసుకునే ప్రయత్నం చేశాడు.. ఇతర సంస్థానాల మాదిరే హైదరాబాద్ ను భారత్ లో విలీనం చేయాలని మెజారిటీ ప్రజలు కోరుకుంటే వారి ఆకాంక్షలపై నీళ్లు చల్లాడు నిజాం నవాబు.. ఢిల్లీ ఎర్రకోటపై అసబ్ జాహీ పతాకం ఎగురవేస్తానని విర్రవీగాడు రజాకార్ల నాయకుడు కాశీం రజ్వీ.. హైదరాబాద్ లో పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తూ వచ్చారు కేంద్ర హోంశాఖ మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్.. పరిస్థితులు చేజారక ముందే స్పందించారు.. పోలీస్ యాక్షన్ (ఆపరేషన్ పోలో) అమలు చేశారు.. ఐదు రోజుల యుద్దంలో హైదరాబాద్ సైన్యం తోక ముడిచింది.. భారత సైన్యానికి సంస్థాన ప్రజలు జేజేలు పలికారు.. 17 సెప్టెంబర్ 1948న భారత దేశంలో సంపూర్ణంగా విలీనం అయిపోయింది హైదరాబాద్ సంస్థానం..

No comments:

Post a Comment