Friday, March 27, 2015

గెలిచింది ఎవరు?.. ఓడింది ఎవరు?

అందరి మొహాల్లో ఒకటే విచారం, నిరాశానిస్పృహలు.. కారణం ఇండియా ఓడిందట.. ఓడింది ఇండియాకు సోకాల్డ్ ప్రాతినిధ్యం వహించిన క్రికెట్ జట్టు నాయనా అని సవరించాను.. అదీ మన దేశ ప్రభుత్వానికి ఎలాంటి సంబంధంలేని బీసీసీఐ వాటి టీమ్ మాత్రమే అని చెప్పాను.. వాళ్లు గెలిచినంత మాత్రాన మనం వారికి కట్లు బానిసలం అయిపోలేదు కదా అని నచ్చజెప్పాను.. ఏదైతేనేం పళ్లు రాలగొట్టుకోవడానికి అంటూ మిట్ట వేదాంత ధోరణిలో నిరాశా నిస్పృహలను చాటుకున్నాడో మిత్రుడు.. క్రికెట్ పిచ్చి నషాలానికి ఎక్కిన వారికి ఎంత చెప్పినా తక్కువే కదా?
"Cricket is a game played by 11 fools and watched by 11,000 fools.." అంటే 11 మంది అవివేకులు ఆడుతుంటే 11,000 మంది అవివేకులు చూసే ఆటే క్రికెట్.. ప్రఖ్యాత మేధావి, నోబుల్ బహుమతి గ్రహీత జార్జ్ బెర్నార్డ్ షా దాదాపు 70 ఏళ్ల క్రితం చేసిన వ్యాఖ్యలివి.. అప్పట్లో ఇంగ్లాండ్, వారి ఆధీన దేశాల్లో మాత్రమే క్రికెట్ ఆడేవారు.. కానీ ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది విరగబడి చూస్తున్నారీ ఆటను.. ఇంత ప్రాచుర్యం పొందినా, ప్రపంచ వ్యాప్తంగా పట్టుమని 30 దేశాలకు  కూడా విస్తరించలేదు క్రికెట్.. ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ఆధరణ ఉన్న క్రీడ సాకర్.. ఆ తర్వాతే ఏ క్రీడ అయినా.. ఏ ఆట గొప్పదని నేను చర్చిండం లేదిక్కడ..
బ్రిటిషోడు పోతూ పోతూ మన దేశానికి అంటింటి పోయిన జాడ్యం క్రికెట్ అంటారు కొందరు.. కానీ అది అది పాక్షిక సత్యం మాత్రమే.. వాళ్లు క్రికెట్ ఒక్కటే మనకు నేర్పలేదు. హకీ, ఫుట్ బాల్ లాంటి ఆటలనూ పరిచయం చేశారు.. దేశ స్వాతంత్ర్యానికి ముందు, తర్వాత కూడా మన దేశంలో అత్యంత ఆదరణ ఉన్న ఆట హకీ.. అప్పట్లే ప్రపంచ చాంపియన్లం మనమే.. హకీకి పర్యాయ పడదంగా మన దేశం పేరు తెచ్చుకున్నది భారత్.. కాలక్రమంలో హాకీని దిక్కులేని ఆటగా మార్చేసుకున్నాం.. హాకీ క్రీడాకారులను అంటరాని వారిగా చూస్తూ, క్రికెట్ నూ, ఆ ఆట ఆడే వారిని దేవుళ్లలా పూజిస్తూ నెత్తినెక్కించుకున్నాం..
క్రికెట్ ఇప్పడు కేవలం ఓ వ్యాపార క్రీడ మాత్రమే.. కోట్లాది రూపాయల పారితోషికాలు, ప్రసార అనుమతులు, బెట్టింగులతో ముడిపడిన ఆట ఇది.. టీవీలో మ్యాచి వస్తుంటే పని పాటా మానేసి టీవీ సెట్లకు అతుక్కుపోయి, విరగబడి చూస్తుంటాం.. ఎంత సమయం, ఎంత శ్రమ శక్తి వృధా చేస్తున్నామో ఆలోచించారా?.. క్రికెట్ ఆటపై మన దేశ ప్రభుత్వానికి ఎలాంటి కంట్రోల్ లేదు.. అది మన జాతీయ క్రీడ కూడా కాదు.. బోర్డ్ ఆఫ్ క్రికెట్ కంట్రోల్ ఆఫ్ ఇండియా అనే  కొంత మంది పెత్తందారుల గుత్తాధిపత్యంలో సాగుతున్న డ్రామా మాత్రమే..  ఎవరో గెలిచారని వెర్రి కేకలతో గంతులేస్తూ సంబరపడాల్సిన అవసరం లేదు.. అలాగే ఎవరో ఓడిపోయారని మనం చంకలు గుద్దుకొని ఆనందించాల్సిన పని కూడా లేదు.. ఆటను, ఆటగాళ్లనూ సమానంగానే చూద్దాం.. నిజమైన క్రీడా స్పూర్తితో వ్యవహరిద్దాం..
( 2015 ప్రపంచం క్రికెట్ కప్ లో బీసీసీఐ జట్టు ఫైనల్స్ కు చేరలేదని కలత చెందుతున్న తోటి భారతీయులకు సానుభూతితో..)

No comments:

Post a Comment