Friday, September 12, 2014

విముక్తి దినోత్సవం అధికారికంగా జరుగుతుందా?

17 సెప్టెంబర్ వచ్చేస్తోంది.. తెలంగాణ (హైదరాబాద్ స్టేట్) భారత దేశంలో సంపూర్ణంగా విలీనం అయిన రోజు ఇది.. ఈ ప్రాంత ప్రజలు తొలిసారిగా స్వేచ్ఛా వాయువులు పీల్చిన రోజు.. కానీ ఈ విజయోత్సవాన్ని ఎందుకు తొక్కి పెట్టారు?
దేశానికి 15 ఆగస్టు 1947 నాడు స్వాతంత్ర్యం వచ్చినా హైదరాబాద్ సంస్థానం నిజాం పాలనలో మగ్గింది.. నిరంకుశ నిజాం, రజాకార్ల ఆగడాలకు వ్యతిరేకంగా ఆర్యసమాజం, స్టేట్ కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలు మహోద్యమాన్ని నడిపాయి.. ఎందరో ప్రాణాలు కోల్పోయారు.. జైలు పాలయ్యారు.. చివరకు కేంద్ర హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ తీసుకొని 17 సెప్టెంబర్ 1948న ఆపరేషన్ పోలో (పోలీస్ యాక్షన్) ద్వారా హైదరాబాద్ ను భారత్ లో సంపూర్ణంగా విలీనం చేశారు.
1 నవంబర్ 1956 నాడు హైదరాబాద్ రాష్ట్రంలోని తెలంగాణ ప్రాంతం, ఆంధ్ర రాష్ట్రం విలీనమై ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది.. మరాఠ్వాడా ప్రాంతం బొంబాయి రాష్ట్రం (ప్రస్తుత మహారాష్ట్ర)లో కలిసింది.. హైదరాబాద్ కర్ణాటక ప్రాంతం మైసూర్ స్టేట్ (ప్రస్తుత కర్ణాటక)లో విలీనం అయింది.. మరాఠ్వాడా, హైదరాబాద్ కర్ణాటక ప్రాంతాల్లో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి ఏటా 17 సెప్టెంబర్ నాడు హైదరాబాద్ విముక్తి దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తున్నాయి.. కానీ పాత హైదరాబాద్ రాష్ట్రంలోని ప్రధాన భూభాగం తెలంగాణలో మాత్రం విముక్తి దినోత్సవాలను సమైక్య ఆంధ్రప్రదేశ్ పాలకులు ఏనాడూ నిర్వహించిన పాపాన పోలేదు.. అలా నిర్వహిస్తే కొందరు నొచ్చుకుంటారని భయపడుతూ వచ్చారు..
ఇప్పుడు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడింది.. 17 సెప్టెంబర్ రాబోతోంది.. నిజాం రాక్షస పాలన నుండి తెలంగాణ (హైదరాబాద్ స్టేట్) స్వతంత్రమైన రోజు ఇది..  తెలంగాణ ప్రభుత్వం కచ్చితంగా విముక్తి దినోత్సవాన్ని అధికారికంగా
నిర్వహించి తీరాలి.. అప్పుడే అమరవీరుల త్యాగాలకు సరైన నివాళి..

జై తెలంగాణ.. జై హింద్..

No comments:

Post a Comment