Tuesday, September 23, 2014

బతుకు అమ్మా.. బతకవమ్మా.. బతుకమ్మ అయింది.

తెలంగాణ వ్యాప్తంగా బతుకమ్మ సంబురాలు మొదలయ్యాయి.. పల్లె, పట్నం, వీధి, గుడి అంతటా బతుకమ్మ పాటలు, ఆటలు వినిపిస్తున్నాయి.. రంగు రంగుల పూలతో త్రికోణాకారంలో పేర్చి అలంకరించిన బతుకమ్మల చుట్టూ చప్పట్లు చరుస్తూ వలయంగా తిరుగుతూ పాడే బతుకమ్మ పాటలను, ఆటనూ విని, చూసి తరించాల్సిందే కానీ వర్ణించడం కష్టమే.. బొడ్డెమ్మతో మొదలు ఎంగిలిపుప్వు బతుకమ్మ, సద్దుల బతుకమ్మ.. ఇలా దేని ప్రత్యేకత దానిదే.. తొమ్మిది రోజుల పాటు కొనసాగే బతుకమ్మలను బావిలో లేదా నీటి ప్రవాహంలో నిమజ్జనం చేస్తారు.. 
ఇంతకీ బతుకమ్మ పాటల్లో ఏమి ఉంటుంది?.. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో.. అని సాగే ఈ పాటల్లో మహిళలు తమ కష్ట సుఖాలు, ప్రేమ, స్నేహం, బంధుత్వం, ఆప్యాయతలు, భక్తి, భయం, చరిత్ర, పురాణాలు మేళవిస్తారు.. ఈ పాటలు చాలా వినసొంపుగా ఉంటాయి.. తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీక ఈ బతుకమ్మ పండుగ.. తెలంగాణ అస్థిత్వం బతుకమ్మలోనే ఉంది..
తెలంగాణ నేలపై బతుకమ్మ పండుగను శతాబ్దాలుగా జరుపుకుంటున్నారు.. ఈ సాంప్రదాయం ఎలా మొదలైందో చెప్పడానికి ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి.. నవాబులు, భూస్వాముల పెత్తందారీ తనంలో నలిగిపోయిన తెలంగాణ గ్రామీణ సమాజంలో మహిళల బతుకులు దుర్భరంగా ఉండేవి.. వారి అకృత్యాలకు నలిగిపోయిన వారిని, తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకున్నవారిని తలచుకొని తోటి మహిళలు విచారించేవారు.. వారికి ప్రతీకగా పూలను పేర్చి బతుకవమ్మా లేదా బతుకు అమ్మా అంటూ దీవిస్తూ పాటలు పాడేవారు.. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో.. పాటల వెనుక ఉండే మర్మం ఇదే..
మరో కథనం ప్రకారం ధర్మాంగదుడనే రాజు సంతానం కోసం చేసిన పూజల వల్ల ఆడ కూతురు జన్మించింది.. లేక లేక పుట్టిన ఆ బిడ్డకు బాలా రిష్టాలు గట్టెక్కేందుకు బతుకమ్మా అనే పేరు పెట్టారట.. గ్రామాల్లో ఇంకా ఎన్నో రకాల గాథలు ప్రచారంలో ఉన్నాయి.. ఏ కథనం ఎలా ఉన్నా బతుకమ్మ అంటే బతుకు మెరుగు పరిచే అమ్మ అని చెప్పవచ్చు.. గ్రామీణ మహిళలు లక్ష్మి, పార్వతి దేవతలను బతుకమ్మల రూపంలో కొలుస్తారు.. మొదట గ్రామ సీమలకే పరిమితమైన ఈ పండుగ, అక్కడి నుండి వలస వచ్చే వారితో పట్నాలలోనూ మొదలైంది.. ఒకనాడు గ్రామాలుగా ఉన్న ప్రాంతాలు నగరాలుగా మారినా ఈ సాంస్కృతిక పరంపర కొనసాగుతూ వచ్చింది..
బతుకమ్మ వెనుక సుఖ సంతోషాలే కాదు.. విషాదాలూ ఉన్నాయి.. అసఫ్ జాహీల పాలనలో ముఖ్యంగా చివరి నిజాం నవాబు కాలంలో మహిళలపై రజాకార్ల దాష్టీకాలు కొనసాగాయి.. బీబీనగర్ తదితర ప్రాంతాల్లో ఈ రక్తపిపాసులు మహిళలను నగ్నంగా బతుకమ్మ ఆడించి వారి రహస్యావయాలపై కర్రలతో మోదిన ఘటనలను వినవచ్చు.. తెలంగాణ వ్యాప్తంగా ఇలాంటి విచార గాథలను ఇప్పటికీ బతికే ఉన్న ఆనాటి తరం పెద్ద వారు చెబుతుంతారు..
తెలంగాణ అస్థిత్వం, పోరాటం, తెలంగాణ ఉద్యమం పుణ్యమా అని ఈ రోజున బతుకమ్మ ప్రపంచ వ్యాప్తమైపోయింది.. గత కొన్ని సంవత్సరాలుగా అమెరికా, బ్రిటన్ తదితర దేశాల్లో ఉన్న తెలంగాణ వాసులు, ఆంధ్ర, రాయలసీమ ప్రాంత తెలుగు వారు సైతం బతుకమ్మ సంబురాలను జరుపుకుంటున్నారు.. విదేశాల్లో తెలుగువారి ఐక్యతకు బతుకమ్మ సైతం ప్రతీకగా నిలిచింది.. సీమాంధ్రలో సాగిన సమైక్యాంధ్ర ఉద్యమ సమయంలో అక్కడి మహిళలు కూడా బతుకమ్మ ఆడి కలిసి ఉందాం అనే సందేశాన్ని వినిపించారు..
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తరుణంలో బతుకమ్మ పండుగకు ప్రాధాన్యత మరింతగా పెరిగిపోయింది..

No comments:

Post a Comment